రైతులపై మరో పిడుగు

ABN , First Publish Date - 2021-07-26T05:09:25+05:30 IST

ఓ వైపు రైతుల అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని నాసిరకం ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నారు.

రైతులపై మరో పిడుగు
పొదలకూరులో గ్లైఫోసెట్‌ విక్రయిస్తున్న దుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ అధికారులు(ఫైల్‌)

జిల్లాలో నాసిరకం ఎరువులు, పురుగు మందుల విక్రయం

నిషేధమున్నా గ్లైఫోసెట్‌ అమ్మకాలు

ధాన్యం దిగుబడిపై ప్రభావం

దృష్టిపెట్టని వ్యవసాయ శాఖ


నెల్లూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ఓ వైపు రైతుల అవసరాలను, బలహీనతలను ఆసరాగా చేసుకుని నాసిరకం ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నారు. మరోవైపు నిషేధిత పురుగు మందులను యథేచ్ఛగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి నాసిరకం మందుల దోపిడీ విపరీతంగా జరుగుతోంది. కొన్ని ప్రముఖ కంపెనీల పేరుతో కూడా నాసిరకం విక్రయాలు జరుగుతున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క జిల్లాలోనే ఏటా రూ.కోట్లలో ఈ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు డీలర్లు గుట్టుచప్పుడు కాకుండా నాసిరకం ఎరువులు, పురుగు మందులను జిల్లాకు తీసుకొస్తూ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరులోని ఓ పేరుమోసిన డీలర్‌ కీలక పాత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాల్లోనే చర్చసాగుతోంది. గడిచిన మూడు, నాలుగేళ్ల నుంచి అధికారులు పట్టుకుంటున్నది అరకొరనే అయినా, వాటిని పరిశీలిస్తే మార్కెట్లో నాసిరకం మందులు ఎలా  చెలామణి అవుతున్నాయో అర్థమవుతుంది. మూడేళ్ల క్రితం కాంప్లెక్స్‌ ఎరువులను విజిలెన్స్‌ అధికారులు పట్టుకొని పరీక్షించగా అవి నాసిరకమని తేలింది. ఆ ఎరువులు సర్వేపల్లిలో తయారవడం గమనార్హం. ఆ తర్వాత పలుచోట్ల నకిలీ పురుగు మందులను గుర్తించారు. గతేడాది భారీ స్థాయిలో నిషేధిత గ్లైఫోసెట్‌ను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. అయితే అదే నిషేధిత మందు ఇప్పుడు కూడా మార్కెట్లో దొరుకుతుండడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం పొదలకూరులోని రెండు ఫర్టిలైజర్ల దుకాణాల్లో విజిలెన్స్‌ అధికారులు నిషేధిత గ్లైఫోసెట్‌ అమ్మకాలను గుర్తించారు. ఇక్కడ విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది కాబట్టి పట్టుకోగలిగారు. మరి జిల్లాలోని మిగతా దుకాణాల్లో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవు తోంది. ప్రతీ చోటా విజిలెన్స్‌ అధికారులు నకిలీ ఎరువులు, పురుగు మందులను పట్టుకుంటుంటే వ్యవసాయ శాఖ ఏం చేస్తోందన్న ప్రశ్న తలెత్తుతోంది. 


