heavy rain: శబరిమల యాత్రకు బ్రేక్...పంబా డ్యామ్‌ వద్ద రెడ్ అలర్ట్

ABN , First Publish Date - 2021-11-20T12:58:35+05:30 IST

అల్పపీడన ప్రభావం వల్ల కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో శబరిమల యాత్రకు బ్రేక్ పడింది...

heavy rain: శబరిమల యాత్రకు బ్రేక్...పంబా డ్యామ్‌ వద్ద రెడ్ అలర్ట్

శబరిమల(కేరళ): అల్పపీడన ప్రభావం వల్ల కేరళ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో శబరిమల యాత్రకు బ్రేక్ పడింది. భారీ వర్షాల వల్ల పంబా సహా ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరగడంతో పతనంతిట్ట జిల్లాలోని శబరిమల కొండపై ఉన్న ప్రసిద్ధ అయ్యప్ప ఆలయంలో శనివారం ఒకరోజు తీర్థయాత్రను నిలిపివేశారు. ఈ మేరకు పతనంతిట్ట జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర పంబా నదిలో వరదలు వెల్లువెత్తుతుండటంతో డ్యామ్ వద్ద జిల్లా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కక్కి అనాతోడ్ రిజర్వాయరు వద్ద రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పతనంతిట్ట అధికారులు చెప్పారు. 


యాత్రికుల భద్రత దృష్ట్యా శబరిమల యాత్రను నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టరు దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా స్లాట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారిన తర్వాత సమీప స్లాట్‌లో దర్శన అవకాశం కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు.కొవిడ్ అనంతరం శబరిమల తీర్థయాత్ర కోసం ఈ నెల 16వతేదీన ఆలయాన్ని భక్తుల సందర్శనకు తెరిచారు.కరోనా మహమ్మారి, భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా యాత్రికుల రాకను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో భాగంగా గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భక్తులను వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా అనుమతిస్తున్నారు.

Updated Date - 2021-11-20T12:58:35+05:30 IST