SA vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. టీమిండియాను కలవరపరుస్తున్న విషయం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-20T00:24:25+05:30 IST

దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు టీ20ల సిరీస్‌ ఆరంభంలో..

SA vs IND: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. టీమిండియాను కలవరపరుస్తున్న విషయం ఏంటంటే..

బెంగళూరు: దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న టీ20 ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు టీ20ల సిరీస్‌ ఆరంభంలో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన టీమిండియా ఇప్పుడు ఫేవరెట్‌గా మారింది. ఢిల్లీ, కటక్‌ మ్యాచ్‌ల్లో పంత్‌ సేన ఓడిన తీరు చూస్తే వైజాగ్‌లోనే సిరీస్‌ పోతుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఓ మ్యాచ్‌లో బ్యాటర్లు.. మరో మ్యాచ్‌లో బౌలర్ల అద్వితీయ ప్రదర్శనతో భారత్‌ తిరిగి పోటీలో నిలిచింది. రాజ్‌కోట్‌లో అయితే భారత బౌలర్ల ధమాకాతో దక్షిణాఫ్రికా కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయింది. ఇప్పుడు సిరీస్‌ 2-2తో సమంగా ఉంది. ఇక ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన జట్టే విజేత. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ ‘ఫైనల్‌’ మ్యాచ్‌ అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వేదికపై భారత్‌కు పొట్టి ఫార్మాట్‌లో పేలవ రికార్డు ఉండడం ఆందోళనకరం. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓడి, రెండింట్లోనే గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో భారత్‌ తమ చివరి మ్యాచ్‌ను కూడా సఫారీలతోనే ఆడి 9 వికెట్ల తేడాతో ఓడింది.



భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఇప్పటికీ లోపాలు కనిపిస్తున్నాయి. టాపార్డర్‌ నుంచి ఆశించిన ప్రదర్శన కనిపించడం లేదు. నాలుగో మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తీక్‌ల ఫామ్‌ మాత్రమే జట్టును ఆదుకోగలిగింది. 27 బంతుల్లోనే తన కెరీర్‌లో తొలి ఫిఫ్టీ సాధించిన డీకే బాదుడు విజయానికి కారణమైంది. అయితే మిగతా బ్యాటర్స్‌ ఫామ్‌ ఆందోళనకరంగానే ఉంది. ఓపెనర్లు నిలకడగా శుభారంభాలు అందించలేకపోతున్నారు. శ్రేయాస్‌ పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలోనూ.. ఆఫ్‌స్టంప్‌ ఆవలగా వెళుతున్న బంతులను వెంటాడి అవుటవుతున్న తన లోపాన్ని కెప్టెన్‌ పంత్‌ పదేపదే బహిర్గతం చేసుకుంటున్నారు. అయితే బౌలింగ్‌ విభాగం మాత్రం చివరి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టింది. ప్రత్యర్థిని 131, 87 స్కోర్లకే పరిమితం చేసిన బౌలర్లు జట్టుకు విజయాలు అందించారు. హర్షల్‌ ఏడు, భువీ.. చాహల్‌ ఆరేసి వికెట్లతో రాణిస్తున్నారు. పేసర్‌ అవేశ్‌ కూడా ఫామ్‌లోకి రావడం శుభసూచకం. ఇప్పటిదాకా ఒక్క మార్పు లేకుండానే ఆడిన జట్టు మరోసారి సమష్టి ప్రదర్శనతో రాణిస్తే సిరీస్‌ దక్కడం ఖాయం.



సిరీస్‌ నిర్ణాయక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను గాయాల బెడద వేధిస్తోంది. రాజ్‌కోట్‌లో కెప్టెన్‌ బవుమా రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా అతను ఆడే పరిస్థితి లేకపోవడంతో కేశవ్‌ మహరాజ్‌ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు. అంతకుముందే పేసర్లు రబాడ, పార్నెల్‌ గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యారు. అయితే.. ఈ మ్యాచ్‌లో రబడ ఆడుతుండగా.. పార్నెల్ స్థానంలో లుంగీ ఎంగిడీ ఆడనున్నాడు. మిడిలార్డర్‌లో డుస్సెన్‌, మిల్లర్‌, క్లాసెన్‌ విఫలమవడం దెబ్బతీస్తోంది. ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా అన్ని విభాగాల్లో చెలరేగి భారత్‌ను ఓడించాలనుకుంటోంది. అలాగైతేనే భారత గడ్డపై ఆతిథ్య జట్టుతో సిరీస్‌ ఓడిపోని రికార్డును కొనసాగించే వీలుంటుంది.

Updated Date - 2022-06-20T00:24:25+05:30 IST