పౌరులపై రష్యా సైనికుల కాల్పులు: ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-03-06T20:55:24+05:30 IST

యుద్ధం వల్ల రష్యా 11,000 సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ ప్రకటించింది. నల్ల సముద్రం సమీపంలోని మైకోలైవ్ నగరం సమీపంలో భీకర పోరాటం జరుగుతోందని తెలిపింది. నౌకాశ్రయ నగరం మరియుపోల్‌లో శనివారం కాసేపు కాల్పుల విరమణ తర్వాత పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో చిక్కుకున్నవారిని..

పౌరులపై రష్యా సైనికుల కాల్పులు: ఉక్రెయిన్

కీవ్: తమ దేశంలోని నగరాలను ఖాళీ చేయించడం కోసం పౌరులపై రష్యా సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 11వ రోజుకు చేరుకుంది. ఇరు దేశాల సేనలు యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్లకు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు సంబంధించిన వివరాలను శనివారం పంపిన జెలెన్‌స్కీ.. తమకు సహాయం చేయాల్సిందిగా కోరారు. ఉక్రెయిన్‌లోని మారియుపోల్, వోల్నోవాఖా, ఇర్పిన్ నగరాల్లో పౌరులపై తీవ్రమైన కాల్పులు జరిగాయని అమెరికాకు తెలిపారు. అయితే ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న పోరులో మూడో వ్యక్తి ఎవరైనా ప్రవేశిస్తే.. తీవ్ర పరినామాలు ఉంటాయని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిస్తున్నారు.


కాగా, యుద్ధం వల్ల రష్యా 11,000 సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ ప్రకటించింది. నల్ల సముద్రం సమీపంలోని మైకోలైవ్ నగరం సమీపంలో భీకర పోరాటం జరుగుతోందని తెలిపింది. నౌకాశ్రయ నగరం మరియుపోల్‌లో శనివారం కాసేపు కాల్పుల విరమణ తర్వాత పెద్ద ఎత్తున బాంబు దాడులు జరిగినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాల్లో చిక్కుకున్నవారిని తరలించేందుకు మానవతావాద కారిడార్లను అనుమతించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. సాధారణ ప్రజలపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలను రష్యా ఖండిస్తోంది. అయినప్పటికీ వేలాది మంది ప్రజలు ప్రధాన నగరాలను వదిలిపెట్టి పారిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1.5 మిలియన్ల మంది దేశం విడిచి వెళ్ళిపోయినట్లు అంచనా.


నల్ల సముద్రం సమీపంలో ఉన్న మరియుపోల్ నగరంలోశనివారం కాసేపు కాల్పుల విరమణ అమలైంది. ఆ తర్వాత రష్యా దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ నగరంలో తాగునీరు, విద్యుత్తు సదుపాయాలకు విఘాతం కలిగింది. ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ‘డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్’ తెలిపింది.

Updated Date - 2022-03-06T20:55:24+05:30 IST