రైతు సమస్యలపై కదం తొక్కిన తెలుగు తముళ్లు

ABN , First Publish Date - 2021-09-17T05:13:19+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అనేక విధాలుగా మోసాలకు గురవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడి సమస్యలపై కదం తొక్కింది.

రైతు సమస్యలపై కదం తొక్కిన తెలుగు తముళ్లు
విడవలూరులో ర్యాలీ నిర్వహిస్తున్న తెలుగు తముళ్లు

విడవలూరులో భారీ ర్యాలీ

రైతులను ముంచిన ఘనత జగన్మోహన్‌రెడ్డిదే  

చేతకాని దద్దమ్మ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న

పోలంరెడ్డి, కోటంరెడ్డి ధ్వజం


విడవలూరు, సెప్టెంబరు 16: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అనేక విధాలుగా మోసాలకు గురవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలబడి సమస్యలపై కదం తొక్కింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు గురువారం విడవలూరులో ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నుడా మాజీ చైర్మన్‌, నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తొలుత విడవలూరులోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి, ప్లకార్డులను ప్రదర్శిస్తూ రైతులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆనంతరం డిప్యూటీ తహసీల్దారు మధుకు వినతిపత్రం  అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు, రైతులకు చుక్కలు చూపిస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్‌ చార్జీలు, గ్యాస్‌ ధరలు పెరిగాయన్నారు. రైతులు పంట పండించాలంటే ఆలోచనలో పడ్డారన్నారు. సోమశిల జలాశయంలో సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చేతగానితనంతో  నియోజకవర్గంలో సుమారు 40వేల ఎకరాల్లో రైతులు పంటకు విరామం ప్రకటించారని విమర్శించారు. పార్లమెంట్‌లో అన్ని ధాన్యాలకు మద్దతు ధర పెంచితే, వరికి   పెంచకపోతే వైసీపీ ఎంపీలు ఏమీ చేస్తున్నట్లని వారు ప్రశ్నించారు. వ్యవసాయ ఖర్చులు పెరిగి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మోటార్లకు విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసే దుర్మార్గానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని మరచి వసూళ్లలో మునిగి తెలుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు, రైతులు వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య,  నెల్లూరు పార్లమెంట్‌ రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి, మండల   అధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి పొన్నాల చంద్రశేఖర్‌, నాయకులు అమరేంద్రరెడ్డి, రామిశెట్టి వెంకటేశ్వర్లు, మాతూరు శ్రీనివాసులురెడ్డి, ఇంతా మల్లారెడ్డి, ముసలి సుధాకర్‌, వీరేంద్ర చౌదరి, తదితరులు పాల్గొన్నారు. 


 రెండున్నరేళ్లయింది.. ఒక్క పనిముట్టు ఇచ్చారా

 ‘రైతు కోసం తెలుగుదేశం’లో సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 

మనుబోలు: వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోంది. ఇప్పటికీ రైతుకు ఒక్క పనిముట్టు ఇచ్చారా అంటూ సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ పిలుపు మేరకు ‘రైతు కోసం తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మనుబోలులో గురువారం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగం ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు సమస్యలపై డిప్యూటీ తహసీల్దారుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఇవాళ రైతు పండించిన పంటను అమ్ముకునే స్థితిలో లేడన్నారు. సాధారణంగా పుట్టికి 850 కిలోలు అయితే.. వైసీపీ ప్రభుత్వంలో 1200 కిలోలు అని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఎమ్మెల్యేలు రైతు సమస్యలు గాలికొదిలి తమ జేబులు నిండితే చాలనుకుంటున్నారన్నారు.     సర్వేపల్లి రైతులకు ఎప్పటికీ సోమిరెడ్డి కుటుంబం అండగా ఉండి, సమస్యలపై పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్‌ రైతు అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణ నాయుడు, మనుబోలు, వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు మండలాధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, గుమ్మడి రాజాయాదవ్‌, తలచీరు మస్తాన్‌బాబు, పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, మధునాయుడు, మస్తాన్‌నాయుడు, కోదండ రామానాయుడు, సాని వెంకటరమణయ్య, పచ్చిపాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-17T05:13:19+05:30 IST