కోవిడ్-19 మహమ్మారి : నిర్దాక్షిణ్య నియంత్రణతో సత్ఫలితాలు

ABN , First Publish Date - 2020-04-10T23:39:51+05:30 IST

కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే దయాదాక్షిణ్యాలు లేని కఠిన చర్యలు తప్పనిసరి అని

కోవిడ్-19 మహమ్మారి : నిర్దాక్షిణ్య నియంత్రణతో సత్ఫలితాలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే దయాదాక్షిణ్యాలు లేని కఠిన చర్యలు తప్పనిసరి అని రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో పరిస్థితులనుబట్టి అర్థమవుతోంది. రాష్ట్రం మొత్తం మీద నోవల్ కరోనా వైరస్ వల్ల తీవ్రంగా ప్రభావితమైన  జిల్లాగా భిల్వారా గత నెలలో  వార్తల్లో నిలవగా, తాజాగా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో విజయం సాధించినందుకు ప్రశంసలు పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా భిల్వారాను ప్రశంసించిన సంగతి తెలిసిందే.


భిల్వారా జిల్లా కలెక్టర్ రాజేంద్ర భట్ శుక్రవారం మాట్లాడుతూ తమ జిల్లాలో 27 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది కోలుకున్నారని, వీరిలో 15 మంది ఆసుపత్రి నుంచి విడుదలయ్యారని, మిగిలిన 10 మంది ప్రస్తుతం పరిశీలనలో ఉన్నారని, వీరిని కూడా మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి విడుదల చేస్తామని తెలిపారు. కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్థరణ అయిన ఇద్దరు వృద్ధులు మరణించారని, అయితే వీరికి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని తెలిపారు. 


భిల్వారా జిల్లాలో ఈ నెల 3 నుంచి కట్టుదిట్టమైన కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులను కొనుక్కోవడంపై కూడా పకడ్బందీ ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో 4 లక్షల జనాభాగల భిల్వారా పట్టణంలో ఇప్పటి వరకు కేవలం రెండు కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. 


24 లక్షల జనాభాగల ఈ జిల్లాలో ఆరోగ్య కార్యకర్తలు పర్యటిస్తూ, ప్రజలందరికీ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఈ వైరస్ సోకినవారితో కలిసినవారిని కూడా యుద్ధ ప్రాతిపదికపై గుర్తించడం విశేషం.


ఈ విజయం ఎలా సాధ్యమైందంటే...

- యావత్తు జిల్లానే ఐసొలేషన్‌లో ఉంచారు. సరిహద్దులను మూసేశారు. 

- పట్టణంలోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలకు పరీక్షలు నిర్వహించారు.

- హోటళ్ళు, రిసార్టులు, హాస్టళ్ళు, ధర్మశాలలను జిల్లా యంత్రాంగం స్వాధీనం చేసుకుని, 1,500 క్వారంటైన్ బెడ్లను, 14,400 సాధారణ బెడ్లను ఏర్పాటు చేశారు.

- కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని వెంటనే హోం క్వారంటైన్ చేశారు. 

- కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థరణ అయితే వెంటనే ఐసొలేషన్ వార్డులకు తరలించారు. 

- అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ నిర్వహించారు.

- జిల్లా మొత్తం కర్ఫ్యూ పాటించారు. ఎవ్వరికీ ఎటువంటి మినహాయింపులు, సడలింపులు ఇవ్వలేదు.

- భిల్వారా పట్టణవాసులకు వారి ఇళ్ళ వద్దకే నిత్యావసర వస్తువులను చేరవేశారు.


ఈ చర్యలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనాన్ని ప్రకటించడానికి ముందే ప్రారంభించడం విశేషం. మొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడిన వెంటనే మార్చి 20 నుంచే ఈ జిల్లా పూర్తిగా అష్ట దిగ్బంధనంలోకి వెళ్ళింది. మోదీ మార్చి 24న దేశవ్యాప్త అష్ట దిగ్బంధనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2020-04-10T23:39:51+05:30 IST