హాలీవుడ్లో, ఇంగ్లీష్ సినిమాల్లో నటించిన భారతీయులు ఎవరంటే సయిద్ జాఫ్రీ, నసీరుద్దీన్ షా, కబీర్‌బేడీ, ఓంపురి, ఇర్ఫాన్‌ఖాన్... ఇలా కొన్నిపేర్లు గుర్తుకువస్తాయి ఎవరికైనా. అయితే వీరందరి కన్నా ఎన్నో ఏళ్ల ముందే హాలీవుడ్లో అడుగుపెట్టి, ఎన్నో విజయాల్ని కైవసం చేసుకున్న మనవాడొకడున్నాడు. 13 వ ఏటనే ఓ మైసూరు కుర్రాడు ఇంగ్లాండుకు అటునుంచి హాలీవుడ్‌కు వెళ్లి రెండు దశాబ్దాలపాటు అనేక సినిమాల్లో హీరోగా నటించి సత్తా చాటాడు. అతడే సాబూ దస్తగీర్. ఇప్పటికీ అక్కడి పత్రికలు సాబూ వార్తలు ప్రచురిస్తుంటాయి. హాలీవుడ్ అభిమానులు ఆయన్ని స్మరించుకుంటారు. రచ్చగెలిచిన మన ఇంటోడి కథ ఇది...
‘మదర్ ఇండియా’ మిస్సయ్యింది!
ఒక హిందీ క్లాసిక్‌లో నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ అనుకోని కారణాల వల్ల సాబూ దాని నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1957లో వచ్చిన ‘మదర్ ఇండియా’లో నర్గీస్ రెండో కుమారుడు బిర్జూ పాత్ర కోసం నిర్మాత మహబూబ్ ఖాన్ హాలీవుడ్లో ఉన్న సాబూను ఎంపిక చేసుకున్నారు. ఆయన కోసం ముంబైలోని అంబాసిడర్ హోటల్లో అప్పట్లోనే నెలకు 5 వేల రూపాయల అద్దెతో వసతి కూడా ఏర్పాటు చేశారు. అయితే తీరా షూటింగ్ సమయానికి సాబూకు వర్క్ పర్మిట్ లభించలేదు. షెడ్యూల్‌ను వాయిదా వేసుకోలేక ఆ పాత్రకు సునీల్‌దత్‌ను తీసుకుని సినిమా పూర్తి చేశారు. ‘మదర్ ఇండియా’ ఎంత హిట్టో తెలిసిందే.
సాబూ దస్తగీర్... మైసూరు సమీపంలోని ‘కరపుర’ అనే కుగ్రామంలో 27 జనవరి 1924లో జన్మించాడు. పుట్టినపుడే తల్లి చనిపోయింది. మావటిగా పనిచేసే తండ్రి సాబూను వెంట తీసుకెళ్లేవాడు. పదేళ్ల వయసులో తండ్రి మరణంతో సాబూను అతడి మేనమామ చేరదీశాడు. ఆయన మైసూరు ప్యాలెస్‌లోని ఏనుగులశాలలో పనిచేస్తుండటంతో సాబూకు కూడా అక్కడే చిన్నచిన్న పనులు చేసే కొలువు దొరికింది. ఏనుగుల సంరక్షణతో పాటు గున్న ఏనుగులతో ఆడుకోవడమే సాబూ దినచర్య.
అనుకోకుండా సినిమాల్లోకి...
