SA vs IND: అలా క్రీజులోకొచ్చారో, లేదో.. దంచికొట్టిన వాన.. ఫైనల్ జరగడం కష్టమేనా..?

ABN , First Publish Date - 2022-06-20T00:59:30+05:30 IST

దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. టాస్ పడే సమయానికి వర్షం లేదు. కానీ.. ఆకాశం మొత్తం మేఘావృతమై..

SA vs IND: అలా క్రీజులోకొచ్చారో, లేదో.. దంచికొట్టిన వాన.. ఫైనల్ జరగడం కష్టమేనా..?

బెంగళూరు: దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. టాస్ పడే సమయానికి వర్షం లేదు. కానీ.. ఆకాశం మొత్తం మేఘావృతమై వర్షం పడే అవకాశముందనే సంకేతాలు కనిపించాయి. టాస్ పడే సమయానికి వర్షం లేకపోవడంతో టాస్ వేశారు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో టీమిండియా ఓపెనర్లు బ్యాటింగ్‌కు దిగేందుకు గ్రౌండ్‌లోకి అలా వచ్చారో, లేదో ఉన్నట్టుండి వర్షం మొదలైంది. చినుకులుగా మొదలై కుండపోత వర్షం కురిసింది. ఈ వార్త రాసే సమయానికి వర్షం పడుతూనే ఉంది. సిరీస్ 2-2తో సమం కావడంతో విజేత ఎవరో నిర్ణయించే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో వర్షం ఓ రేంజ్‌లో పడుతుండటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. భారీ వర్షం కురుస్తుండటంతో వెంటనే పెద్ద పెద్ద కవర్లతో పిచ్ పూర్తిగా తడవకుండా కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే.. చిన్నపాటి చినుకులు కాకుండా కుండపోత కురుస్తుండటంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి.



కాస్త ఆలస్యమైనా ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశాలున్నాయి. చిన్న స్వామి స్టేడియంలో సబ్ ఎయిర్ విధానం ద్వారా ఎంత వర్షం పడినా నీటిని ఇట్టే లాగేసే సదుపాయం ఉంది. దీంతో.. వర్షం తగ్గితే చాలు ఎంత వర్షం కురిసినా, వర్షం ఆగిపోయాక మ్యాచ్ నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది లేదని నిర్వాహకులు చెబుతున్నారు. వర్షం పడే అవకాశం ఉందని ముందే తెలియడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను చేశారు. ఇదిలా ఉంటే.. ఇరు జట్ల విషయానికొస్తే.. సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను గాయాల బెడద వేధిస్తోంది. రాజ్‌కోట్‌లో కెప్టెన్‌ బవుమా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా అతను ఆడే పరిస్థితి లేకపోవడంతో కేశవ్‌ మహరాజ్‌ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు. అంతకుముందే పేసర్లు రబాడ, పార్నెల్‌ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యారు.



అయితే.. ఈ మ్యాచ్‌లో రబడ ఆడుతుండగా.. పార్నెల్ స్థానంలో లుంగీ ఎంగిడీ ఆడనున్నాడు. మిడిలార్డర్‌లో డుస్సెన్‌, మిల్లర్‌, క్లాసెన్‌ విఫలమవడం దెబ్బతీస్తోంది. ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా అన్ని విభాగాల్లో చెలరేగి భారత్‌ను ఓడించాలనుకుంటోంది. అలాగైతేనే భారత గడ్డపై ఆతిథ్య జట్టుతో సిరీస్‌ ఓడిపోని రికార్డును కొనసాగించే వీలుంటుంది. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఇప్పటికీ లోపాలు కనిపిస్తున్నాయి. టాపార్డర్‌ నుంచి ఆశించిన ప్రదర్శన కనిపించడం లేదు. నాలుగో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ల ఫామ్‌ మాత్రమే జట్టును ఆదుకోగలిగింది. 27 బంతుల్లోనే తన కెరీర్‌లో తొలి ఫిఫ్టీ సాధించిన డీకే బాదుడు విజయానికి కారణమైంది. అయితే మిగతా బ్యాటర్స్‌ ఫామ్‌ ఆందోళనకరంగానే ఉంది. ఓపెనర్లు నిలకడగా శుభారంభాలు అందించలేకపోతున్నారు. శ్రేయాస్‌ పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలోనూ.. ఆఫ్‌స్టంప్‌ ఆవలగా వెళుతున్న బంతులను వెంటాడి అవుటవుతున్న తన లోపాన్ని కెప్టెన్‌ పంత్‌ పదేపదే బహిర్గతం చేసుకుంటున్నారు. అయితే బౌలింగ్‌ విభాగం మాత్రం చివరి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టింది.

Updated Date - 2022-06-20T00:59:30+05:30 IST