రాజస్థాన్‌ సంక్షోభం: విధేయులతో ఢిల్లీకి చేరిన పైలట్

ABN , First Publish Date - 2020-07-12T23:01:33+05:30 IST

రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తినట్టు చెబుతున్న విభేదాలు హస్తినకు చేరాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఆదివారం..

రాజస్థాన్‌ సంక్షోభం: విధేయులతో ఢిల్లీకి చేరిన పైలట్

న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తినట్టు చెబుతున్న విభేదాలు హస్తినకు చేరాయి. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌‌ వైఖరిపై అసంతృప్తితో ఉన్న సచిన్ పైలట్, తన విధేయ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలుసుకోనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిని ఆమెకు వివరించనున్నారు.


పైలట్ రాజకీయంగా సీరియస్ నిర్ణయం తీసుకునే ఆవకాశాలు లేకపోలేదని, అయితే నిర్ణయం తీసుకునే ముందు పార్టీ అధిష్ఠానాన్ని కలుసుకోవాలని ఆయన అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా, గెహ్లాట్ సారథ్యంలోని ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేదని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా ఉన్న అవినాష్ పాండే ఒక నివేదికను సోనియాగాంధీకి సమర్పించినట్టు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలకు ఎమ్మెల్యంతా అందుబాటులోనే ఉన్నారని, అయితే, కొందరు ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తిని చక్కబరచ వచ్చని ఆయన పేర్కొన్నారు.


పైలట్ ఆగ్రహానికి కారణం ఇదే..

రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోల్పోవలసి వస్తుందేమోనన్న ఆగ్రహంతో పైలట్ ఉన్నారని కూడా పాండే తన నివేదకలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 2014 నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పైలట్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే 2018లో పార్టీ ఎన్నికలకు వెళ్లింది. ఎన్నికల్లో విజయానంతరం గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నియమించింది. అప్పట్నించి గెహ్లాట్, పైలట్ మధ్య సంబంధాలు రోజురోజుకూ క్షీణిస్తున్నట్టు చెబుతున్నారు. 2018లో కూడా పైలట్ రాష్ట్ర అధ్యక్ష పదవి కొనసాగించాలన్న షరతుపైనే ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించారు.


కాగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తనను పార్టీ అధిష్ఠానం తప్పిస్తుందోమేనని పైలట్ ప్రస్తుతం అనుమాన పడుతున్నారని చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తనను దూరంగా పెట్టాలని గెహ్లాట్ ఆలోచన చేస్తున్నారని కూడా ఆయన అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలకు దిగుతోందని గెహ్లాట్ తాజాగా ఆరోపణలు గుప్పించారు. అయితే, బీజేపీ మాత్రం తమకు అలాంటి ఆలోచన ఏదీ లేదని చెబుతోంది. గెహ్లాట్, పైలట్ మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే ఆ పార్టీ సంక్షోభంలోకి వెళ్తోందని అంటోంది.

Updated Date - 2020-07-12T23:01:33+05:30 IST