తెరచాటు తాయిలాలు

ABN , First Publish Date - 2022-05-12T06:06:49+05:30 IST

తెరచాటు తాయిలాలు

తెరచాటు తాయిలాలు
కాంట్రాక్టర్లతో ఆర్‌డబ్ల్యూఎస్‌ అసోసియేషన్‌ నేతల రహస్య సమావేశం

రక్షిత మంచినీటి పథకాల పనుల అవినీతిలో మరో పన్నాగం

రంగంలోకి ఆర్‌డబ్ల్యూఎస్‌ రాష్ట్ర అసోసియేషన్‌ నేతలు 

ఈఎన్‌సీ పిలుపు మేరకు కాంట్రాక్టర్లతో రహస్య భేటీ

దొంగ పనులు జరిగిపోయాయి, వదిలేయండి

కావాల్సిన చోట పనులిప్పిస్తామని ఆఫర్లు

ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం వేదికగా మంతనాలు 


ప్రజారోగ్యం ఎలా పోతేనేం.. మనం మనం కలిసిపోదాం.. పనులను పంచేసుకుందాం.. ఇప్పటివరకు జరిగిన అవినీతి పనులను పక్కన పెట్టేయండి.. మీకేం కావాలో అడగండి.. రక్షిత మంచినీటి పథకంలో జరిగిన అక్రమాలను నిలదీసిన కాంట్రాక్టర్లకు కొందరు అధికారులు వేసిన తాయిలాల ఎర ఇది. ఈఎన్‌సీ ఆధ్వర్యంలో రహస్య భేటీ జరిపి కాంట్రాక్టర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది.

(ఆంధ్ర జ్యోతి, విజయవాడ ) : రక్షిత మంచినీటి పథకంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను కాపాడేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కంకణం కట్టుకున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి చేపట్టిన నాణ్యత లేని పనులపై విచారణ చేయాల్సిన ఉన్నతాధికారి దానిని పక్కన పడేసి బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ రాష్ట్ర అసోసియేషన్‌ నాయకులను రంగ ంలోకి దించారు. కాంట్రాక్టర్లను శాంతింపజేసేందుకు అసోసియేషన్‌ పెద్దల ద్వారా తాయిలాల ఎర వేయించారు. దొంగ పనులు ఎలాగూ జరిగిపోయాయి కాబట్టి, వాటిని మరిచిపోవాలని, కావాలంటే కొత్త వర్కులు ఇప్పిస్తామంటూ ఆఫర్‌ ఇచ్చేశారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌కు ఎదురుగా ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయ ఆవరణలో కాంట్రాక్టర్లతో, అసోసియేషన్‌ పెద్దలు మంగళవారం రహస్యంగా సమావేశమయ్యారు. ఈ భేటీ కి ముఖ్య కారకుడు ఈఎన్‌సీ అని తెలుస్తోంది. ఈ అవినీతి పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌-విజిలెన్స్‌ డీఈఈ శ్రీనివాసరావును  నివేదిక ఇవ్వకుండా అడ్డుకున్నప్పుడే ఈయన పైరవీలకు తెర తీశారన్న అనుమానాలు వచ్చాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన బాధ్యులైన అధికారులతో ఈఎన్‌సీ కార్యాలయం బేరాలకు దిగిందని సమాచారం. ఒక ఈఈ నుంచి ఈఎన్‌సీ కార్యాలయానికి రూ.2.50 లక్షలు వెళ్లినట్టు తెలుస్తోంది. 

నాలుగు గంటల భేటీ - కాంట్రాక్టర్లకు వరాల జల్లు 

ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయ ఆవరణలోని ఒక రూమ్‌లో కాంట్రాక్టర్లతో జరిగిన భేటీ దాదాపు నాలుగు గంటల పైగానే జరిగింది. కాంట్రాక్టర్లు తమ ఇబ్బందులను అసోసియేషన్‌ పెద్దల దృష్టికి తెచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన దొంగతనాలను ప్రశ్నించవద్దని కాంట్రాక్టర్లకు అసోసియేషన్‌ నేతలు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. ఇదే సందర్భంలో కాంట్రాక్టర్లకు అనేక వరాలు కురిపించారు. విజయవాడ డివిజన్‌ పరిధిలో ఎక్కడ కోరితే అక్కడ పనులు ఇప్పిస్తామని, ఐదు శాతం ఎక్సెస్‌ రేటుకు టెండర్లు వేసుకోవచ ్చన్నారు. సింగిల్‌ టెండర్‌ వేసుకోవచ్చని, ఎవరూ పోటీ రారని అభయమిచ్చారు. మెటీరియల్‌ కూడా ఎక్కడైనా కొనుగోలు చేసుకోవచ్చని, అభ్యంతరాలేవీ లేవని ఆఫర్‌ ఇచ్చారు. అంతేకాదు.. ఒక కాంట్రాక్టర్‌కు చెందిన పెండింగ్‌ డిపాజిట్‌ను చెల్లించటానికి కూడా ముందుకు రావటం విశేషం. ఆర్‌డబ్ల్యూఎస్‌ అసోసియేషన్‌ నేతలు ఆఫర్లు ఇవ్వటం వెనుక ఈఎన్‌సీ ప్రమేయం ఉందని తెలుస్తోంది.  

మంత్రి ఏం చేస్తున్నారు..?

ఆర్‌డబ్ల్యూఎస్‌లో రక్షిత మంచినీటి పథకాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, బాధ్యులైన వారిని తన ఎదుట హాజరుపరచమని ఆదేశించిన రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ముత్యాలనాయుడు మౌనంగా ఉండిపోయారు. అవినీతి పనులతో అడ్డంగా దొరికిపోయిన బాధ్యులైన అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారం కోరారు. మంత్రికి సిఫార్సులు వస్తుండటంతో ఈ కేసు విషయంలో ఆయన మెత్తబడినట్టు తెలుస్తోంది. 



నాణ్యత లేని పనులతో కలుషిత నీరు 

రక్షిత మంచినీటి పనుల్లో నాణ్యత లేకపోతే ప్రజారోగ్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాయనడానికి గన్నవరం మండలంలో జరిగిన పనులే నిదర్శనం. కేసరపల్లి గ్రామ పంచాయతీలోని వెంకట నరసింహాపురం కాలనీలో నాణ్యతలేని పైపులైన్లు వాడటం కారణంగా కొద్దికాలానికే పగిలిపోయాయి. దాని నుంచి కలుషిత నీరు వస్తోంది. పైపుల్లోకి డ్రెయినేజీ వాటర్‌ చేరుతోంది. నల్లటి రంగుతో భరించలేని దుర్వాసనతో డ్రెయినేజీ నీరు ఇంటింటికీ సరఫరా అయ్యింది. ఈ సమస్యపై వారం రోజులుగా స్థానిక సెక్రటరీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఇది ఒక్క గన్నవరం ఉదంతమే. ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగిన అవినీతి పనులకు సంబంధించి ఇప్పటికే పగిలిపోయిన పైపులైన్లు చాలా ఉన్నాయి. మిగిలిన అవినీతి పనులకు సంబంధించి కూడా పైపులైన్లు పగిలితే, ప్రజారోగ్యంపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుం దనటంలో ఎలాంటి సందేహం లేదు. 


Read more