‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ డోసు రూ.740

ABN , First Publish Date - 2020-11-25T09:47:35+05:30 IST

మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కరోనా వ్యాక్సిన్ల ధరలు, ప్రభావశీలతలపై ప్రకటనలు

‘స్పుత్నిక్‌-వి’ వ్యాక్సిన్‌ డోసు రూ.740

  • మనుషులపై రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ట్రయల్స్‌ 
  • విజయవంతమైతే మార్చికల్లా భారత్‌కు?

మాస్కో, నవంబరు 24 : మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్న కంపెనీలు తమ కరోనా వ్యాక్సిన్ల ధరలు, ప్రభావశీలతలపై ప్రకటనలు చేసే పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి కూడా చేరింది. ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటించారు. అమెరికా కంపెనీలు ఫైజర్‌, మోడెర్నాల ఎం-ఆర్‌ఎన్‌ఏ రకం కొవిడ్‌ వ్యాక్సిన్ల ధరలతో పోలిస్తే ఇది రెండు, మూడు రెట్లు తక్కువన్నారు. అయితే రష్యా పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందుతుందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాక్సిన్‌ ప్రభావశీలత సగటున 95 శాతం ఉందని ఆయన తెలిపారు. 18,833 మంది రోగులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల రెండో మధ్యంతర సమీక్షలో ఈవిషయం వెల్లడైందని పేర్కొన్నారు. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్న తర్వాత 28వ రోజున రోగుల్లో 91.4 శాతం సానుకూల ప్రభావం కనిపించగా, 42వ రోజున గరిష్ఠంగా 95 శాతం ప్రభావాన్ని గుర్తించినట్లు దిమిత్రీవ్‌ చెప్పారు. వలంటీర్లలో ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని స్పష్టంచేశారు. 


సాధారణ రిఫ్రిజిరేటర్‌లోనూ స్పుత్నిక్‌-విని నిల్వ చేయొచ్చన్నారు. భారత్‌, చైనా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, రష్యాల్లో వచ్చే ఏడాది చివరికల్లా 100 కోట్లకుపైగా  వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తికి ఆసక్తి ఉన్న దేశాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌ డోసుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న దేశాలకు 2021 మార్చి నుంచి పంపిణీ మొదలవుతుందన్నారు. మరోవైపు.. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌తో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ త్వరలోనే మనుషులపై రెండు/మూడోదశ ప్రయోగ పరీక్షలు ప్రారంభించనుంది. వాటిలో సానుకూల ఫలితాలు వచ్చి, నియంత్రణ సంస్థల అనుమతులు మంజూరైతే మార్చికల్లా స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను అందుకునే దేశాల జాబితాలో భారత్‌ కూడా చేరిపోతుంది. కాగా, ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఒక డోసు ధర రూ.1362, మోడెర్నా వ్యాక్సిన్‌ ఒక డోసు ధర రూ.1800 - 2800 ఉండటం గమనార్హం. 

Updated Date - 2020-11-25T09:47:35+05:30 IST