బ్లేజర్స్‌ గెలిచింది కానీ..

ABN , First Publish Date - 2022-05-27T09:44:05+05:30 IST

తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) ధనాధన్‌ అర్ధ శతకంతో.. డిఫెండింగ్‌ చాంప్‌ ట్రయల్‌ బ్లేజర్స్‌ 16 పరుగుల తేడాతో వెలాసిటీని చిత్తు చేసింది.

బ్లేజర్స్‌ గెలిచింది కానీ..

 మెరిసిన మేఘన

 ఓడినా.. ఫైనల్‌కు వెలాసిటీ

 దంచేసిన కిరణ్‌

పుణె: తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73) ధనాధన్‌ అర్ధ శతకంతో.. డిఫెండింగ్‌ చాంప్‌ ట్రయల్‌ బ్లేజర్స్‌ 16 పరుగుల తేడాతో వెలాసిటీని చిత్తు చేసింది. మహిళల టీ20 చాలెంజ్‌లో భాగంగా గురువారం జరిగిన ఈ  మ్యాచ్‌లో ఓడినా మెరుగైన రన్‌రేట్‌తో వెలాసిటీ ఫైనల్‌ చేరగా.. గెలిచిన బ్లేజర్స్‌ టోర్నీ నుంచి అవుటైంది. శనివారం జరిగే తుది పోరులో సూపర్‌ నోవా్‌సతో వెలాసిటీ తలపడనుంది. 


ట్రయల్‌ బ్లేజర్స్‌ ఫైనల్‌ చేరాలంటే..

ప్రత్యర్థి వెలాసిటీని 158 పరుగులకు పరిమితం చేయాలి. కానీ, కిరణ్‌ నవ్‌గిరే (34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీతో దుమ్మురేపడంతో అది సాధ్యపడలేదు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్లేజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల చేసింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్‌ మేఘన, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ జెమీమా రోడ్రిక్స్‌ (44 బంతుల్లో 66) రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యంతో భారీ స్కోరుకు బాటలు వేశారు.


సిమ్రన్‌ రెండు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో వెలాసిటీ ఓవర్లన్నీ ఆడి 174/9 స్కోరు మాత్రమే చేసింది. కిరణ్‌ ఉన్నంతసేపు వెలాసిటీ విజయం ఖాయంగా కనిపించినా.. ఆమె అవుటైన తర్వాత వేగంగా వికెట్లను చేజార్చుకొంది. పూనమ్‌, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 


సంక్షిప్త స్కోర్లు:

ట్రయల్‌ బ్లేజర్స్‌:

20 ఓవర్లలో 190/5 (మేఘన 73, జమీమా 66; సిమ్రన్‌ 2/31); వెలాసిటీ: 20 ఓవర్లలో  174/9 (కిరణ్‌ 69, షఫాలీ 29; పూనమ్‌ 2/33, రాజేశ్వరి 2/44). 

Updated Date - 2022-05-27T09:44:05+05:30 IST