గరిష్ఠంగా సాగు

జిల్లాలో గడిచిన మూడేళ్ల నుంచి గరిష్ఠ విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. పుష్కలంగా నీరు కూడా లభ్యమవుతుండడంతో రెండో పంటను కూడా సాగు చేస్తున్నారు. దీన్ని అక్రమార్కు లు అదునుగా చేసుకుంటున్నారు. నాసిరకం ఎరువులు, పురుగు మందులను కొందరు డీలర్లకు ఎక్కువ పర్సంటేజీ ఇస్తూ వారి చేత విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. గడిచిన కొన్ని సీజన్ల నుంచి ధాన్యం దిగుబడి తగ్గుతోంది. గతంలో ఎకరానికి నాలుగు పుట్ల వరకు దిగుబడి వస్తుండగా  ఇప్పుడు మూడు పుట్లు కావడం కష్టంగా మారుతోంది. సాంకేతికత పెరుగుతున్నప్పుడు దిగుబడి పెరగాల్సింది పోయి తగ్గుతుండడం రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. నాసిరకం ఎరువులు, పురుగు మందుల వాడకం మూలంగా ఆ ప్రభావం ధాన్యం దిగుబడిపై పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పలురకాల కంపెనీల పేర్లతో ఎరువులు, పురుగు మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటి లో ఏ మేరకు నాణ్యత ఉందనేది ప్రశ్నార్థకమే. కొన్ని అనుమ తులు లేని మందులను కూడా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పెద్ద మార్కెట్‌ కావడంతో సీజన్‌కు ముందే అక్రమా ర్కులు జిల్లా మార్కెట్‌లో మకాం వేస్తున్నారు. కీలకమైన వ్యవసాయ శాఖాధికారులు నిరంతరం మార్కెట్‌ను గమని స్తూ ఉండాలి. తరచూ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, రైతులతో మాట్లాడుతుంటే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వ్యవసాయ శాఖాధికారులు ప్రతీ నెలా వారి పరిధిలోని ఫర్టిలైజర్ల దుకాణాల్లో తనిఖీలు చేసి పలు మందులను పరీక్షించాల్సి ఉంది. అయితే చాలా మంది టార్గెట్‌ కోసం తూతూమంత్రంగా పరీక్షలు చేస్తున్నట్లు రికార్డు  చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదన్న విమర్శలు న్నాయి. ఇందుకు డీలర్ల నుంచి చేతులు తడుస్తుండడమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


విజిలెన్స్‌ తనిఖీల్లో వెల్లడి

విజిలెన్స్‌ అధికారులు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగు మందులను గుర్తిస్తున్నారు. మరి ప్రతీ మండలంలో ఉన్న వ్యవసాయ శాఖాధికారులు పూర్తిస్థాయిలో పనిచేస్తే చాలా వరకు అక్రమార్కులకు అడ్డుకట్ట వేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్లైఫోసెట్‌ అనేది కలుపు మందు. దీన్ని పొలంలో ఉపయోగిస్తే కలుపు రాకుండా ఉంటుందని రైతులు భావిస్తారు. అయితే ఈ మందు వల్ల పర్యావరణానికి మేలు చేసే మొక్కలు కూడా చనిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్లైఫోసెట్‌ మందు కేన్సర్‌కు కూడా కారణమవుతుందని గుర్తించాక ఆ మందును ప్రభుత్వం నిషేధించింది. అయినా రాష్ట్రంలో తయారీ, విక్రయాలు జరుగుతున్నాయి.. గతేడాది భారీగా ఈ మందును జిల్లాలో పట్టుకున్నా, మళ్లీ ఈ ఏడాది కూడా విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది గ్లైఫోసెట్‌ను పట్టుకున్నప్పుడు అది ఒక ప్రముఖ కంపెనీ నుంచి తయారైనదిగా గుర్తించారు. ఆ సందర్భంలో భారీగా నగదు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.


నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు

 కాగా ఈ విషయమై వ్యవసాయ శాఖ ఎరువులు, పురుగు మందుల పర్యవేక్షణ అధికారి ధనుంజయరెడ్డిని ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా పొదలకూరులో గ్లైఫోసెట్‌ అమ్మకాలు జరుపు తున్నట్లు సమాచారం రావడంతో విజిలెన్స్‌ అధికారులతో కలిసి పట్టుకున్నామని చెప్పారు. నకిలీ,నిషేధిత మందులను ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే డీలర్లను హెచ్చరించామన్నారు.   

Updated Date - 2021-07-26T05:09:25+05:30 IST