ఎన్నికలకు ఏడాదిన్నర ముందే చక్రం తిప్పుతున్న సబిత.. కాంగ్రెస్‌, బీజేపీల్లో కలవరం!

ABN , First Publish Date - 2022-04-29T16:17:41+05:30 IST

ఎన్నికలకు ఏడాదిన్నర ముందే చక్రం తిప్పుతున్న సబిత.. కాంగ్రెస్‌, బీజేపీల్లో కలవరం!

ఎన్నికలకు ఏడాదిన్నర ముందే చక్రం తిప్పుతున్న సబిత.. కాంగ్రెస్‌, బీజేపీల్లో కలవరం!

  • మాజీ సర్పంచ్‌ ఇంట్లో తేనీటి విందుకు హాజరు
  • రైతు సొసైటీ బీజేపీ డైరెక్టర్‌తో మంతనాలు?
  • త్వరలో టీఆర్‌ఎస్‌ గూటికి చేరే అవకాశం!

మహేశ్వరం నియోజకవర్గంలో గతంలో తనతో పాటు కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన నాయకులను పలు సందర్భాల్లో కలుస్తున్నారు. వారిని తిరిగి మెళ్లగా తనవైపు తిప్పుకుంటున్నారు. గత జనవరిలో నాదర్‌గుల్‌ మాజీ కౌన్సిలర్‌ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. నియోజకవర్గంలో తన ప్రాబల్యం పెంచుకునే దిశలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితారెడ్డి తన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు.


హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్‌ : మరో సంవత్సరన్నర కాలంలో ఎన్నికలు వస్తుండడంతో నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి మెల్లగా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌లోని పేరున్న నాయకులను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గత జనవరిలో మంత్రి కేటీఆర్‌ బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో పర్యటించిన సందర్భంలో నాదర్‌గుల్‌కు చెందిన మాజీ కౌన్సిలర్‌ అంకంగారి మంజులాకుమార్‌గౌడ్‌ కాంగ్రెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నాదర్‌గుల్‌ మాజీ సర్పంచ్‌ మర్రి హన్మంత్‌రెడ్డిపై మంత్రి దృష్టిసారించారు. గతంలో కాంగ్రెస్‌ సరూర్‌నగర్‌ మండల కమిటీ అధ్యక్షుడిగా, బడంగ్‌పేట్‌ నగర పంచాయతీ అధ్యక్షుడిగా కూడా పని చేసిన హన్మంత్‌రెడ్డిని తిరిగి తన వైపు తిప్పుకోవాలని మంత్రి ప్రయత్నిస్తున్నారు. 


ఆయన సైతం టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నట్టు తెలుసుకున్న సబితారెడ్డి.. గురువారం నాదర్‌గుల్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా.. హన్మంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా చర్చలు జరపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆయన గులాబీ గూటికి చేరవచ్చనే ప్రచారానికి ఈ కలయిక బలం చేకూర్చినట్టయింది. తన నిర్ణయాన్ని తర్వాత చెబుతానని ఆయన మంత్రితో పేర్కొన్నప్పటికీ.. ఆయన పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


కాంగ్రెస్‌, బీజేపీల్లో కలవరం..

హన్మంత్‌రెడ్డి, మమతాసుదర్శన్‌రెడ్డి ఏపిసోడ్‌తో కాంగ్రెస్‌, బీజేపీల్లో కలవరం మొదలయినట్టు తెలుస్తోంది. కీలక సమయంలో ముఖ్యమైన నేతలు దూరమవనున్నారనే సమాచారం ఆయా పార్టీలను కలవర పెడుతోంది. చేజారనున్న తమ నేతలను కాపాడుకోవడం ఎలాగో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సదరు ఇద్దరు నేతలు సొంత పార్టీలను వీడితే ఆయా పార్టీలకు పెద్ద దెబ్బేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


బీజేపీ డైరెక్టర్‌.. ఆయన భార్య సైతం..

భాగ్యనగర్‌ రైతు సంఘం డైరెక్టర్‌, బీజేపీ నేత యేల్చల సుదర్శన్‌రెడ్డి తన సతీమణి మమతారెడ్డితో కలిసి టీఆర్‌ఎ్‌సలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో సబితారెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో పనిచేశారు. మమతారెడ్డి నాదర్‌గుల్‌ సర్పంచ్‌గా కూడా వ్యవహరించారు. 2014లో బడంగ్‌పేట్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2020 మున్సిపల్‌ ఎన్నికల్లో ఆమె నాదర్‌గుల్‌ 31వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి ప్రస్తుత మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి(అప్పట్లో ఆమె కాంగ్రెస్‌) చేతిలో ఓడిపోయారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో మమతాసుదర్శన్‌రెడ్డి దంపతులు బీజేపీలో చేరారు. 


సుదర్శన్‌రెడ్డి భాగ్యనగర్‌ రైతు సంఘం డైరెక్టర్‌గా పోటీ చేసి గెలుపొందారు. బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యం లభించడంలేదని, ఆయన తరచూ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్టు తెలిసింది. గత నెలలో గులాబీ గూటికి చేరాలని భావించినప్పటికీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా వెనుకంజ వేసినట్టు తెలిసింది. తాజాగా గత సోమవారం వారి నూతన గృహ ప్రవేశం సందర్భంగా విచ్చేసిన మంత్రి సబితారెడ్డితో మమతాసుదర్శన్‌రెడ్డి దంపతులు చనువుగా కనిపించారు. ఇప్పటికే పార్టీ మార్పుపై స్పష్టమైన వైఖరితో ఉన్న మమతాసుదర్శన్‌రెడ్డి దంపతులు సైతం హన్మంత్‌రెడ్డి దారిలోనే ‘కారు’ ఎక్కడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.



Updated Date - 2022-04-29T16:17:41+05:30 IST