12 మంది Russian దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు

ABN , First Publish Date - 2022-03-01T12:47:59+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో అమెరికా 12 మంది రష్యా దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు విధించింది....

12 మంది Russian దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు

వాషింగ్టన్ : ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో అమెరికా 12 మంది రష్యా దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు విధించింది. ఐక్యరాజ్యసమితిలో ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లుగా పనిచేస్తున్న రష్యాకు చెందిన 12మంది రష్యన్ దౌత్యవేత్తలను అమెరికా దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ వెల్లడించింది.‘‘మా జాతీయ భద్రతకు ప్రతికూలమైన గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా యునైటెడ్ స్టేట్స్‌లో రష్యా దౌత్యవేత్తలు వారి నివాస అధికారాలను దుర్వినియోగం చేశారు."అని యూఎస్ మిషన్ ప్రతినిధి ఒలివియా డాల్టన్ చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ విడిచిపెట్టమని కోరిన దౌత్యవేత్తలు వారి బాధ్యతలు విస్మరించి, సంబంధం లేని కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ఒలివియా చెప్పారు.


రష్యాకు చెందిన దౌత్యవేత్తలు దౌత్యేతర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని ఐక్యరాజ్యసమితిలో అమెరికా డిప్యూటీ రాయబారి రిచర్డ్ మిల్స్ గతంలో ఆరోపించారు. మార్చి 7వతేదీలోగా 12 మంది రష్యా దౌత్యవేత్తలు యునైటెడ్ స్టేట్స్ ను వదిలి వెళ్లాలని ఆదేశించినట్లు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రష్యా దౌత్యవేత్త వాసిలీ నెబెంజియా  చెప్పారు.నిష్క్రమించమని చెప్పిన వారిలో తాను కూడా ఉన్నానో లేదో పేర్కొనడానికి అతను నిరాకరించారు.ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన 100 మంది సిబ్బంది పనిచేస్తుండగా వారిలో 12 మంది దౌత్యవేత్తలపై అమెరికా బహిష్కరణ వేటు వేసింది. 


Updated Date - 2022-03-01T12:47:59+05:30 IST