అసమాన త్యాగధనుడు

ABN , First Publish Date - 2021-07-16T05:30:00+05:30 IST

హజ్రత్‌ ఇబ్రహీం త్యాగధనుడైన గొప్ప దైవ ప్రవక్త. ‘ఖలీలుల్లాహ్‌’ అనే బిరుదుతో ఆయనను పిలిచేవారు. అంటే ‘అల్లా్‌హకు స్నేహితుడు’ అని అర్థం. దేవునితో ఏకత్వం కోసం ఆయన ఎంతగానో తపించారు...

అసమాన త్యాగధనుడు

  •                         21న బక్రీద్‌


హజ్రత్‌ ఇబ్రహీం త్యాగధనుడైన గొప్ప దైవ ప్రవక్త. ‘ఖలీలుల్లాహ్‌’ అనే బిరుదుతో ఆయనను పిలిచేవారు. అంటే ‘అల్లా్‌హకు స్నేహితుడు’ అని అర్థం. దేవునితో ఏకత్వం కోసం ఆయన ఎంతగానో తపించారు. మొదట్లో సూర్య చంద్రులు, నక్షత్రాల కాంతితో ఆయన ప్రభావితం అయ్యారు. చివరకు అల్లాహ్‌ కృపతో ఋజుమార్గాన్ని పొందారు. తన జాతి వారిని అల్లాహ్‌ వైపు ఆహ్వానించారు. తన తండ్రితో, జాతితో, ఆనాటి పాలకులతో సైతం దైవ ధర్మం కోసం రాజీలేని పోరాటం సాగించారు. చివరకు దైవం విధించిన ధర్మ పరీక్షలో నెగ్గారు. అనంతరం ఇరాక్‌, ఈజిప్ట్‌, సిరియా, పాలస్తీనా ప్రాంతాలకు వలస వెళ్ళారు.


సత్య ధర్మ ప్రచారంలోనే ఇబ్రహీం తన జీవితంలో ఎక్కువభాగం ఖర్చు చేశారు. వృద్ధాప్యం వచ్చాక ‘‘ఓ ప్రభూ! నాకు మంచి గుణాలు కలిగిన ఒక కుమారుణ్ణి ప్రసాదించు’’ అని అల్లా్‌హను వేడుకున్నారు. తన ప్రియ దాసుడి మొరను ఆలకించిన అల్లాహ్‌ ఒక బాలుణ్ణి అతనికి అనుగ్రహించాడు. ఆ బాలుడే దైవ ప్రవక్త ఇస్మాయిల్‌. 

ఇబ్రహీంను విశ్వప్రభువైన అల్లాహ్‌ మరో పరీక్షకు గురి చేశాడు. భార్య హజిరాను, ముద్దుల కుమారుడు ఇస్మాయిల్‌నూ కటిక కొండల్లో వదిలి పెట్టి రావాలని ఇబ్రహీంను ఆజ్ఞాపించాడు. ‘‘ఎందుకు?’’ అని ఇబ్రహీం ప్రశ్నించలేదు. ‘జనావాసాలు లేని ఆ ప్రదేశంలో తన భార్య, పసి పిల్లవాడి సంరక్షణ బాధ్యత ఎవరు వహిస్తారు?’ అని ఆలోచించలేదు. ప్రభువు ఆజ్ఞను శిరసా వహిస్తూ, ఆయన మీద అపారమైన నమ్మకంతో... భార్యనూ, బిడ్డనూ కొండల మధ్య వదిలిపెట్టి, వెనక్కు చూడకుండా వచ్చేశారు. కారుణ్య ప్రభువైన అల్లాహ్‌ వారిద్దరినీ సంరక్షించాడు. వారి కోసం జమ్‌ జమ్‌ నీటి ఊటను సృష్టించాడు. తనను ప్రసన్నం చేసుకోవడానికి... ప్రియమైన సంబంధ, బాంధవ్యాలను త్యజించే వారికి... ఇహలోక జీవితంలోనూ శుభాలను ప్రసాదిస్తాననీ, వారి ఊహకు అందని మార్గాల్లో ఉపాధిని అనుగ్రహిస్తాననీ లోకానికి వెల్లడి చేశాడు. 

