అదరం.. బెదరం..

ABN , First Publish Date - 2022-05-20T06:19:00+05:30 IST

అదరం.. బెదరం..

అదరం.. బెదరం..
ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయం

ఏసీబీ రంగప్రవేశం చేసినా ఆగని ఆర్‌డబ్ల్యూఎస్‌ అవినీతి 

ఇంకా అధికారులను రక్షించే ప్రయత్నాలు

అన్ని ఆధారాలున్నా సస్పెన్షన్‌కు వెనుకడుగు 

ఆచితూచి వ్యవహరించాలని ఈఎన్‌సీ సూచనలు 

తెరవెనుక భారీగా అందుతున్న ముడుపులు

ఏసీబీకి ఇచ్చిన ప్రాథమిక నివేదిక తారుమారు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రక్షిత మంచినీటి పథకాన్ని అవినీతిమయంగా మార్చేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డేగ కన్ను వేసింది. ఏసీబీ అధికారి నజీర్‌ గురువారం ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయానికి వచ్చారు. రక్షిత మంచినీటి పథకాలపై ప్రాథమిక విచారణ జరిపిన నివేదికను తీసుకెళ్లారు. సీన్‌ కట్‌ చేస్తే.. అవినీతి అధికారులను ఇంకా రక్షించే ప్రయత్నంలోనే ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉన్నతాధికారులు ఉన్నారు. ప్రాథమిక విచారణ మేరకు బాధ్యులైన వారిపై సస్పెన్షన్‌ వేటు వేయాల్సిన అధికారులు ఏఈ, డీఈఈ, ఈఈలను కాపాడుతుండటం చూస్తుంటే పోస్టులు కొనసాగించుకునేందుకు దండిగా ఆమ్యామ్యాలు ముట్టాయా? అవినీతి అధికారులతో డీల్‌ కుదుర్చు కున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ ఈఈ తాను ఈఎన్‌సీకి రూ.2 లక్షలు ఇచ్చానని సహోద్యోగులకు చెప్పటం ఈ విషయాన్ని బలపరుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవటంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారన్నది అంతుబట్టని వ్యవహారం. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల తీరు చూస్తుంటే ఈఎన్‌సీ కనుసన్నల్లోనే అన్నీ జరుగుతున్నాయని తెలుస్తోంది. 

రెండోరోజూ ఏసీబీ పరిశీలన

రక్షిత మంచినీటి పథకం పనుల్లో అంతులేని అవినీతికి పాల్పడిన ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా కార్యాలయానికి రెండోరోజు గురువారం కూడా ఏసీబీ అధికారులు వచ్చారు. రక్షిత మంచినీటి పథకాల పైపులైన్ల అవినీతి పనులపై ప్రాథమిక నివేదికను తీసుకెళ్లడానికి ఏసీబీ అధికారి నజీర్‌ ఉదయం 11 గంటలకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ అందుబాటులో లేరు. జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొనటానికి వెళ్లారు. దీంతో కార్యాలయ పీఏ రూమ్‌లో ఏసీబీ అధికారి కూర్చున్నారు. తాను రాలేనని, ప్రాథమిక నివేదికను ఏసీబీ అధికారికి ఇవ్వాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. దీంతో కార్యాలయ అధికారులు మొత్తం 20 పేజీలతో కూడిన నివేదికను ఏసీబీ అధికారికి ఇచ్చారు. 

ఈఎన్‌సీ డైరెక్షన్‌లోనే..

ఈఎన్‌సీ స్థాయి అధికారి ఇలాంటి వ్యవహారంలో జోక్యం చేసుకుని అధికారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈఎన్‌సీ కార్యాలయ పరిధిలో డెప్యుటేషన్లకు శ్రీకారం చుట్టడం వెనుక భారీగా ముడుపులు మారాయి. అడిగిన వాడికి లేదన్నట్టుగా పరిమితికి మించి పోస్టులు వేయటంలో కూడా మామూళ్లు అందాయి. ఇలా ప్రతిదీ ఈఎన్‌సీ కార్యాలయం ఉన్నతాధికారులకు కాసుల వేటగా మారిపోతోంది. ఇదే సందర్భంలో ఎన్టీఆర్‌ జిల్లాలో చోటుచేసుకున్న అవినీతి పనులను కూడా క్యాష్‌ చేసుకునేందుకు తెగపడ్డారు. అందుకే దొంగ పనుల్లో అడ్డంగా దొరికినా అధికారులపై చర్యలు మాత్రం తీసుకోవట్లేదు.

ప్రాథమిక నివేదిక కరెక్టేనా? 

రక్షిత మంచినీటి పథకంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై ఇచ్చిన ప్రాథమిక విచారణ అంతా ఫార్సుగా ఉన్నట్టు సమాచారం. ఏసీబీ అధికారికి ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఎలాంటి విషయాలు పొందుపరిచారో ఇంకా బహిర్గతం కాలేదు. కానీ, పూర్తిగా అధికారులను రక్షించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ ఈఈ ధవళేశ్వరపు రామలింగేశ్వర ప్రసాద్‌ దొంగ పనులకు సంబంధించి ఎంబుక్‌లను ట్యాంపరింగ్‌ చేశారు. ఇదే రికార్డుల ట్యాంపరింగ్‌లో చందర్లపాడు ఏఈ నరసింహారావు ఉన్నారు. రికార్డులను ట్యాంపరింగ్‌ చేసిన సాక్ష్యాలు వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటే, ఈ విషయాన్ని ఈఈ ఆ నివేదికలో పొందుపరచలేదని సమాచారం. పన్నెండేళ్లుగా విజయవాడ రూరల్‌ మండలంలో పాతుకుపోయిన ఈడే నాంచారయ్య చేయని పనులను కూడా చేసినట్టుగా ఎంబుక్‌లలో నమోదు చేయించారు. రాయనపాడు, పైడూరుపాడు అవినీతి పనులకు సంబంధించి చెక్‌ మెజర్‌మెంట్‌ చేసిన డీఈఈ సుజాత అడ్డంగా దొరికిపోయారు. చెక్‌ మెజర్‌మెంట్‌ చేసిన కాపీలు రెడ్‌హ్యాండెడ్‌గా వెలుగుచూశాయి. కంచికచర్ల మండల ఏఈ కృష్ణకిషోర్‌ నేతృత్వంలో జరిగిన నాణ్యత లేని పనుల కారణంగా వాటర్‌ టెస్టులో పైపులే పగిలిపోయాయి. పైగా ఈ పనికి ప్రస్తుత విజయవాడ ఈఈ ధవళేశ్వరపు రామలింగప్రసాద్‌ అప్పటి నందిగామ డీఈఈగా చెక్‌ మెజర్‌మెంట్‌ చేశారు. ఇవి మచ్చుకు కొన్నే. అవినీతి పనులు సాక్ష్యాధారాల సహా బయట ప్రపంచానికి తెలిశాయి. విజయవాడ ఎస్‌ఈ నెక్కంటి సత్యనారాయణకు మాత్రం ఇవేమీ తెలియకపోవటం గమనార్హం. 




Updated Date - 2022-05-20T06:19:00+05:30 IST