రాజధాని వస్తే.. విశాఖను రక్షించుకోలేం!

ABN , First Publish Date - 2020-08-02T08:13:01+05:30 IST

విశాఖలో రాజధాని కోసం అధికారికంగా భూములు సేకరించలేదని, అయితే

రాజధాని వస్తే.. విశాఖను  రక్షించుకోలేం!

  • భూములన్నీ మాయమవుతున్నాయి
  • అన్నీ అనధికారికంగా జరిగిపోతున్నాయి
  • ఉత్తరాంధ్ర నేతలు వాస్తవాలు గ్రహించాలి
  • 3 రాజధానులు రాజకీయ క్రీడ
  • అమరావతిలో 32 వేల ఎకరాలకు
  • రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు
  • జగన్‌ అలా సేకరించగలరా?
  • అమరావతి రైతులు ఏడుస్తుంటే
  • అక్కడి ప్రజాప్రతినిధులు స్పందించరేం?
  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చర్చలో..
  • మాజీ ఎంపీ సబ్బం హరి ఆవేదన

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): విశాఖలో రాజధాని కోసం అధికారికంగా భూములు సేకరించలేదని, అయితే అనధికారికంగా ఎన్నో జరుగుతున్నాయని మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని దందాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. రాజధాని పేరుతో విశాఖలో భూములు మాయమయ్యే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని విశాఖకు వస్తే రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని రక్షించుకోలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైజాగ్‌లో ఏం జరగబోతోందో తనకు తెలుసని, అది తలచుకుంటేనే భయమేస్తోందని అన్నారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు గొప్పలకు పోకుండా వాస్తవాన్ని గ్రహించాలని చేతులు మొక్కి విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. 


శనివారం సాయంత్రం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ క్రీడలో భాగంగానే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ తరహా వ్యవహారాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకునే ఉద్దేశంతోనే.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తుంటారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను గతంలో తొలగించారని, ఇప్పుడు మళ్లీ ఇచ్చారని.. అయితే ఈలోగా తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకున్నారని చెప్పారు. విశాఖ రావడానికి ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ఖర్చును అమరావతి కోసం కేటాయిస్తే రాజధాని పూర్తయ్యేదన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలను గత పాలకులు సేకరించారని, ప్రస్తుతం రాజధాని తరలిస్తున్న ప్రాంతంలో జగన్‌ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టకుండా 2 నుంచి 5 వేల ఎకరాలను సేకరించగలదా అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఏడుస్తుంటే... అక్కడి ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు.  రాజధాని కోసం భూములిచ్చిన రైతుల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదని, అంతిమంగా ధర్మమే గెలుస్తుందని స్పష్టం చేశారు. 


విశాఖలో ఇంటికో కొవిడ్‌ బాదితుడు

విశాఖలో ప్రతి ఇంటికో కొవిడ్‌ బాధితుడు ఉన్నాడని, లక్షల రూపాయలు చెల్లించి వైద్యం పొందుతున్న వాళ్లలో బతికినవాళ్లు బతుకుతున్నారని, చనిపోయినవాళ్లు చనిపోతున్నారని సబ్బం హరి తెలిపారు. ఇప్పటికిప్పుడు రాజధానిని తరలించకపోయినప్పటికీ కరోనా వైరస్‌ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ ప్రక్రియకు తెర లేపారని అన్నారు. విశాఖ రాజధాని అయితే జగన్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని కొంత మంది స్వామీజీలు పేర్కొంటున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధానిని ఇక్కడికి తరలించడం సమంజసం కాదని చెప్పారు.

Updated Date - 2020-08-02T08:13:01+05:30 IST