విఫలమైతే మళ్లీ కనిపించను

ABN , First Publish Date - 2020-04-03T10:01:27+05:30 IST

దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించాడు. కానీ తర్వాత ఓపెనర్‌ అవతారమెత్తి లెక్కకు మిక్కిలి ప్రపంచ

విఫలమైతే మళ్లీ కనిపించను

 ఓపెనర్‌గా ఒక్క అవకాశమివ్వండి

 అజర్‌, వాడేకర్‌ను కోరిన సచిన్‌

 1994 న్యూజిలాండ్‌ టూర్‌


న్యూఢిల్లీ: దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించాడు. కానీ తర్వాత ఓపెనర్‌ అవతారమెత్తి లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు సాధించాడు. అయితే తాను ఓపెనర్‌గా మారడం వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని టెండూల్కర్‌ ఇలా వివరించాడు. 1994లో 4 వన్డేలు ఆడేందుకు భారత జట్టు న్యూజిలాండ్‌ వెళ్లింది. రెండో వన్డేకు ముందు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు మెడ నొప్పిజేసింది. ‘నేను డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లేసరికి సిద్ధూ స్థానంలో ఎవరిని పంపాలా..అని కెప్టెన్‌ అజరుద్దీన్‌, కోచ్‌ అజిత్‌ వాడేకర్‌ ఆలోచిస్తున్నారు. అప్పుడు నేను వెళతానని అన్నా. న్యూజిలాండ్‌ బౌలర్లందరిపై ఎదురు దాడి చేయగలనన్న విశ్వాసం నాకుంది’ అని వారికి చెప్పానని సచిన్‌ తెలిపాడు. ‘నువ్వు ఇన్నింగ్స్‌ ఎందుకు ప్రారంభించాలని అనుకుంటున్నావు’ అని వారు ప్రశ్నించారన్నాడు.


‘కేవలం కొత్త బంతి మెరుపు తగ్గేవరకే క్రీజులో ఉండి రావాలనుకోవడంలేదు. ఆ తర్వాతా బ్యా టింగ్‌ కొనసాగించడంతోపాటు బౌలర్లపై ఎదురు దాడికి దిగుతా’ అని సమాధానమిచ్చానని సచిన్‌ చెప్పాడు. ‘సాధారణంగా కొత్త బంతి మెరుపు తగ్గిపోయే వరకు తొలి 15 ఓవర్లు ఓపెనర్లు ఆచితూచి ఆడేవారు. ఆ తర్వాత క్రమంగా బ్యాటింగ్‌లో వేగం పెంచుతూ ఆఖరి 7,8 ఓవర్లో మాత్రమే మరింత ధాటిగా ఆడేవారు. కానీ 1992 వన్డే ప్రపంచ కప్‌లో మాత్రం గ్రేట్‌బ్యాచ్‌ ఆ పరిస్థితి మార్చేశాడు. ఆరంభంనుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అందువల్ల నేను ఓపెనర్‌గా వెళ్లి తొలి 15 ఓవర్లలో దూకుడుగా ఆడడం ద్వారా ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తా. నేను కనుక విఫలమైతే మళ్లీ మీ వద్దకు రాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగా. వారు అంగీకరించారు. నేను క్లిక్‌ అయ్యా’ అని సచిన్‌ వివరించాడు. ఆక్లండ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వెళ్లిన టెండూల్కర్‌ కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడి 49 బంతుల్లో 15 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 82 పరుగులతో దుమ్ము రేపాడు.

Updated Date - 2020-04-03T10:01:27+05:30 IST