భార‌త్‌ ప్రేమ‌లో ప‌డ్డ‌‌ ర‌ష్య‌న్‌ తల్లీకూతుళ్ళు.. ఇక్క‌డే ఉండిపోతామంటూ..

ABN , First Publish Date - 2020-08-09T16:02:53+05:30 IST

పర్యాటకులుగా భారతదేశానికి వచ్చి లాక్‌డౌన్‌ కష్టాలు అనుభవించిన రష్యన్‌ తల్లీకూతుళ్ళు ఇప్పుడీ దేశంతోనే ప్రేమలో పడ్డారు.

భార‌త్‌ ప్రేమ‌లో ప‌డ్డ‌‌ ర‌ష్య‌న్‌ తల్లీకూతుళ్ళు.. ఇక్క‌డే ఉండిపోతామంటూ..

భారతదేశం ప్రేమలోపడ్డ రష్యన్‌ అమ్మాకూతుళ్ళు

తిరుపతి(ఆంధ్రజ్యోతి): పర్యాటకులుగా భారతదేశానికి వచ్చి లాక్‌డౌన్‌ కష్టాలు అనుభవించిన రష్యన్‌ తల్లీకూతుళ్ళు ఇప్పుడీ దేశంతోనే ప్రేమలో పడ్డారు. పర్యాటక వీసా గడువు దాటిపోయినా ‘మేమిక్కడే ఉండిపోతాం.. ఈ దేశం, ఇక్కడి సంస్కృతి, ఇక్కడి సంప్రదాయాలు చాలా నచ్చాయి. భారతదేశంలో ఉండిపోవడానికి మాకు అవకాశం ఇవ్వండి’ అని అర్ధిస్తున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చి తిండికి కూడా డబ్బుల్లేక స్థానికుల ఆదరణతో తిరుపతిలో ఉన్న వీరు ఆంధ్రజ్యోతితో పంచుకున్న సంగతులు..


రష్యా రాజధాని మాస్కో నగరంలో మా నివాసం. నా పేరు ఎస్తర్‌. ఫిజియోథెరపీలో డిప్లొమో చేసి, ప్రయివేటు వైద్య సంస్థలో ఆక్యుపంక్చర్‌ వైద్యం చేస్తున్నాను. మా అమ్మ ఒలీవియా కూడా వైద్య రంగంలోనే ఉన్నారు. వెన్నెముకకు చైనా సంప్రదాయ వైద్యం చేస్తారు. భారతదేశపు ఆథ్యాత్మిక ఔన్నత్యాన్ని గురించి విని ఫిబ్రవరిలో ఈ దేశ పర్యటనకు వచ్చాం. ఢిల్లీలో దిగి పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌కి వెళ్లాం. లాక్‌డౌన్‌తో అక్కడి నుంచీ కదల్లేకపోయాం. తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుందామని జూలై 17న ఇక్కడికి వచ్చాం. విదేశీయులమని దర్శనం లేదన్నారు.


అప్పటికే మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఏం చేయాలో తెలియలేదు. బృందావనంకి రష్యన్‌ దేశస్థులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అక్కడికి వెళ్తే మీకు సాయం దొరకచ్చు అని తిరుపతిలో మేం దిగిన హోటల్‌ వాళ్లు సలహా ఇచ్చారు. మా అమ్మ బృందావనంకి వెళ్ళింది. నేను తిరుపతిలోనే ఉండిపోయా. డబ్బులు తీసుకోకుండా నాకు భోజనం పెట్టారు. బృందావనంకి వెళ్ళిన మా అమ్మకి అక్కడ సాయం చేసేవారు ఎవరూ దొరకలేదు. ఇంతలో ఆమె ఫోన్‌ కూడా పనిచేయడం మానేసింది. అమ్మ ఒక దగ్గర నేను ఒక దగ్గర. తీవ్రంగా ఆందోళన పడ్డాను. హోటల్‌ వారి సలహాతో మీడియాకి సమాచారం ఇచ్చాను.


దాంతో అడ్వొకేట్‌ దంపతులు కృష్ణమూర్తి, మమత వచ్చి కలిశారు. ఇక నా మకాం వాళ్ళ ఇంటికే మారిపోయింది. ఇస్కాన్‌ సాయంతో వారు బృందావనంలో ఉన్న అమ్మ ఆచూకీ తెలుసుకున్నారు. అమ్మను తిరిగి తిరుపతికి వారే రప్పించారు. ఇద్దరం మళ్లీ ఇక్కడ కలుసుకున్నాం. మా దగ్గర తిరిగి మా దేశానికి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు. నిజానికి ఇక్కడి మనుషులనూ, వారిలోని స్నేహభావాన్నీ, ఆదరణనూ, ఆథ్యాత్మిక దృష్టినీ చూశాక మాకు మా దేశానికి  తిరగి వెళ్లాలని కూడా అనిపించడం లేదు. ఇంత గొప్ప సాంస్కృతిక ఔన్నత్యంగల ఈ దేశంలో ఉండిపోయే అవకాశం ఉంటే బావుండనే కోరిక పెరుగుతోంది. అట్లా ఉండడానికి అవకాశం ఇవ్వాలని మా అమ్మా నేనూ వేడుకుంటున్నాం. మా భారతీయ వీసా గడువు కూడా అయిపోయింది. లాక్‌డౌన్‌తో ఇక్కడ ఇరుక్కుపోయినా మాకు గొప్ప మనుషుల మధ్య ఉన్న అనుభూతిని కలిగించింది. 


