త్యాగ చరిత.. వీర వనిత

ABN , First Publish Date - 2022-08-13T04:54:41+05:30 IST

శ్రమజీవుల కడగండ్లు తీర్చేందుకు పోరాడుతూ బ్రిటీష్‌ వారి తుపాకీలకు బలైన వీరనారి సాసుమాను గున్నమ్మ. మందస మండలంలోని గుడారి రాజమణిపురం గ్రామవాసి. 1940 ఏప్రిల్‌ 1న చరిత్రాత్మక మందస పోరాటంసందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆమె అసువులు బాసింది. ఆ గ్రామం వీర గున్నమ్మ పురంగా వాసికెక్కింది. 1988 సెప్టెంబరు 10న నాటి గవర్నర్‌ కుముద్‌బెన్‌జోషి ఆ గ్రామాన్ని సందర్శంచి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

త్యాగ చరిత.. వీర వనిత
వీజీపురం మార్గంలో ఏర్పాటు చేసిన గున్నమ్మ స్మారక ముఖద్వారం, శిలాఫలకం

బ్రిటీష్‌ తుపాకులకు బలైన సాసుమాను గున్నమ్మ
(హరిపురం)

శ్రమజీవుల కడగండ్లు తీర్చేందుకు పోరాడుతూ బ్రిటీష్‌ వారి తుపాకీలకు బలైన వీరనారి సాసుమాను గున్నమ్మ. మందస మండలంలోని గుడారి రాజమణిపురం గ్రామవాసి. 1940 ఏప్రిల్‌ 1న చరిత్రాత్మక మందస పోరాటంసందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆమె అసువులు బాసింది. ఆ గ్రామం వీర గున్నమ్మ పురంగా వాసికెక్కింది. 1988 సెప్టెంబరు 10న నాటి గవర్నర్‌ కుముద్‌బెన్‌జోషి ఆ గ్రామాన్ని సందర్శంచి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరనారి గున్నమ్మ చర్రిత తెలుసుకుందాం.
స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 1940 మార్చి 26, 27 తేదీల్లో పలాసలో అఖిలభారత కిసాన్‌ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సభల్లో మందస ప్రాంత రైతులు విరివిగా పాల్గొన్నారు. సభకు ఎద్దుల బళ్లపై వెళ్లిన వారంతా తిరుగు పయనంలో అడవిలో కలప తెచ్చుకొనేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే బ్రిటీష్‌ సైనికులు మందసకోట ఎదురుగా ఉన్న బళ్లను విప్పి పశువులను వదిలేశారు. దీంతో రైతులంతా మూకుమ్మడిగా తిరగబడ్డారు. మార్చి 30న తాలుకా మెజిస్ట్రేట్‌, ఎస్‌ఐ, బ్రిటీష్‌ పోలీసులు గుడారి రాజమణిపురం (జీఆర్‌పురం) వచ్చారు. తనిఖీలు నిర్వహించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌ 1న సబ్‌కలెక్టర్‌, ఉన్నతాధికారులు, పోలీసులు గ్రామానికి వచ్చి కేసు నమోదైన వారిని జైలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. జీపులో వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. రైతులంతా ఎదురుతిరిగారు. జీపులు ముందు కూర్చుని ఎక్కించిన వారిని దింపివేశారు. రైతులు, బ్రిటీష్‌ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులకు నాయకత్వం వహించిన సాసుమాను గున్నమ్మ వారిని తీవ్రంగా ప్రతిఘటించింది. భీతిల్లిపోయిన బ్రిటీష్‌ పోలీసులు కాల్పులు జరిపారు. వారితో పోరాడిన 26ఏళ్ల సాసుమాను గున్నమ్మ తుపాకీ తూటాలకు బలైంది. ఈ కాల్పుల్లో గున్నమ్మతోపాటు రైతులు గొర్లె జగ్గయ్య, కర్రి కలియాడు, గుంట చిననారాయణ, గుంట చక్రపాణి చనిపోయారు. కానిస్టేబుల్‌ దొడ్డాల రంగారావు కూడా మృతిచెందాడు. పోరాటంలో వీరత్వాన్ని చూపి అసువులు బాసిన వీరవనిత సాసుమాను గున్నమ్మ పేరుతో గుడారిరాజమణిపురం గ్రామాన్ని వీరగున్నమ్మపురంగా మార్చారు.

 

Updated Date - 2022-08-13T04:54:41+05:30 IST