జైశంకర్ నిజమైన దేశభక్తుడు : రష్యా విదేశాంగ మంత్రి

ABN , First Publish Date - 2022-04-19T23:37:48+05:30 IST

విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ నిజమైన దేశభక్తుడని

జైశంకర్ నిజమైన దేశభక్తుడు : రష్యా విదేశాంగ మంత్రి

న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ నిజమైన దేశభక్తుడని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ ప్రశంసించారు. ఓ టీవీ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెర్గీ మాట్లాడుతూ, భారత్ మాదిరిగా వ్యవహరించగలిగే దేశాలు చాలా తక్కువ ఉంటాయన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ భారత దేశం తన విదేశాంగ విధానాన్ని తానే నిర్ణయించుకుంటుందని తెగేసి చెప్పడంతో జైశంకర్‌ను సెర్గీ ఈ విధంగా మెచ్చుకున్నారు. 


‘‘విదేశాంగ మంత్రి జైశంకర్ గొప్ప అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త, తన దేశానికి నిజమైన భక్తుడు. ‘భారత దేశ అభివృద్ధి కోసం, భద్రత కోసం ఏది అవసరమని భారత దేశం నమ్ముతుందో, ఆ నమ్మకం ప్రాతిపదికపైనే మేం నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. ఇలా చెప్పగలిగే దేశాలు ఎన్నో లేవు’’ అని సెర్గీ లవ్‌రోవ్ ప్రశంసించారు. 


ఆహార భద్రత, రక్షణ రంగం, కొన్ని వ్యూహాత్మక రంగాల కోసం పాశ్చాత్య దేశాలపై రష్యా ఆధారపడదని సెర్గీ చెప్పారు. ఐక్యరాజ్య సమితి చార్టర్‌ను ఉల్లంఘించని, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడని దేశాలన్నిటికీ సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అటువంటి దేశాల్లో భారత దేశం ఒకటని తెలిపారు. తాము ద్వైపాక్షికంగా సహకరించుకుంటామన్నారు. భారత దేశం రష్యాకు చాలా పాత మిత్ర దేశమని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న బాంధవ్యం ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ అని చాలా కాలం క్రితమే తాము చెప్పామన్నారు. ఈ బాంధవ్యాన్ని ‘విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం’ అని ఎందుకు పిలవకూడదని దాదాపు ఇరవయ్యేళ్ళ క్రితం భారత దేశం ప్రశ్నించిందని తెలిపారు. దీనిని ‘అసాధారణ విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం’ అని పిలుచుకుందామని భారత్ ఇటీవల చెప్పిందని తెలిపారు. ఇది ద్వైపాక్షిక సంబంధాలకు అత్యంత ప్రత్యేకమైన వర్ణన అని పేర్కొన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ పథకానికి రష్యా సహకరిస్తోందన్నారు. భారత దేశానికి అవసరమైనవాటిని ఆ గడ్డపైనే ఉత్పత్తి చేయడం ప్రారంభించామని చెప్పారు. 


Updated Date - 2022-04-19T23:37:48+05:30 IST