అప్పుల కోసం అన్నదాతను బలిపెడతారా?

ABN , First Publish Date - 2020-09-10T06:28:57+05:30 IST

అధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగం పట్ల, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకింత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయో బోధపడటం లేదు...

అప్పుల కోసం అన్నదాతను బలిపెడతారా?

వ్యవసాయ విద్యుత్తుకయ్యే ఖర్చంతా ఇకపై ప్రభుత్వమే భరిస్తుందన్నప్పుడు ఈ విద్యుత్ మీటర్ల కసరత్తంతా ఎందుకని అందరూ ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కంపెనీల ప్రయోజనం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఒకసారి మీటరు బిగించి యూనిట్ల ప్రకారం బిల్లులు చెల్లించడం మొదలు పెడితే అది తమ మెడకు గుదిబండ అవుతుందని, ఇదంతా ఉచిత విద్యుత్‌ నుంచి దశలవారీగా తప్పుకునేందుకే అని రైతులు ఆందోళన చెందుతున్నారు.


అధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగం పట్ల, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకింత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయో బోధపడటం లేదు. అదనపు అప్పులు తెచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆడమన్నట్లు ఆడుతూ నగదు బదిలీ పథకం పేరుతో ఉచిత విద్యుత్తుకు వెన్నుపోటు పొడుస్తోంది వైసీపీ ప్రభుత్వం. కేంద్రం షరతులను వ్యతిరేకించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఇలా మెతక వైఖరి అవలంబిస్తూ రైతు ప్రయోజనాలను పణంగా పెట్టడం సమర్థనీయం కాదు. సాగుకోసం అందించే విద్యుత్ ఉచితం అంటూనే రైతులపై అదనపు భారాన్ని మోపబోతోంది. ఇకపై వ్యవసాయ విద్యుత్‌ బిల్లులను రైతులు తమ జేబుల నుంచే చెల్లించాల్సిన పరిస్థితి రాబోతోంది. రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్‌ మీటర్ల బిగింపునకు అవకాశంలేని చోట ఇన్ఫ్రారెడ్‌ సమాచార ప్రామాణికం కలిగిన మీటర్లను ఏర్పాటు చేయబోతోంది. ఈ మీటర్ల బిగింపుతో పాటు బిల్లుల చెల్లింపును తొలుత రైతులే భరించాలని, ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్‌ బిల్లుల మొత్తాన్ని నగదు బదిలీ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


దీని కోసం ప్రత్యేకంగా రైతుల పేరుతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరవాలని సూచించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాలో కొత్తగా తెచ్చిన సంస్కరణలపై ఇంధనశాఖ కార్యదర్శి జీఓఎంఎస్‌ నంబరు 22 ద్వారా మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రత్యేకంగా ఏపీ హరిత ఇంధన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, ఈ మీటర్ల ద్వారా ప్రతి నెలా వచ్చే బిల్లును తామే చెల్లిస్తామని జీఓలో వెల్లడించారు. ఇలా వెల్లడిస్తూనే, మరోప్రక్క వ్యవసాయ పంపుసెట్లు ఏ నెలలో ఎంతెంత కరెంటు కాల్చుకొనే అవకాశం వుందో లెక్కగట్టింది ప్రభుత్వం. ఆ అంచనా ప్రకారం ఇప్పుడు ఉన్న పంపు సెట్లు ఏడాదికి 12 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడే అవకాశం వుందని, ఆ విధంగా ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని, ఆ మొత్తాన్ని నెలవారీగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుందని జీఓలో వెల్లడించారు. కానీ అంతకుమించి వాడకం పెరిగితే ఆ భారం ఎవరు భరించాలన్నది చెప్పలేదు. అసలు విద్యుత్తు పంపిణీ సంస్థలకే సబ్సిడీ డబ్బులు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం భవిష్యత్తులో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తుందనే గ్యారంటీ ఏమిటి? ఉచిత విద్యుత్తు రైతుల హక్కుగా సాధించుకొన్నది. దానిని నగదు బదిలీ పేరిట ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడినదిగా మార్చి సంక్షేమ పథకాల సరసన చేర్చడంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. 


అసలే సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని నగదు బదిలీ పథకం ద్వారా మరింత సంక్షోభంలోకి నెడుతుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలను ఆదుకునేందుకు రెండు శాతం అదనపు రుణం పొందేందుకు అవకాశం కల్పిస్తున్నామన్న కేంద్రం దానికోసం నాలుగు నిబంధనలు అమలు చేసి తీరాలని షరతు విధించింది. అప్పుడే ఒక్కో దానికి కొంత శాతం చొప్పున అదనపు రుణసౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. మొదటి నిబంధనలో భాగంగా ‘వన్ రేషన్, వన్ నేషన్’కు సంబంధించి అన్ని కార్డులను ఆధార్ కు అనుసంధానం చేస్తూ, రేషన్ దుకాణాలన్నిటిలో ఇ-పోస్ మిషన్లను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండవది ఆస్తి పన్ను, వృత్తి పన్ను, రిజిస్ట్రేషన్ ధరల పెంచి భూముల మార్కెట్ ధరలు సవరించడం. అందులో వ్యవసాయ విద్యుత్తుకు సంబంధించి రైతులకు నగదు బదిలీ పథకం ప్రధానం. ఇప్పటి వరకు వ్యవసాయం కోసం అందజేస్తున్న ఉచిత విద్యుత్తుకు ప్రభుత్వం ఎలాంటి బిల్లులను వసూలు చెయ్యడం లేదు. ఇకపై మాత్రం రైతులు విద్యుత్‌ బిల్లులను చెల్లించాల్సిందే. ఆ బిల్లుల మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నప్పటికీ మున్ముందు ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ముప్పు ఉండదని చెప్పే పరిస్థితి లేదు. వ్యవసాయ విద్యుత్తుకయ్యే ఖర్చంతా ఇకపై ప్రభుత్వమే భరిస్తుందన్నప్పుడు ఈ విద్యుత్ మీటర్ల కసరత్తంతా ఎందుకని అందరూ ప్రశ్నిస్తున్నారు. 


