రైతు సేవలో పడుగుపాడు సొసైటీ

ABN , First Publish Date - 2022-03-18T05:27:58+05:30 IST

పట్టణంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం, పడుగుపాడు (సొసైటీ) రైతులకు సేవలందించడంలో సత్ఫలితాలను సాధిస్తోంది.

రైతు సేవలో పడుగుపాడు సొసైటీ
పడుగుపాడు సొసైటీ

ప్రభుత్వ ధరలకే విత్తనాలు, ఎరువుల విక్రయం

రూ.3కోట్ల మేర రైతులకు రుణాల పంపిణీ

త్వరలో సహకార బ్యాంకు ఏర్పాటు


కోవూరు, మార్చి 17: పట్టణంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం, పడుగుపాడు (సొసైటీ) రైతులకు సేవలందించడంలో సత్ఫలితాలను సాధిస్తోంది. మండల పరిధిలోని రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొన్నేళ్లుగా ఎరువులను సరఫరా చేస్తోంది. గత ఏడాది 300టన్నుల యూరియా, 550టన్నుల దుక్కిపిండి, డీఏపీ, పొటాష్‌, సూపర్‌పాస్ఫేట్‌ పంపిణీ చేసింది. సుమారు రూ.50లక్షల మేర ఎరువుల వ్యాపారం సాగించింది. రూ.3కోట్ల మేర రైతులకు పంట రుణాలను పంపిణీ చేసినట్లు సొసైటీ సీఈవో కొండూరు గోవర్ధనరెడ్డి తెలిపారు. కోవూరు, పాటూరు, పడుగుపాడు, ఇనమడుగు, వేగూరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. త్వరలో ఇనమడుగులో సొసైటీ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు ఏర్పాటుచేసి రైతులకు డీజిల్‌, పెట్రోల్‌ గ్రామాల్లోనే కొనుగోలు చేసేందుకు వీలు కల్పించనుంది. సొసైటీ ఆవరణలో రైతులకు బంగారు ఆభరణాలపై రుణాలిచ్చేందుకు వీలుగా సహకార బ్యాంకును నిర్మిస్తున్నారు. అందులోనే లాకర్‌ సదుపాయం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. రైతులకు సరఫరా చేసే ఎరువులు, వరి వంగడాలను నిల్వ చేసేందుకు గోదాము నిర్మిస్తున్నారు. 


రైతుల సహకారంతోనే..

రైతుల సహకారంతోనే సొసైటీ సేవలను విస్తరిస్తున్నాం. అభివృద్ధి పనులకు చేయూతనందిస్తున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందిచాలన్న సంకల్పంతోనే పనిచేస్తున్నాం. త్వరలోనే బ్యాంకు, లాకర్‌ సౌకర్యం వసతి కల్పించనున్నాం. గోదాము ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

- రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, అధ్యక్షుడు, పడుగుపాడు సొసైటీ, కోవూరు


బాధ్యతతో పనిచేస్తున్నాం

మండల పరిధిలోని రైతులు మాపై ఎన్నో బాధ్యతలు పెట్టారు. రైతులకు సేవలందించడంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. బాధ్యతతో పనిచేస్తున్నాం. రైతులకు ఎరువులు, విత్తనాల వడ్లు సరఫరా చేశాం. మేము అందించే సేవల వల్లే  సొసైటీపై రైతుల్లో గౌరవం పెరిగింది.

- కొండూరు గోవర్ధనరెడ్డి, సీఈవో, పడుగుపాడు సొసైటీ

 

రైతు సేవల్లో ముందంజ

మండలంలోని రైతులకు పడుగుపాడు పీఏసీఎస్‌ సేవలందించడంలో ముందుంజలో ఉంటుంది. వరి విత్తనాల దగ్గర నుంచి ఎరువులు వరకు ప్రభుత్వ ధరలకు విక్రయించడమే కాకుండా రుణాలు అందజేస్తుంది. త్వరలో బ్యాంకు, లాకర్ల సదుపాయం ఏర్పాటుకు సొసైటీ సన్నాహాల్లో ఉండడంతో   రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.  

- మోడెం కోటారెడ్డి, రైతు, పడుగుపాడు


నిరంతరం పనిచేసే సొసైటీ

పడుగుపాడు పీఏసీఎస్‌ రైతులకు సేవలందిచడంలో నిరంతరం పనిచేసే సొసైటీగా జిల్లాలోనే పేరు పొందింది. ఇక్కడున్న సిబ్బంది  రైతు సంక్షేమం కోసమే పనిచేస్తుండటంతో సత్ఫలితాలు పొందుతున్నారు. రైతులకు తక్కువ వడ్డీతో బంగారు నగలపై కూడా రుణాలిచ్చేందుకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహకారం తీసుకోనుంది. 

-పొన్నవోలు సుధీర్‌రెడ్డి,రైతు, ఇనమడుగు

Updated Date - 2022-03-18T05:27:58+05:30 IST