సిద్ధూపై బిక్రమ్ సింగ్‌ను పోటీకి దింపిన సాద్

ABN , First Publish Date - 2022-01-27T01:22:09+05:30 IST

అమృత్‌సర్ (ఈస్ట్) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌ సిద్ధూపై ..

సిద్ధూపై బిక్రమ్ సింగ్‌ను పోటీకి దింపిన సాద్

న్యూఢిల్లీ: అమృత్‌సర్ (ఈస్ట్) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న పీపీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ (సాద్) తమ అభ్యర్థిని ప్రకటించింది. సాద్ అభ్యర్థిగా మాజీ మంత్రి బిక్రం సింగ్ మజిథియాను బరిలోకి దింపుతున్నట్టు సాద్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బుధవారంనాడు ప్రకటించారు. తమ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. ''నువ్వు (సిద్ధూ) ఎంత గట్టిగా ప్రయత్నించినా నెగ్గలేవు'' అని సిద్ధూకు, కాంగ్రెస్ పార్టీకి ఆయన బహిరంగ సవాలు విసిరారు. పంజాబీ ప్రజలు ఎవరి వెనక ఉన్నారో తాము చెప్పదలచుకున్నామని, తప్పుడు ప్రచారం, తప్పుడు ఆరోపణలు చేయడం మినహా ఆయనకు (సిద్ధూ)కు పనేమీ లేదని బాదల్ విమర్శించారు. ఈసారి బహుజన్ సమాజ్‌వాదీ పార్టీతో సాద్ పొత్తు పెట్టుకుంది. బీఎస్‌పీ 20 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతుండగా, తక్కిన సీట్లలో సాద్ పోటీ పడుతోంది.


కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ ఈస్ట్ నుంచి సిద్ధూ 60,477 ఓట్లతో గెలిచారు. సాద్-బీజేపీ అభ్యర్థి రాకేష్ కుమార్ హనీ 17,668 ఓట్లతో రెండో స్థానంలోనూ, ఆప్ అభ్యర్థి సరజ్‌జిత్ సింగ్ ధాంజల్ 14,715 ఓట్లతో మూడు స్థానంలోనూ నిలిచారు. 42,661 ఓట్ల తేడాతో సిద్ధూ గెలుపొందారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 117 నియోజకవర్గాలకు గాను ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-27T01:22:09+05:30 IST