దాదాపు 20 ఏళ్లుగా సాఫీగా అమలవుతున్న ఉచిత విద్యుత్తు పథకానికి కొర్రీలు వెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రైవేటు కంపెనీల ప్రయోజనం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారు అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. డిస్కమ్‍లను ప్రయివేటీకరణ చేసేందుకే ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ విధానం తెస్తున్నారు. దేశంలోనే విద్యుత్ సంస్కరణలను పటిష్టంగా అమలు చేస్తున్న తొలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సలహాదారు ఒకరు కితాబు కూడా ఇచ్చారు. దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులను జగన్ సర్కార్ ఏమాత్రం వ్యతిరేకించకుండా వేగంగా అమలు చేస్తోం దని అవగతమవుతోంది. నగదు బదిలీ పథకాన్ని డిసెంబరులోగా అమలు చేయాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ నుంచే అమలు చేయాలని నిర్ణయించి, అందుకు శ్రీ కాకుళం జిల్లాను ఎంపిక చేసి మీటర్ల బిగింపునకు ఎందుకు పరుగులు పెడుతుందో అర్థం కావడం లేదు. ఈ పరుగులు నిజంగా రైతుల కోసమేనా? అప్పుల కోసం ఇంత హడావిడి చేసి వారి ప్రయోజనాల్ని పణంగా పెడతారా? పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ నగదు బదిలీ పథకాన్ని తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం భుజానికెత్తుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 'బజార్ బత్తెం, బాయిలో నీళ్ళు' అన్న చందంగా మారి అప్పు తెస్తే తప్ప పూటగడవడం లేదు. ఈ నేపథ్యంలో అదనపు అప్పుకోసం కేంద్రం ఆడమన్నట్లల్లా ఆడుతూ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధం కావడం అన్యాయం. ఇలాంటి చర్యలతో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న సంకల్పం నెరవేరుతుందా? 


ఒక పక్క తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానంటూ, వైఎస్ పేరుతో రైతు దినోత్సవాలు జరుపుతూ, మరో పక్క ఆయన అమలుచేసిన ఉచిత విద్యుత్తు పథకానికి తనయుడు జగన్మోహన్ తూట్లు పొడవడం రైతులను మోసం చెయ్యడం కాదా? దాదాపుగా 20 ఏళ్లుగా సాఫీ అమలవుతున్న ఉచిత విద్యుత్తుకు స్వస్తి చెప్పే చర్యల్ని పరోక్షంగా అమలు చేస్తూ మీటర్లు బిగించడం పేరిట ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఉచిత విద్యుత్‌ బిల్లుల్ని ఆయా సంస్థలకు ఎందుకు చెల్లించకూడదు? ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం మున్ముందు ఉచిత విద్యుత్తు బిల్లులు మాత్రం చెల్లిస్తుందన్న నమ్మకం ఏమిటి? ఒకసారి మీటరు బిగించి యూనిట్లు ప్రకారం బిల్లులు చెల్లించడం మొదలు పెడితే అది తమ మెడకు గుది బండ అవుతుందని, ఇదంతా ఉచిత విద్యుత్‌ నుంచి దశలవారీగా తప్పుకునేందుకే అని రైతులు ఆందోళన చెందుతున్నారు. సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టారు. ఈ పథకం కింద అసలు వడ్డీని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నా రైతులనే ముందు చెల్లించమంటూ, తర్వాత రీయంబర్స్ చేస్తామంటోంది. ఇప్పుడు ఉచిత విద్యుత్తు బిల్లుల విషయంలోనూ అదే పాట అందుకుంది. కేంద్రం విధించిన ఈ నిబంధన ద్వారా రాష్ట్రానికి అదనంగా వచ్చే అప్పు కేవలం ౦.15 శాతం. అంటే రూ.1515 కోట్లు మాత్రమే. దీని కోసం 18 లక్షలమంది రైతులను సమస్యల్లోకి నెడుతున్నారు. నగదు బదిలీ ముసుగులో స్వప్రయోజనమే ధ్యేయంగా రైతు శ్రేయస్సును దెబ్బతీస్తూ వంచించడం తగదు. అన్నదాతకు సాయం విషయంలో రాజకీయాల్ని చొప్పిస్తే వాళ్ల దేశ ఆహార భద్రతకు పెనుప్రమాదం ముంచుకు వచ్చినట్లేనని ప్రభుత్వాలు గుర్తించాలి. 

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2020-09-10T06:28:57+05:30 IST