ఖరారైనా.. కలవరమే?

ABN , First Publish Date - 2022-07-20T05:32:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 20 రోజుల క్రితం ఖరారు చేసింది. అయితే ఇంతవరకు ఉమ్మడి గుం టూరు జిల్లా పరిధిలోని సచివాల య ఉద్యోగుల జాబితా ఖరారు కాలేదు.

ఖరారైనా.. కలవరమే?

సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన

20 రోజులైనా జాబితాపై ఇంకాజాప్యం

అన్ని జిల్లాల్లో ప్రొబేషన్‌ ప్రక్రియ పూర్తి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగుతున్న ప్రక్రియ

తాజా ఆదేశాలతో గుంటూరు కలెక్టర్‌పై పనిభారం 

 

పోరాటాలు చేయగా చేయగా.. ప్రొబేషనరికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సచివాలయ ఉద్యోగులకు తీపికబురు అన్నారు.. కాని 20 రోజులైనా ఆ కబురు కళ్ల చూడలేదు. దేవుడు కరుణించినా పూజారి వరమీయలేదన్నట్లుగా ఉమ్మడి గుంటూరు జిల్లా సచివాలయ ఉద్యోగుల పరిస్థితి తయారైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రొబేషనరీ ప్రక్రియ పూర్తి అయ్యి  ఉద్యోగులు నియామక పత్రాలు అందుకున్నారు. కాని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వారికి మాత్రం అది అందని ద్రాక్షగానే ఉంది. రోజులు గడుస్తున్నాయే కాని జాబితా ఖరారు కాలేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకింతలా జాప్యం జరుగుతుందో తెలియక వారు సతమతమవుతున్నారు. తమ ఉద్యోగం ఖరారైందో లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగుల నియామకం మొదలు ప్రొబేషన్‌ ఖరారు వరకు ప్రతి అంశం సమస్యాత్మకంగానే మారింది. 


గుంటూరు, జూలై 19 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 20 రోజుల క్రితం ఖరారు చేసింది. అయితే ఇంతవరకు ఉమ్మడి గుం టూరు జిల్లా పరిధిలోని సచివాల య ఉద్యోగుల జాబితా ఖరారు కాలేదు.  దీంతో ఉమ్మడి గుంటూ రు, చీరాల డివిజన్లతో కలిపి దాదాపు 14,200 మంది ఉద్యోగులు కలవరం చెం దుతున్నారు. అభ్యర్థుల ఎంపికతో మొద లైన గందర గోళం ఇప్ప టికీ కొనసాగుతూనే ఉంది. ఒకే కేటగిరీలో రకరకాల పోస్టులు, ఒకే పోస్టుకు మూడు జిల్లాల్లో ఎంపిక, ఒకే అభ్యర్థి పలు పోస్టులకు ఎంపిక, రకరకాలుగా ఎంపి కైన అభ్యర్థులు, రోస్టర్‌ పాయింట్ల తప్పులు వంటి సవాలక్ష కారణాలతో సచివాలయ ఉద్యోగుల ఎంపికే పెద్ద గందరగోళంగా మారింది. ఇప్పుడు ప్రొబేషన్‌ జాబితా రూపకల్పనలోనూ అదే శాపంగా మారింది. అభ్యర్థుల ఎంపికలో నాడు జరిగిన తప్పులే.. ఇప్పుడు ప్రొబేషన్‌ జాబితా రూపొందించ డంలో సమస్యగా మారాయి. దీనికి జిల్లాల విభజన ప్రక్రియ కూడా తోడైంది. దీంతో సమస్య మరింత జఠిలంగా మారింది. ప్రొబేషన్‌ ఖరారుకు రెండు నెలల ముందు నుంచి జాబితా రూపకల్పన మొదలైంది. అయినా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఇవ్వాళ, రేపు అంటూనే అధి కారులు 20 రోజులకుపైగా నెట్టుకు వచ్చారు.


ఆది నుంచి గందరగోళమే..

ఉద్యోగుల విషయంలో ఆది నుంచి ప్రభుత్వం గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నది.  ప్రొబేషన్‌ జాబితా రూపకల్పన  కూడా  గందరగోళంగా మారిం ది. అభ్యర్థుల జాబితాను కొత్త జిల్లాల వారీగా రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీస యంత్రాంగం, కార్యాల యాలు లేని కొత్త జిల్లాల అధికారులకు ఇది తలకు మించిన భారంగా మారింది. రెండువారాల పాటు కుస్తీ పట్టినా వారు చేసేదేమీ లేక చేతులెత్తేశారు. దీంతో జాబితా రూపకల్పన బాధ్యతను పాత జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో వారం రోజులుగా గుంటూరు జిల్లా కలెక్టర్‌ దీనిపై కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల జాబి తా తుది దశకు చేరిందని చెబుతున్నారు. అయితే జాబితా కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులు మాత్రం అంతకంతకూ ఆందోళనకు గురవుతున్నారు. ప్రొబేషన్‌ ఖరారుపై ఉద్యోగుల్లో ఇంకా భయం వీడలేదు. గతం నుంచి ఎదురవుతున్న అనుభవాల దృష్ట్యా వారు తుది జాబితా వెలువడి, తొలి నెల జీతం పే స్కేల్‌ ప్రకారం చేతికి అందితే తప్ప నమ్మలేమని చెబుతున్నారు. దీనికి తోడు పక్క జిల్లాల్లో జాబితా ప్రదర్శన కూడా జరగడంతో గుంటూరు జిల్లాలో ఏదో జరుగుతోందన్న భయం వారిని వెంటాడుతోంది. జాబితా జాప్యం వల్ల వచ్చే నెల వేతనం 11వ పీఆర్సీ ప్రకారం వస్తుందా లేదా అన్న అనుమానం వారి ఆందోళనను మరింత పెంచుతోంది.  

Updated Date - 2022-07-20T05:32:58+05:30 IST