మండపేటలో త్వరలో రైతు భరోసా యాత్ర

ABN , First Publish Date - 2022-07-06T07:04:34+05:30 IST

ఈ నెలలో మండపేటలో రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నట్టు జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ప్రకటించారు. మలికిపురంలోని ఎల్‌ఎఫ్‌ ల్యాండ్‌మార్క్‌ వద్ద మంగళవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న కార్యాచరణ వివరాలను ఆయన వెల్లడించారు.

మండపేటలో త్వరలో రైతు భరోసా యాత్ర
సమావేశంలో మాట్లాడుతున్న దుర్గేష్‌

  • జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌

మలికిపురం, జూలై 5: ఈ నెలలో మండపేటలో రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నట్టు జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ప్రకటించారు. మలికిపురంలోని ఎల్‌ఎఫ్‌ ల్యాండ్‌మార్క్‌ వద్ద మంగళవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో తీసుకున్న కార్యాచరణ వివరాలను ఆయన వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున మండపేట సభలో జనసేన అధినేత పవనకల్యాణ్‌ పంపిణీ చేస్తారన్నారు. మండపేట పరిసర ప్రాంతాల్లోని 14 మండలాలు కవరయ్యే విధంగా బహిరంగ సభ ఉంటుందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలైన ఆర్టీసీ చార్జీల పెంపు, అమ్మ ఒడి కోత తదితర అంశాలపై నిరసన దీక్షలు, ధర్నాలు, ఉపవాస దీక్షలు చేయడం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ముందుకు వెళ్తాన్నారు. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండు చేశారు. సంస్థాగతంగా మాట్లాడుతూ ప్రొటోకాల్‌, ప్రచార తదితర అంశాలపై చర్చించామన్నారు. క్రియాశీలక సభ్యత్వాల నమోదులో రాజోలు నియోజకవర్గం 8,700 సభ్యత్వాలతో అగ్రస్థానంలో ఉందన్నారు. వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇటీవల జరిగిన సభలో రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సొంత ఇమేజ్‌తో నెగ్గారని  మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఆనాడు జనసైనికులు అనుక్షణం శ్రమించి తమ చెమట కష్టంతో రాపాకను నెగ్గించారన్నారు. మీ ప్రకటన నిజమైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో లో ఏమైందని ఆయన ప్రశ్నించారు. రాజోలు నియోజకవర్గంలో రాపాకకే బలముంటే ఆయన అధికార పార్టీలో చేరాక జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల ఎన్నికల్లో ఏమైందన్న సంగతిని సతీష్‌కుమార్‌ గమనించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని, పొన్నాడకు అప్పుడు శృంగభంగం తప్పదన్నారు. చింతలమోరి వంటి చిన్న గ్రామంలో సభ పెడితే వందలాది మంది పార్టీలో చేరడం చూస్తే పవనకల్యాణ్‌ ఆశయాలకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని దుర్గేష్‌ అన్నారు. కుల, మతాలకు అతీతంగా కులాల మధ్య ఐక్యతతో జనసేన ముందుకు వెళ్తుందని, రోజురోజుకూ జనసేన బలం పెరుగుతుందన్నారు. సమావేశంలో పితాని బాలకృష్ణ, దిరిశాల బాలాజీ, తాడి మోహన, ముత్తా శశిధర్‌, కవికొండల సరోజ, అశోక్‌, పి.సూర్యచంద్ర, శిరిగినీడి వెంకటేశ్వరరావు, గుండుబోగుల పెద్దకాపు, పినిశెట్టి బుజ్జి, సుంకర కృష్ణవేణి, పి.శిరీష తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T07:04:34+05:30 IST