సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో అనర్హత

ABN , First Publish Date - 2022-09-30T05:26:36+05:30 IST

అర్హత ఉన్నా సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈబీసీ నేస్తం లబ్ధి పొందలేకపోయామంటూ మహిళలు సచివాలయానికి తాళం వేశారు.

సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో అనర్హత
సచివాలయానికి తాళం వేసి అక్కడే ఆందోళన చేస్తున్న మహిళలు

న్యాయం చేయమని కోరితే విచారణతో కాలయాపన

సచివాలయానికి తాళం వేసిన ఈబీసీ నేస్తం బాధితులు

సత్తెనపల్లి రూరల్‌, సెప్టెంబరు 29: అర్హత ఉన్నా సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈబీసీ నేస్తం లబ్ధి పొందలేకపోయామంటూ మహిళలు సచివాలయానికి తాళం వేశారు. ఈ సంఘటన గురువారం మండలంలోని పెదమక్కెన గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో 150 మందికి వైఎస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం పథకం మంజూరైంది. అయితే అన్ని అర్హతలు ఉన్నా 44 మందికి ఆ పథకం అందలేదని మహిళలు తెలిపారు.  సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమకు ఈ పథకం  లబ్ధి పొందలేకపోయామన్నారు. ఈ విషయంపై గతంలో కలెక్టర్‌కు రెండుసార్లు, బీసీ కార్పొరేషన్‌కు ఒకసారి ఫిర్యాదు చేశామన్నారు. వారి ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది నామమాత్రపు విచారణతో కాలయాపన చేస్తున్నారన్నారు. ఏడాదిగా తమకు న్యాయం జరగడంలేదన్నారు. సచివాలయానికి తాళం వేసి అనంతరం అక్కడే ధర్నా చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. కావాలనే తమకు పథకం అందకుండా సచివాలయ సిబ్బంది కాలయాపన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయం తెలిసి ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దారు నగేష్‌, రూరల్‌ ఎస్‌ఐ బాలకృష్ణలు మహిళలతో మాట్లాడారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మహిళలకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మహిళల ఆందోళనకు ఎంపీటీసీ భర్త మద్దతు తెలిపారు.   


Updated Date - 2022-09-30T05:26:36+05:30 IST