దుందుడుకు రష్యా

ABN , First Publish Date - 2022-04-30T08:15:13+05:30 IST

విచక్షణ లేని దాడులు.. పౌరులపై అరాచకాలతో ఉక్రెయిన్‌లో తన క్రూరత్వాన్ని చాటిన రష్యా మరోసారి దుందుడుకు చర్య కు దిగింది.

దుందుడుకు రష్యా

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై క్షిపణి దాడులు.. యూఎన్‌ చీఫ్‌ ఉండగానే దుశ్చర్య


మహిళా జర్నలిస్టు మృతి.. 2 వారాల్లో తొలి డిఫెన్స్‌ ప్లాంట్‌పై దాడి చేశామన్న రష్యా

25 అంతస్తుల నివాస భవనంపైకి క్షిపణి!


కీవ్‌, ఏప్రిల్‌ 29: విచక్షణ లేని దాడులు.. పౌరులపై అరాచకాలతో ఉక్రెయిన్‌లో తన క్రూరత్వాన్ని చాటిన రష్యా మరోసారి దుందుడుకు చర్య కు దిగింది. యుద్ధ బాధిత దేశానికి అమెరికా సహా పశ్చిమ దేశాల ఆయుధ, ఆర్థిక సాయం పెరుగుతుండడంతో ఉక్రోశం వెళ్లగక్కింది. నెల క్రితమే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి నిష్క్రమించి అడపాదడపా దాడులకు పరిమితమవుతున్న రష్యా.. గురువారం అనూహ్య చర్యకు దిగింది. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కీవ్‌లో ఉండగానే, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో గుటెరస్‌ సమావేశం ముగిసిన గంటలోనే క్షిపణి దాడులు చేసింది. అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణులతో ఆర్టియోమ్‌ క్షిపణి-అంతరిక్ష కేంద్రంపై దాడి చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటనలో రేడియో ఫ్రీ యూర్‌ప/రేడియో లిబర్టీ మీడియా సంస్థ  మహిళా జర్నలిస్టు విరా హైరిచ్‌ ప్రాణాలు కోల్పోయారు. కీవ్‌పై రష్యా దాడుల్లో ఓ వ్యక్తి మృతి చెందడం 2 వారాల తర్వాత ఇదే తొలిసారి.  మరోవైపు రష్యా క్షిపణులు ఓ నివాస భవనాన్ని తాకినట్లు కీవ్‌ మేయర్‌ విటాలి క్లిట్చ్కో తెలిపారు. ఈ ఽభవనం శిథిలాల్లో హైరిచ్‌ మృతదేహాన్ని గుర్తించారు. ఉక్రెయిన్‌ అత్యవసర సర్వీసుల విభాగం మాత్రం రష్యా క్షిపణి 25 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను తాకిందని పేర్కొంది. రష్యా ఐదు క్షిపణులను ప్రయోగించిందని జెలెన్‌స్కీ ఆరోపించారు.


కీవ్‌కు ఎంబసీలు వస్తున్నందుకేనా?

పలు దేశాలు ప్రస్తుతం కీవ్‌లో రాయబార కార్యాలయాల పునరుద్ధరణలో ఉన్నాయి. నెదర్లాండ్స్‌ ఎంబసీని ప్రారంభించింది. యూకే, అమెరికా సహా మరికొన్ని దేశాలు ఇదే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా దాడులకు దిగింది. కీవ్‌ సమీప కీలక రైల్వే హబ్‌ ఫస్తివ్‌లోనూ దాడులు చేసింది. జాపోరిజ్జియాలో తొలిసారి నివాస భవనంపై రాకెట్లు ప్రయోగించింది. లైసిచాన్స్క్‌, సెవెరోడొనెట్స్క్‌లో శుక్రవారం పోరు ఉధృతంగా సాగింది. పశ్చిమంలోని పొలెన్నె, చెర్నిహివ్‌, దక్షిణంలోని ఒడెస్సా.. ఇలా ఉక్రెయిన్‌వ్యాప్తంగా దాడులు జరిగాయి. గూఢచారులుగా అనుమానిస్తూ జాపోరిజ్జియాలో ఇద్దరు బ్రిటన్‌ పౌరులను రష్యా అపహరించింది. లైంగిక హింస సహా ఉక్రెయిన్‌ ప్రజలపై రష్యా సైన్యం సాగించిన అరాచకాలపై విచారణకు బ్రిటన్‌ ప్రత్యేక బృందాన్ని పంపనుంది. 


బాల్టిక్‌, నల్ల సముద్రాలపై రష్యా విమానాలు

బాల్టిక్‌, నల్ల సముద్రాల గగన తలంపై నాలుగు రోజులుగా రష్యా విమానాలు తిరుగు తున్నట్లు నాటో దేశా ల రాడార్లు పసిగట్టాయి. దీంతో తమ ఫైటర్‌ జెట్‌లను అప్రమత్తం చేశాయి. 


క్వాడ్‌లో ఉక్రెయిన్‌పై చర్చ: అమెరికా

ఉక్రెయిన్‌ యుద్ధం విషయమై భారత్‌తో అమెరికా చర్చలు జరుపుతోందని.. వచ్చే నెలలో జపాన్‌లో జరిగే క్వాడ్‌ దేశాల సమావేశంలోనూ ఇది కొనసాగుతుందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జాన్‌ పాస్కీ తెలిపారు. ఉక్రెయిన్‌పై తమ విధానాన్ని ఇప్పటికే భారత నాయకులకు తెలియజేసిన సంగతిని గుర్తుచేశారు. కాగా, ఉక్రెయిన్‌ వెళ్లిన అమెరికా మాజీ మెరైన్‌ సైనికుడు గత సోమవారం మృతిచెందాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు వెళ్లొద్దంటూ తమ పౌరులను అమెరికా హెచ్చరించింది.

Updated Date - 2022-04-30T08:15:13+05:30 IST