ప్రయాణికులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్ వింత పరీక్ష .. ఆ భాష వస్తేనే విమానం ఎక్కనిస్తామంటూ..

ABN , First Publish Date - 2022-06-08T23:14:25+05:30 IST

సాధారణంగా విమానప్రయాణం చేయాలనుకున్న ప్యాసెంజర్లు తమ వెంట విమాన టిక్కెట్లు, ఐడీ ప్రూఫ్‌లు, వీసాలు గట్రా తీసుకెళితే సరిపోతుంది. కానీ..ఐరోపాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ రయాన్ఎయిర్ మాత్రం ప్రయాణికుల భాషా ప్రావీణ్యాన్నికూడా పరీక్షిస్తోంది.

ప్రయాణికులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్ వింత పరీక్ష .. ఆ భాష వస్తేనే విమానం ఎక్కనిస్తామంటూ..

ఎన్నారై డెస్క్: సాధారణంగా విమానప్రయాణం చేయాలనుకున్న ప్యాసెంజర్లు తమ వెంట విమాన టిక్కెట్లు, ఐడీ ప్రూఫ్‌లు, వీసాలు గట్రా తీసుకెళితే సరిపోతుంది. కానీ..ఐరోపాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్ రయాన్ఎయిర్(Ryanair) మాత్రం ప్రయాణికుల భాషా ప్రావీణ్యాన్నికూడా పరీక్షిస్తోంది. ఇందులో ఫెయిలైన వారిని విమానం ఎక్కనీయమని, టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేస్తామని చెబుతోంది.  దీంతో.. ఆ సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


అసలేం జరిగిందంటే.. 

దక్షిణాఫ్రికాకు(Southafrica) చెందిన నకిలీ పాస్‌పోర్టులున్న ప్రయాణికుల గుట్టు బయటపెట్టేందుకు రయాన్ఎయిర్‌ సంస్థ ఆ దేశ ప్రయాణికుల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షించేందుకు నిర్ణయించింది. దక్షిణాఫ్రికా నేరగాళ్లు భారీ సంఖ్యలో నకిలీ పాస్‌పోర్టులు అమ్ముకుంటున్నట్టు అక్కడి ప్రభుత్వం ఇటీవల గుర్తించడంతో రయాన్ ఎయిర్ ఈ నిర్ణయం తీసుకుంది.  అయితే.. దక్షిణాఫ్రికా ప్రజలు మాట్లాడే 11 భాషలకు అధికారిక గుర్తింపు ఉండగా..  రయాన్ఎయిర్ ఆఫ్రికాన్స్ భాషను ఎంచుకుంది. ఇక 2011 సెన్సెస్ ప్రకారం..దేశంలో దాదాపు 13 శాతం మంది దీన్ని మాట్లాడతారు. అంతేకాకుండా.. నల్లజాతీయులు ఆఫ్రికాన్స్‌ను(Afrikaans) వలసపాలనకు చిహ్నంగా కూడా భావిస్తారు. కానీ.. ఎయిర్‌లైన్స్ మాత్రం ఈ భాషలోనే ప్రశ్నపత్రాన్ని రూపొందించింది. ఇందులో దక్షిణాఫ్రికాకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సరైన సమాధానాలు చెప్పలేని వాళ్లకు విమానంలోకి అనుమతి ఉండదు. అయితే.. ఇది తమను అవమానించడమేనని దక్షిణాఫ్రికాకు చెందిన శ్వేతజాతీయేతరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలస పాలకులు తమపై బలవంతంగా రుద్దిన ఆఫ్రికాన్స్..దక్షిణాఫ్రికా జాతీయతను ఎలా నిరూపిస్తుందంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 


రయాన్‌ఎయిర్‌లో దక్షిణాఫ్రికా నుంచి లండన్‌కు వెళుతున్న ఓ ప్రయాణికుడు సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టు పెట్టేముందు తన పాస్‌పోర్టు, బోర్డింగ్ పాస్‌ను సంస్థ తీసేసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. పశ్నపత్రం చూసి షాకైపోయిన తాను సిబ్బందిని ఇదేంటని ప్రశ్నించగా .. అది మీ భాషేగా అంటూ వారు సమాధానమిచ్చారని ఆరోపించారు. ‘‘నేను అకస్మాత్తుగా తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రయాణికుల పట్ల సంస్థ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తోంది. వారి మనోభావాలకు విలువనివ్వట్లేదు. ఆధిపత్య ధోరణితో నన్ను ఎవరో అణచివేస్తున్నట్టు అనిపించింది. ఆఫ్రికాన్స్ భాషకు.. దక్షిణాఫ్రికా జాతీయతకు సంబంధం ఏంటి’’ అంటూ అతడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం నెటిజన్లు కూడా రయాన్‌ఎయిర్ సంస్థపై విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాఫ్రికా ఇప్పుడు వలసపాలనలో లేదన్న విషయం తెలుసుకుంటే మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు. 



Updated Date - 2022-06-08T23:14:25+05:30 IST