కొవిడ్ సంక్షోభం వేళ సచిన్ పైలట్ ఔదార్యం

ABN , First Publish Date - 2021-05-12T01:23:04+05:30 IST

కరోనా సంక్షోభంలో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తున్న ప్రజలకు చేయూతనిచ్చేందుకు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ ...

కొవిడ్ సంక్షోభం వేళ సచిన్ పైలట్ ఔదార్యం

జైపూర్: కరోనా సంక్షోభంలో చిక్కుకుని సాయం కోసం అర్థిస్తున్న ప్రజలకు చేయూతనిచ్చేందుకు కాంగ్రెస్ నేత, రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ముందుకొచ్చారు. సాయం కోరే వారికోసం ట్విటర్లో కొత్త ఖాతా ప్రారంభించారు. సచిన్ పైలట్ బృందమే ఈ ట్విటర్ ఖాతాను నిర్వహిస్తుండగా... రోజుకు 300 నుంచి 400 విజ్ఞప్తులను దీని ద్వారా స్వీకరిస్తామని టీం సభ్యుడొకరు వెల్లడించారు. ‘‘కొద్దిరోజులుగా పలువురు వాలంటీర్లు, ప్రజల సాయంతో మేము సహాయక కార్యక్రమాలు అందిస్తున్నాం. ప్రజలు సులభంగా సంప్రదించే విధంగా, మరింత సక్రమంగా సేవా కార్యక్రమాలు కొనసాగేలా కొద్ది రోజుల క్రితం కొత్త ట్విటర్ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చాం..’’ అని సదరు సభ్యుడు పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నకాంగ్రెస్ నాయకుడు మహేశ్ శర్మ మాట్లాడుతూ... ‘‘మా టీమ్‌లోని సభ్యులు డివిజన్‌లు, జిల్లాల స్థాయిలో పనిచేస్తున్నారు. ఆస్పత్రి బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లు, ఆహారం, వసతి సదుపాయం సహా వివిధ అవసరతల్లో ఉన్నవారికి సాయం చేసేందుకు కృషి చేస్తున్నారు...’’ అని పేర్కొన్నారు. అధికశాతం విజ్ఞప్తులు జైపూర్ నుంచే వస్తున్నాయనీ.. వాటిని పరిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. అనవసరంగా ఆక్సిజన్ సిలిండర్లను దాచుకోవద్దనీ... వాటిని అందరూ సమానంగా ఉపయోగించుకునేలా సహకరించాలని శర్మ కోరారు. ఆన్‌లైన్ ద్వారా 15 మందితో కూడిన వైద్యుల బృందం కూడా ఉచిత కన్సల్టేషన్ అందిస్తోందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-05-12T01:23:04+05:30 IST