‘అంపైర్ కాల్’పై సచిన్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-12T23:49:42+05:30 IST

క్రికెట్‌లోని అంపైర్ కాల్ నిబంధనపై పునరాలోచించాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఐసీసీని కోరారు. బ్యాట్స్‌మెన్‌ను ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఎల్‌బీడబ్ల్యూగా...

‘అంపైర్ కాల్’పై సచిన్ సంచలన వ్యాఖ్యలు

ముంబై: క్రికెట్‌లోని అంపైర్ కాల్ నిబంధనపై పునరాలోచించాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఐసీసీని కోరారు. బ్యాట్స్‌మెన్‌ను ఆన్ ఫీల్డ్ అంపైర్లు ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించినప్పుడు ప్రత్యర్థి జట్టు డీఆర్ఎస్ కోరినా ఈ నిబంధన వల్ల వికెట్ లభించడం లేదని అన్నారు. బంతి ఏ మాత్రం వికెట్లను తాకుతున్నట్లు డీఆర్‌ఎస్‌లో చూపించినా అది ఔట్‌గానే పరిగణించాలని కోరారు.  ఇటీవల బ్రియాన్‌ లారాతో జరిగిన  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సచిన్ అంపైర్ కాల్ నిబంధనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనిపై తన ట్విటర్ ఖాతాలో కూడా ఓ వీడియోను సచిన్ పోస్ట్ చేశారు. ఈ నిబంధనను మాత్రం తాను ఎప్పటికీ అంగీకరించనని, బంతి 50 శాతం పైగా వికెట్లను తాకుతుంటేనే అవుట్‌గా ప్రకటించడమనేది సరైన నిర్ణయం కాదని, బంతి వికెట్లకు ఏ స్థాయిలో తగిలినప్పటికీ దానిని అవుట్‌గా ప్రకటించాలని సచిన్ కోరారు. ‘బ్యాట్స్‌మెన్ కానీ, బౌలర్ కానీ రివ్యూ కోరారంటే వారు ఆన్‌ఫీల్డ్ నిర్ణయంతో సంతృప్తి చెందలేదని అర్థం.


అలాంటి సమయంలో థర్డ్ అంపైర్ పూర్తి అధికారాన్ని తీసుకోవాలి. టెన్నిస్‌లో ఎలాగైతే బంతి గీతకు బయట పడిందా, లేదా అనే విషయం స్పష్టంగా టెక్నాలజీ సాయంతో చెబుతారో.. అదే విధంగా క్రికెట్‌లో కూడా చెప్పాలి. అంతేకానీ అటు, ఇటు కాకుండా మధ్యలో ఊగిసలాడకూడదు. మళ్లీ ఆన్‌‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్నే సమర్థించకూడదు’ అంటూ సచిన్ పేర్కొన్నారు.



Updated Date - 2020-07-12T23:49:42+05:30 IST