ఒక రోజు రాత్రి... లేకలేక కలిగిన తన ముద్దుల కుమారుణ్ణి దైవ మార్గంలో... తన చేతులతోనే బలి ఇస్తున్నట్టు హజ్రత్‌ ఇబ్రహీం కలగన్నారు. ఆ విషయాన్ని తన కుమారుడికి ఆయన చెప్పారు. పసితనం నుంచే దైవం పట్ల విధేయతనూ, త్యాగ భావాన్నీ కలిగిన ఆ బాలుడు ఏమాత్రం చలించకుండా ‘‘నాన్నా! అదే దైవాజ్ఞ అయితే మీకు లభించిన ఆదేశాన్ని నిస్సంకోచంగా అమలు పరచండి. దైవం తలచుకుంటే... నన్ను మీరు సహనశీలిగా చూస్తారు’’ అని అన్నాడు.


చిన్నవాడైన ఇస్మాయిల్‌ దైవాదేశాన్ని పాటించి.. 

తన ప్రాణాన్ని ధార పొయ్యడానికి... నేల మీద ప్రశాంతంగా పడుక్కున్నాడు.  ప్రాణంకన్నా మిన్న అయిన తన కన్న కొడుకు మెడను కొయ్యడానికి... అతని కుత్తుకపై కత్తి పెట్టారు ఇబ్రహీం.

అప్పుడు ఇబ్రహీంకు అల్లాహ్‌ వాణి వినిపించింది  ‘‘ఓ ఇబ్రహీం! నువ్వు కలను నిజం చేసి చూపావు’’ అంటూ ఆ గొప్ప ఖుర్బానీకి పరిహారంగా పొట్టేలును ఇచ్చి... బలి నుంచి ఇస్మాయిల్‌ను అల్లాహ్‌ తప్పించాడు. భావితరాలలో శాశ్వతంగా నిలిచే కీర్తి ప్రతిష్టలను ఆ తండ్రీ కొడుకులకు ప్రసాదించాడు. 


ఈ విధంగా... మనసా, వాచా, కర్మణా తాను తన తల్లితండ్రులు, ఆప్తులు, భార్యాబిడ్డలు, ఆస్తి-అంతస్థులు... వీటన్నిటికన్నా అల్లా్‌హను అధికంగా ప్రేమిస్తున్నాననీ, అల్లాహ్‌ ప్రసన్నత కోసం మనోవాంఛల్నీ, ప్రాపంచిక వ్యామోహాల్నీ, బాంధవ్యాలనూ త్యజించడానికి తాను ఎల్లవేళలా సిద్ధమేననీ ఇబ్రహీం లోకానికి వెల్లడి చేశారు. అందుకే ప్రవక్తలకు పితామహునిగా ఆయన ప్రసిద్ధి చెందారు. మిల్లతే ఇబ్రహీంకు సంస్థాపకునిగా నిలిచిపోయారు.

ప్రపంచంలోని ముస్లింలు జిల్‌హజ్‌ మాసం పదవ రోజున బక్రీద్‌ (ఈద్‌ ఉల్‌ అజ్‌హా) పండుగను ఇబ్రహీం మహోన్నత త్యాగానికి గుర్తుగా... విశేషంగా జరుపుకొంటారు. తమ ప్రాణాలను అల్లాహ్‌ మార్గంలో త్యాగం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని ఖుర్బానీ ద్వారా చాటుతారు.  ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ రోజున సౌదీ అరేబియాలోని మక్కా నగరం హజ్‌ యాత్రికులతో కళకళలాడుతుంది.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌



Updated Date - 2021-07-16T05:30:00+05:30 IST