రూడ్యార్డ్ క్లిప్పింగ్ రాసిన ‘తూమై ఆఫ్ ది ఎలిఫెంట్స్’ కథను సినిమాగా తీయాలనుకున్న ఇంగ్లీష్ డైరెక్టర్ రాబర్ట్ జె ఫ్లహర్టీ అందులోని ప్రధాన పాత్ర ‘తూమై’ కోసం వెదుక్కుంటూ ఇండియాకు వచ్చాడు. మైసూరు రాజావారి అతిథిగా ఉన్న ఆయనకు అక్కడే ఏనుగులతో ఆడుకుంటున్న సాబూ కంటపడ్డాడు. తను వెదుకుతున్న నటుడు కళ్ల ముందు కనబడేసరికి ఆనందపడ్డాడు. జంతువులతో ఎలాంటి భయం, బెరుకు లేకుండా నటించ గల సత్తా ఈ బాలుడికి ఉందని గ్రహించిన ఫ్లహర్టీ తూమై పాత్రకు సాబూను ఎంచుకున్నాడు. ఆ సినిమా పేరు ‘ఎలిఫెంట్ బాయ్’. సినిమా అంటే ఏమిటో తెలియకుండానే సాబూ అందులో నటించాడు. ఈ సినిమా షూటింగ్ చాలావరకు మైసూరు అడవుల్లోనే జరిగింది. కొంత భాగం ఇంగ్లాండులోని స్టూడియో సెట్లలో తీయాల్సివుండగా సాబూను ఫ్లహర్టీ తమ దేశానికి తీసుకెళ్లాడు. ఆ విధంగా సాబూ ప్రయాణం ఇంగ్లాండుకు సాగింది.
1937లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. 13 ఏళ్ల బాలుడు భారీ ఏనుగుతో కలిసి ప్రదర్శించిన సహజనటన ప్రేక్షకులను కట్టిపడేసింది. తూమై పాత్రలో సాబూ ఒదిగిపోయాడు. సినిమాకు కలెక్షన్లు బాగా రావడంతో జంతువుల కథలతోనే మరికొన్ని సినిమాలు రూపొందించేందుకు నిర్మాత, దర్శకులు కోర్డా సోదరులు సాబూతో ఒప్పందం చేసుకున్నారు. ఒక ప్రసిద్ధ జానపద కథ ఆధారంగా ఆ మరుసటి ఏడాది సాబూతో ‘ది డ్రమ్స్’ అనే సినిమా తీశారు. అది కూడా హిట్టయ్యింది. దాంతో వరుసగా సినిమాలు తీయడం ప్రారంభించారు. 1940లో ‘ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్, 1942లో ‘జంగిల్‌బుక్’ తీశారు. ఈ సిరీస్‌లో ఇది మొదటి సినిమా. అంటే తొలి ‘మోగ్లీ’ సాబూనే అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ‘జంగిల్‌బుక్’కు సంబంధించి ఎన్నియానిమేటేడ్ సినిమాలు వచ్చినా... అసలు సిసలు జంతువులతో వచ్చిన సాబూ ‘జంగిల్‌బుక్’కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
హాలీవుడ్‌కు...
ఇంగ్లాండుకు వెళ్లిన ఐదారేళ్లలోనే సాబూ ప్రతిభ హాలీవుడ్‌కు పాకింది. ఇంగ్లాండులోని కోర్డా సోదరులతో ఒప్పందకాలం పూర్తవడంతో హాలీవుడ్‌లోని యూనివర్శల్ స్టూడియో సాబూతో చిత్రనిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. హాలీవుడ్లో సాబూ తొలిసినిమా ‘అరేబియన్ నైట్స్’. ఆ తర్వాత ‘వైట్ సావేజ్’ (1943), ‘కోబ్రా ఉమెన్’ (1944), ‘టాంగేర్’ (1946)...ఇలా వరుసగా సినిమాలొచ్చాయి. 