భారతదేశంకు ఎందుకొచ్చామంటే..

ఇది  ఆధ్యాత్మిక దేశం. ఇక్కడ ఎవ్వరైనా మారుతారు. కొత్త జీవితం ప్రారంభిస్తారు. నాకు ఎప్పుడూ మానసిక ఒత్తిడి ఉండేది. ఇక్కడకు వచ్చాక పూర్తిగా మారిపోయింది. నేను దేవుడిని నమ్ముతాను. జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకుంటున్నాను. ఇస్కాన్‌ ఒక మతం కాదు. వేద జీవితానికి ప్రతిబింబం. నాకు 12 ఏట నుంచే ఇస్కాన్‌ గురించి తెలుసు. అన్ని మతాల పట్ల నాకు గౌరవం వుంది. అయితే వేదిక్‌ ధర్మం గొప్పది. భక్తి శాస్త్రంలో మార్పు తెచ్చే శక్తి చాలా ఉంది. మరింత అవగాహన చేసుకోవాలనే భారతదేశంకు వచ్చాం. 


ఆలయాల్లో వైబ్రేషన్‌

భారతదేశంలోని ఆలయాలకు వెళ్లినపుడు నాలో ఏదో తేడా వస్తోందని గుర్తించారు. ఒత్తిడి మాయమై హాయిగా ఉంటోంది. క్షేత్రాల్లో వైబ్రేషన్‌ అలాంటిది. ఆలయాలకి వెళ్లటం నాకు అత్యంత ఎక్కువ ఆనందం కలిగించింది. సేల్ఫ్‌ ఎస్టీమ్‌ పెరిగింది. గతంలో మెటిరియలిస్టిక్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఎవరు? అనే ప్రశ్న ఉదయిస్తోంది. జీవితం పట్ల, యూనివర్శ్‌ పట్ల అవగాహన పెరుగుతుంది. జయపూర్‌, మాయాపూర్‌ వంటి క్షేత్రాలు పర్యటించాం. ఇంకా పర్యటించాలని ఉంది. కొవిడ్‌ నిబందనల వల్ల సాధ్యం కాలేదు.


తిరుమల శ్రీనివాసుడి సన్నిధి

కృష్ణమూర్తి, మమతలతో కలిసిన తిరుమల క్షేత్రం దర్శించుకున్నాను. దేవుడిని ఒక్క నిమిషం మాత్రమే చూశాను. దర్శనం చేసుకున్న క్షణంలో నా మనసులో భావాలను చెప్పటానికి మాటలు రావటం లేదు. దేవుడిని ఏం కోరుకున్నానో మాత్రం చెప్పను. 


భగవద్గీత పఠనంతో శాంతి

కర్మ సిద్ధంతం, మంచి చేస్తే మంచి జరుగుతుంది. మంచి మనకు జీవితంలో అనేక ద్వారాలను తెరుస్తుంది నేను 15 సంవత్సరాల వయస్సులో ఉన్నపుడు భగవద్గీత గురించి తెలిసింది. భగవద్గీత చెప్పినట్టు జీవిస్తే భావోద్వేగం, కోపం, వంటిని బ్రేక్‌ చేయవచ్చు. మనపై మనకు కంట్రోల్‌ వస్తుంది.భగవద్గీత ఎంతో మనోశాంతిని ఇస్తుంది. నిత్యం కొంత భగవద్గీత చదువుతాను. 


ఇక్కడే చదువుకోవాలని ఉంది..

ఏకాంతంగా తిరుపతిలో ఉన్నపుడు ముందుకు నడిపించింది భగవద్గీతే. నాపై నాకు నమ్మకం పెరిగింది. భవిష్యత్తులో ఏం చేయాలో క్లారిటీ వచ్చింది. నా జీవితంలో సమస్యలకు దారి ఏది అని వెతుక్కునేపుడు అనేక దారులు కనిపించాయి. మన మార్గానికి దారులకు, రక రకాల తాళాలను తీయాల్సి ఉంటుంది. నా జీవితానికి తాళం దేవుడే చూపించాడు. నాకు ఏం కావాలో క్లారిటీ వచ్చింది. నాకు నేర్చుకునే గుణం ఎక్కువ. వేద ధర్మాన్ని తెలుసుకోవాలంటే. ఇక్కడకే తిరిగి రావాలి. ఇక్కడ ఎక్కువ కాలం గడపాలని ఉంది. ఇక్కడే చదువుకోవాలనీ ఉంది. అయితే నిబంధనల ప్రకారం నేను ఇక్కడ చదువుకోవటానికి అవకాశం లేదు. బహుశా తిరిగి భారతదేశానికి రావటం సాధ్యం కాక పోవచ్చు కూడా. 


"పర్యాటకులుగా వచ్చి లాక్‌డౌన్‌తో ఇక్కడ ఉండిపోయిన మాకు  సాయం చేస్తామని చాల మంది ముందుకు వస్తున్నారు. సాయం చేస్తున్నారు కూడా. అయితే వారందరికీ నా విన్నపం ఏమిటంటే... రష్యా దేశంలో మాకంటూ ఏమీ లేదు. ఇది గొప్ప ఆథ్యాత్మిక సంపద ఉన్న దేశం. మమ్మల్ని ఎలాగైనా భారతదేశంలోనే ఉండేలా చేయండి." ఒలీవియా, ఎస్తర్‌ తల్లి

Updated Date - 2020-08-09T16:02:53+05:30 IST