మెరిట్‌ జాబితాలు సిద్ధం

ABN , First Publish Date - 2020-10-31T05:52:35+05:30 IST

గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామకానికి మెరిట్‌ జాబితాలు సిద్ధమయ్యాయి. జిల్లాలో ఖాళీగావున్న 1,049 పోస్టుల భర్తీకి గత నెలలో పరీక్షలు నిర్వహించి, ఇటీవల ఫలితాలను విడుదల చేశారు.

మెరిట్‌ జాబితాలు సిద్ధం

 సచివాలయ పోస్టుల భర్తీకి సన్నాహాలు

 వచ్చే నెల 2 నుంచి అభ్యర్థులకు కాల్‌ లెటర్లు

 5 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన.. 

10 నుంచి నియామక పత్రాల అందజేత

ఏలూరు సిటీ, అక్టోబరు 30 : గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామకానికి మెరిట్‌ జాబితాలు సిద్ధమయ్యాయి. జిల్లాలో ఖాళీగావున్న 1,049 పోస్టుల భర్తీకి గత నెలలో పరీక్షలు నిర్వహించి, ఇటీవల ఫలితాలను విడుదల చేశారు. 18 రకాల ఉద్యోగాల కోసం 74 వేల 758 మంది దరఖాస్తు చేయగా, 52 వేల 834 మంది పరీక్షలు రాశారు. గతంలో ప్రతి కేటగిరికి సంబంధించిన పోస్టులకు కటాఫ్‌ మార్కులు నిర్ధేశించారు. ఈసారి పరీక్షలు రాసిన అందరికీ మెరిట్‌ జాబితాలో మార్కులను చూపించి ర్యాంకులు ప్రకటించారు. ఎక్కువ మార్కులు సాధించి, అన్ని అర్హతలు ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించి డిస్ట్రిక్‌ కమిటీ పోస్టులను భర్తీ చేయనుంది. 

2 నుంచి కాల్‌ లెటర్ల పంపిణీ

పోస్టులను భర్తీలో భాగంగా అభ్యర్థులకు వచ్చే నెల రెండో తేదీ నుంచి ఐదు వరకు కాల్‌ లెటర్లు పంపిస్తారు. ఐదు నుంచి పదో తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పదో తేదీ నుంచి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తారు. కాల్‌ లెటర్‌ అందుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసిన దరఖాస్తుతోపాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలు, అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకుని వారికి సూచించిన ప్రాంతానికి హాజరుకావాలి. ఏమైనా సర్టిఫికెట్లు లేకపోతే అదనపు సమయం ఇవ్వరు.

సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు : కలెక్టర్‌ 

జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామకానికి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్టుల నియామక ప్రక్రియ సజావుగా, సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. రిజర్వేషన్లను పాటిస్తూ శాఖల వారీగా అభ్యర్థుల మెరిట్‌ జాబితా, కులం వారీగా మెరిట్‌ జాబితాలను సిద్ధం చేయాలని అన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రత్యేక టీమ్‌లను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోలు రూమ్‌ ఏర్పాటు చేసి సిబ్బందిని  ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాల్‌ లెటర్లు అభ్యర్థి ఈ మెయిల్‌కు పంపడంతోపాటు ఫోన్‌కు మెసేజ్‌ చేయాలని, సంబంధిత గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లకు పంపించి వలంటీర్ల ద్వారా అభ్యర్థులకు కాల్‌ లెటర్లు అందజేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామ సచివాలయం వెబ్‌సైట్‌ను రూపొందించాలన్నారు. జేసీ కె.వెంకటరమణారెడ్డి, జడ్పీ సీఈవో పి.శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-31T05:52:35+05:30 IST