19 ఏళ్ల వయసులోనే సాబూ అమెరికా పౌరసత్వం పొందాడు. అక్కడే సాయంకాలం కళాశాలలో చదువు కొనసాగించాడు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనేందుకు సైనిక శిక్షణ కూడా పొందాడు. యుద్ధనిధి సేకరణ కోసం డిఫెన్స్ బాండ్స్ అమ్మకపు ప్రచారంలో పాల్గొని, అమెరికాలోని 30 నగరాల్లో పర్యటించాడు. అనేక రేడియో ప్రసంగాలు చేశాడు. యు.ఎస్.ఎయిర్‌ఫోర్స్‌లో చేరి టెయిల్గన్నర్గా యుద్ధంలో పాల్గొన్నాడు. అందుకుగాను 1945లో అమెరికా ప్రభుత్వం ఫ్లయింగ్ క్రాస్, 4 బాటిల్ స్టార్స్, 3 ఓక్ లీఫ్ క్లస్టర్స్, ఫిలిప్పైన్ లిబరేషన్ రిబ్బన్లతో సాబూను సత్కరించింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి ఇంగ్లాండుకు వెళ్లి ‘ది బ్లాక్ నాసిసస్ (1947), ‘ది ఎండ్ ఆఫ్ ది రివర్’ (1947)లలో నటించాడు. ఆ మరుసటి ఏడాది సహాయ నటి అయిన మార్లిన్ కూపర్‌ను వివాహమాడాడు. ఇరువురు కలిసి 1949లో ‘సాంగ్ ఆఫ్ ఇండియా’లో నటించారు. పదేళ్ల తర్వాత సినిమాలు తగ్గడంతో రియల్ ఎస్టేట్, హాటల్ వ్యాపారాల్లోకి ప్రవేశించాడు.
చిన్న వయసులోనే...
సాబూ చివరి సినిమాల్లో చెప్పుకోదగినవి 1960లో వచ్చిన ‘మిస్ట్రెస్ ఆఫ్ ది వరల్డ్’తో పాటు ‘రాంపేజ్’ (1963), ‘ఏ టైగర్ వాక్స్’ (1964) మొదలైనవి. ఇందులో సాబూ ఇండియన్ ఎనిమల్ ట్రైనర్‌గా నటించాడు. సర్కస్ నుంచి తప్పించుకుపోయిన బెంగాల్ టైగర్ నగరంలో సృష్టించిన కల్లోలాన్ని అడ్డుకుని, తిరిగి దాన్ని సర్కస్‌లోకి తీసుకు రావడం ఈ సినిమా కథ. హాలీవుడ్లో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న సాబూ ఊహించని రీతిలో 39 ఏళ్ల వయసులోనే 2 డిసెంబర్ 1963లో గుండె పోటుతో మరణించాడు. డిస్నీ స్టూడియో నిర్మించిన ‘ఏ టైగర్ వాక్స్’ ఆయన మరణానంతరం విడుదలై సూపర్ హిట్టయినా, ఆ తర్వాత అలాంటి సాహసోపేతమైన పాత్రలు పోషించేందుకు సాబూ దస్తగీర్ మాత్రం లేకపోవడం విషాదం.
ప్రముఖుల సరసన...
హాలీవుడ్ పర్వతశ్రేణుల్లో ఉన్న ప్రసిద్ధ ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్‌లో సాబూ అంత్యక్రియలు జరిగాయి. హాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ శ్మశానవాటికలో స్టాన్లీ లారెల్, బస్టర్ కీటన్ల పక్కనే సాబూ భౌతికదేహాన్ని ఖననం చేశారు. సాబూ భార్య మార్లిన్ కూపర్ 2009లో మరణించింది. ఆయన కూతురు జాస్మిన్ 2001లో చనిపోయింది. సాబూ కొడుకు పాల్ సాబూ సంగీత కళాకారుడిగా ఉన్నాడు.
సాబూ సినిమాలే కాదు... ఆయన జీవితం కూడా ఊహించని మలుపులతో సినిమాను తలపిస్తుంది. అమెరికా పౌరసత్వం తీసుకున్నా సరే ఎక్కడికి వెళ్లినా ఆయన నోటి నుంచి వచ్చే తొలిమాట ‘ఐయామ్ఇండియన్’ అనే. నిజమే... సాబూ దస్తగీర్ ఈజ్ ఏ గ్రేట్ ఇండియన్.
- బి.నర్సన్, 9440128169