మాస్కో: రష్యా విమానం ఎల్-410 ఆదివారంనాడు సెంట్రల్ రష్యాలోని టటర్‌స్థాన్ సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారని, ఏడుగురు గాయపడ్డారని ఆర్ఐఏ వార్తా సంస్థ తెలిపింది. విమానంలో వెళ్తున్న వారంతా పారాచ్యూట్ జంపర్లేనని అత్యవసర సర్వీసుల మంత్రిత్వ శాఖ తెలిపింది. శిథిలాల కింద నుంచి ఏడుగురిని సజీవంగా బయటకు తీసుకువచ్చినట్టు పేర్కొంది.
ట్విన్ ఇంజన్ షార్ట్ రేంజ్ రవాణా విమానంగా ఎల్-410 టర్బోలెట్‌ను వినియోగిస్తుంటారు. రష్యా ఏవియేషన్ భద్రతా ప్రమాణాలు ఇటీవల కాలంలో మెరుగుపడినప్పటికీ పాతబడిన విమానాల వాడకం ప్రమాదాలకు దారితీస్తోంది. గత నెలలో పాతబడిన ఆంటోనోవ్ ఎఎన్-26 రవాణా విమానం కుప్పకూలి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గత జూలైలో కమ్‌చట్కా ప్రాంతంలో ఆంటోనోవ్ ఎఎన్-26 ట్విన్ ఇంజన్ టర్బోప్రాప్ కుప్పకూలి అందులోని మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.