సిద్ధమవుతున్న రైతు వేదికలు

ABN , First Publish Date - 2020-10-31T01:02:45+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనువుగా ఉండేందుకు, వారు పండించిన పంటలకు మంచి ధర లభించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోంది.

సిద్ధమవుతున్న రైతు వేదికలు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనువుగా ఉండేందుకు, వారు పండించిన పంటలకు మంచి ధర లభించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను నిర్మిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిని నిర్మించి రైతులకు ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం రైతువేదికల నిర్మాణానికి 572.22 కోట్ల రూపాయలను కేటాయించింది. ఒక్కోరైతువేదిక నిర్మాణాన్ని 22 లక్షలతో నిర్మించనున్నారు. ఇందులో ప్రభుత్వం 312.12 కోట్లు, వ్యవసాయ శాఖ మరో 260.10కోట్లను భరించనుంది. దేశంలోనే మొదటిసారిగా రైతు వేదికలను నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రైతులను చైతన్య పర్చడం, వారు పండించిన పంటలకు మంచి ధరలను ఇప్పించడం రైతు వేదికల ప్రధాన లక్ష్యం. రైతులను ఒక చోటకు చేర్చి వారి సమస్యలపైచర్చించడం, సీజన్‌లో ఎలాంటి పంటలు వేస్తున్నారు.


పంటలకు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అవసరమైన సాయం వంటివి ఈ రైతువేదికల్లో రైతులుచర్చించుకునే వీలుంటుంది. వ్యవసాయం మంచి లాభదాయకంగా మార్చుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిని కూడా రైతులు చర్చించుకోవడం, అవసరమైన మేరకు ప్రభుత్వం కూడా సంబంధిత అధికారులతో సమావేశాలను కూడా రైతువేదికల వద్ద నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలతోపాటు, రాబోయే కాలంలో ఎలాంటి విధానాలు అమలుచేయాలి? ఇతర రాష్ర్టాలు, దేశాల్లో అమలు జరుగుతున్నవిధానాలను కూడా రైతు వేదికల ద్వారా రైతులకు వివరించడానికి అవకాశం ఉంటుంది. 


వ్యవసాయంలో ఆధునిక పోకడలను కూడా రైతులకు అర్దమయ్యే లా తెలియజేయడం, ఆధునిక పద్దతులను అనుసరించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని కూడా ఈ వేదికల ద్వారా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు అవగాహనా కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు కూడా వీటిలో నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలను నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2462 , పట్టణ ప్రాంతాల్లో 139 రైతు వేదికలను నిర్మిస్తున్నారు. అలాగే పంచాయితీల పరిధిలో 74 కూడా నిర్మించాలని నిర్ణయించారు.  

Updated Date - 2020-10-31T01:02:45+05:30 IST