జీతం పెరిగిందనడం తప్పు

ABN , First Publish Date - 2022-01-21T18:14:17+05:30 IST

అమరావతి సచివాలయంలో గురువారం కూడా ఉద్యోగుల నిరసన హోరు కొనసాగింది. పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలంటూ ఐదు బ్లాకుల్లోని ఉద్యోగులూ ర్యాలీ నిర్వహించి, నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

జీతం పెరిగిందనడం తప్పు

సచివాలయ ఉద్యోగుల ర్యాలీ

వాస్తవాలను సీఎస్‌ పక్కనపెట్టారు

ఉద్యోగులను రెచ్చగొట్టారు

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి


అమరావతి సచివాలయంలో గురువారం కూడా ఉద్యోగుల నిరసన హోరు కొనసాగింది. పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలంటూ ఐదు బ్లాకుల్లోని ఉద్యోగులూ ర్యాలీ నిర్వహించి, నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 


అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులకు నష్టం చేసేలా ఉన్నాయి కాబట్టి, వాటిని వెనక్కి తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత రెండు నెలలుగా తమతో సమావేశాల్లో ఏ అంశాలు చెప్పారో, సీఎస్‌ మీడియా ముందుకొచ్చి మళ్లీ అవే చెప్పారని ఆక్షేపించారు. అదే అంశాలను మళ్లీమళ్లీ చెప్పి కన్ఫ్యూజ్‌ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పీఆర్సీ వేరు, డీఏలు వేరు అని ప్రతి సమావేశంలోనూ తాము చెబుతూనే వచ్చామని, ఆ రెండు కలిపి జీతం పెరిగిందనే మాట చెప్పొద్దన్నామని వివరించారు. ‘పీఆర్సీలో ఐఆర్‌ కన్నా 4ు ఫిట్‌మెంట్‌ తగ్గించి, హెచ్‌ఆర్‌ఏలో 14ు తగ్గించి మొత్తంగా 18 ు తగ్గించి, సీసీఏలు తీసేసి, మళ్లీ జీతం పెరిగిందని ఎలా చెబుతారు? డీఏలన్నీ కలిపి జీతం పెరిగిందని చెప్పడానికి, పీఆర్సీ ఈ నెలలోనే అమలు చేసి ఫిబ్రవరి 1కి జీతం పెరిగిందని చూపించడానికి చాలా తాపత్రయపడుతున్నారు. డీఏల వల్ల జీతం పెరిగిందనే అంశాన్ని మేం కాదనడంలేదు. పీఆర్సీ వల్ల జీతం పెరిగిందనేది తప్పు. పీఆర్సీ వల్ల నాకు రూ.5 వేలు జీతం నష్టం చేసి, డీఏల వల్ల రావల్సిన రూ.10 వేలల్లో రూ.5 వేలు తగ్గించి, మొత్తం మీద మీ జీతం రూ.5 వేలు పెరిగిందనడం ఎంత వరకు కరెక్టు. పీఆర్సీ కంటే ముందు మాకు హెచ్‌ఆర్‌ఏ రూ.15 వేలు వస్తే పీఆర్సీ తర్వాత రూ.12 వేలు, రూ.13 వేలకు తగ్గిపోతుంది. ఇలాంటి వాస్తవ అంశాలను పక్కనబెట్టి ఇంకా కన్‌ఫ్యూజ్‌ చేయడం కోసం సీఎస్‌ మీడియా ముందుకు రావడం ఉద్యోగులను రెచ్చగొట్టినట్లైంది. జీతం తగ్గితే ప్రొటెక్షన్‌ ఇస్తామన్నారు. కానీ జీవోలో 2019 నుంచి ఇచ్చిన ఐఆర్‌ను రికవర్‌ చేస్తామన్నారు. మాకు చెప్పిందేటి? మీరు చేస్తోంది ఏమిటి? ఉద్యోగులను రెచ్చగొట్టడం తప్ప వేరే ఆలోచన కనపడటంలేదు కొందరు ఆఫీసర్లకు. ఇప్పటికైనా ప్రభుత్వం గొడవను పెద్దది చేసుకోకుండా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది న్యాయం చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.  

అన్యాయాన్ని సరిదిద్దాలి..‘అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం అన్నారు. పీఆర్సీ కమిషన్‌ ఏం సిఫారసు చేసిందో తెలియదు. ఆఫీసర్ల కమిటీ 30 శాతం అన్నారు. జీవోలో అదికూడా రాలేదు. 23 శాతం ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పుడు పీఆర్సీ ఇచ్చినా మాకు ఆప్షన్‌ ఇవ్వాలి. పీఆర్సీ ఇంప్లిమెంట్‌ తేదీయా? ఇంక్రిమెంట్‌ తేదీయా? ఏ డేట్‌ కావాలని ఉద్యోగులకు ఆప్షన్‌ ఇవ్వాలి. ఆ అవకాశం కూడా తీసేస్తామంటే ఎలా? ఎన్ని రకాలుగా మాకు నష్టం చేస్తారు? పీఆర్సీ వల్ల జీతం పెరగాలి కానీ, తగ్గకూడదు. మిగతా అంశాలన్నీ తీసుకొచ్చి పెరిగిందనే వాదన వద్దు. సీఎస్‌ కమిటీ సిఫారసులు ఆమోదయోగ్యం కాదని సీఎంకు చెప్పాం. హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదని సీఎంకు స్వయంగా చెప్పాం. చర్చ లేకుండానే జీవోలు ఇచ్చారు. ఇది మాకు అంగీకారం కాదు. ఉద్యోగులు అంత అమాయకులు కాదు. రెండు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియచేస్తున్నాం. సోమవారం ఉద్యోగులందరితో మాట్లాడి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. 

Updated Date - 2022-01-21T18:14:17+05:30 IST