ఎన్నాళ్లీ సాగుదీత!

ABN , First Publish Date - 2022-08-10T06:16:33+05:30 IST

‘ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం.. ఈ ఏడాది సాగునీటి వనరుల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం.. రైతుల పంట పొలాలను సస్యశ్యామలం చేస్తాం’.. ఇవీ జలవనరుల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏటా అన్నదాతలకు ఇచ్చే హామీలు.

ఎన్నాళ్లీ సాగుదీత!
పాయకరావుపేట మండలం ఈదకం గ్రామంలో అభివృద్ధికి నోచుకోని వెంకటపతిరాజు సాగునీటి చెరువు

- నిధులు లేక అభివృద్ధికి నోచుకోని సాగునీటి చెరువులు

- కేవలం ప్రతిపాదనలకే పరిమితం

- ఈ ఏడాదీ రైతులకు తప్పని కష్టాలు


‘ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం.. ఈ ఏడాది సాగునీటి వనరుల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తాం.. రైతుల పంట పొలాలను సస్యశ్యామలం చేస్తాం’.. ఇవీ జలవనరుల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఏటా అన్నదాతలకు ఇచ్చే హామీలు. జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రివైజ్డ్‌ అంచనాలు రూపొందించి చెరువులు, వాటి పంట కాలువల ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు పంపుతుంటారు. కానీ ఇవి ఆచరణకు నోచుకోక రైతులకు ఏటా నిరాశ తప్పడం లేదు. నిధులు లేక సాగునీటి చెరువుల ఆధునికీకరణ పనుల విషయంలో అడుగు పడడం లేదు. జల వనరుల శాఖ ప్రతిపాదించిన పనులు పూర్తయితే తమకు సాగునీటి కష్టాలు తీరతాయని భావించిన రైతులకు ప్రతి ఏడాది నిరాశే మిగులుతోంది.

                              (అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

 ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 2020-21లో ఏపీ ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ అగ్రికల్చర్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో జిల్లాలో సాగునీటి చెరువుల అభివృద్ధికి ప్రతిపాదించారు. సుమారు రూ.33.45 కోట్ల అంచనాలతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 50 చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో పునర్విభజన తరువాత ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో 45కి పైగా చెరువులు ఉన్నాయి. చెరువుల అభివృద్ధి, పంట కాలువలు బాగు చేయడం ద్వారా ఆయా చెరువుల కింద 6,061 ఎకరాల ఆయకట్టు ఉందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిధుల కేటాయింపులు జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొత్త చెరువుల తవ్వకాలు, పాత చెరువుల్లో పేరుకుపోయిన పూడిక తొలగింపు, కాలువ గట్లు, చెరువులకు గ్రోయిన్‌ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు పరిపాలనా పరమైన ఆమోదం లభించినా ఇంతవరకు నిధులు కేటాయిస్తున్నట్టు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాలేదు. దీంతో అన్ని చెరువు పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. రూ.20.45 కోట్ల అంచనాలతో 19 పనులకు టెండర్లు పిలిచారు. కేవలం 12 చెరువుల ఆధునికీకరణకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా పనులు మాత్రం జరగలేదు. నిధులు లేవని తెలిసి కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదని సమాచారం. 7 పనులకు టెండర్లు పిలవాల్సి ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.  

నిధుల విడుదలలో జాప్యమే కారణం

వాస్తవానికి ప్రపంచ బ్యాంకు ఏపీఐఐఏటీపీ ప్రాజెక్టు కింద విడుదల చేసిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా కొంత మొత్తం విడుదల చేయాల్సి ఉంటుంది. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు జరపాల్సి ఉంది. జిల్లాలో చేపట్టదలచిన చెరువు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రపంచ బ్యాంకు నిధుల కేటాయింపులు జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా పైసా విదల్చడం లేదని సమాచారం. దీంతో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్టు తెలుస్తోంది. జలవనరుల శాఖకు గత మూడేళ్లలో పాత పనులకు మినహా కొత్తగా కేటాయింపులు ఏమీ జరగలేదు. ఈ కారణంగానే చెరువుల అభివృద్ధి పనులకు అడ్డంకులు తప్పడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని చెరువుల అభివృద్ధికి నిధుల కేటాయింపులు జరపాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2022-08-10T06:16:33+05:30 IST