Abn logo
Sep 26 2021 @ 00:21AM

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు!

అక్టోబరు 2 నుంచి ప్రారంభం

జిల్లాలో నాలుగు కార్యాలయాల ఎంపిక

విధి విధానాలపై కొరవడిన స్పష్టత

భూ వివాదాలు మరిన్ని పెరుగుతాయేమోనని ఆందోళన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

గ్రామ సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం అక్టోబరు 2వ తేదీ నుంచి అందుకు శ్రీకారం చుడుతోంది. అయితే తొలుత రిజిస్ట్రేషన్‌ సౌకర్యానికి దూరంగా వున్న ప్రాంతాలు, ఇటీవల డిజిటల్‌ సర్వే జరిగిన చోట్ల దీనిని ప్రారంభించి, దశల వారీగా విస్తరించాలని భావిస్తోంది. ఇందుకోసం సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసి స్టెంట్లు, సచివాలయ కార్యదర్శులకు శిక్షణ కూడా ఇచ్చింది. 


ఎక్కడెక్కడ అంటే...

జిల్లాలో భీమిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని రామయోగి అగ్రహారం, అచ్యుతాపురం మండలంలోని వెంగమాంబ అగ్రహారం, చింతపల్లి మండలంలోని బలిజిపేట, నాతవరం మండలంలోని నాతవరం సచివాలయాల్లో అక్టోబరు రెండో తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. అయితే వీటికి సంబంధించి, ఎవరు ఏమి చేయాలనే దానిపై ఇంకా ఇక్కడి అధికారులకు ఎటువంటి సమాచారం లేదు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేసే వారికి జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌-3 హోదా ఇస్తారని చెబుతున్నారు. వారు... వచ్చిన కక్షిదారుల నుంచి వివరాలు తీసుకొని, పరిశీలన కోసం సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపితే, అక్క డ అన్నీ తనిఖీ చేసి ఆమోదం ఇస్తారంటున్నారు. అయితే చలానాలు కట్టించుకోవడం, ఆస్తుల మార్కెట్‌ విలువలు చూడడం, అవి 22-ఏలో ఉన్నాయా?, వేరే భూములా?... అనే నిర్ధారించుకోవడం వంటి విషయాలు ఎవరి బాధ్యత అనేది తెలియదు. దీనిపై స్పష్టమైన ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.


మరిన్ని వివాదాలకు తావిస్తాయా?

ప్రస్తుతం అనుభవజ్ఞులైన అధికారులు, అందుబాటులో రికార్డులు అన్నీ వుంటేనే విలువైన భూములు చేతులు మారిపోతున్నాయి. ఒకరి ఆస్తులను వేరొకరు రిజిస్టర్‌ చేసేసుకుంటున్నారు. అలాంటిది దాదాపు 100కు పైగా సేవలు అందించే సచివాలయాల్లో అందులో ఒకటిగా రిజిస్ట్రేషన్లను తీసుకుంటే...ఎంత నాణ్యమైన సేవలు అందుతాయి?, వాటిలో తప్పులు జరిగితే ఎవరిది బాధ్యత?...అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్‌ జరగాలంటే ముందుగా మార్కెట్‌ విలువ చెప్పడం, దానికి ఎంత ఫీజు కట్టాలి? అనే విషయాలను సీనియర్‌ అసిస్టెంట్‌ చెబుతారు. డాక్యుమెంట్‌ రైటర్‌ తెచ్చిన పత్రాలను పరిశీలించి, సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపుతారు. అక్కడ అన్నీ సక్రమంగా ఉన్నాయని అంటే...జూనియర్‌ అసిస్టెంట్‌కు దానిని ఫార్వర్డ్‌ చేసి, అక్కడ చలానా ఎంటర్‌ చేసి, ఫొటోలు తీసుకుంటారు. ఆ తరువాత దఫేదార్‌ వేలిముద్రలు తీసుకుంటారు. ఇలా నలుగురు కలిసి ఒక పనిచేస్తారు. అచ్చంగా రిజిస్ట్రేషన్లు మాత్రమే చేసే కార్యాలయంలో ఇలా ఉంటే...100 రకమైన సేవలు అందించే చోట ఎటువంటి అనుభవం, పరిజ్ఞానం లేని సిబ్బంది ఖరీదైన భూముల లావాదేవీలు రిజిస్టర్‌ చేస్తే..ఎన్ని వివాదాలు, ఇబ్బందులు వస్తాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం చేస్తున్నదే తప్ప, నిజంగా ప్రజలకు ఉపయోగపడేది కాదని ఆ రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారులు చెబుతున్నారు. అధికార వికేంద్రీకరణ మంచిదే గానీ, ఇలా పరిజ్ఞానం లేని వారి చేతికి బాధ్యతలు అప్పగిస్తే న్యాయపరమైన వివాదాలు ఎక్కువయ్యే అవకాశం వుందని హెచ్చరిస్తున్నారు.