ఉక్రెయిన్‌లో రష్యా దళాలకు తీవ్ర ప్రతిఘటన : బ్రిటన్

ABN , First Publish Date - 2022-03-03T20:08:24+05:30 IST

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా దళాలకు విపరీతమైన ప్రతిఘటన ఎదురవుతోందని

ఉక్రెయిన్‌లో రష్యా దళాలకు తీవ్ర ప్రతిఘటన : బ్రిటన్

కీవ్ : ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా దళాలకు విపరీతమైన ప్రతిఘటన ఎదురవుతోందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు ఓ వార్త సంస్థ తెలిపింది. ఖెర్సోన్ మినహా, ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్ సహా ఇతర ముఖ్యమైన నగరాలను స్వాధీనం చేసుకోవడంలో గడచిన మూడు రోజుల్లో రష్యన్ దళాలు చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేకపోయాయని తెలిపింది. 


ఖార్కివ్, చెర్నిహివ్, మరియుపోల్ నగరాలు ఇప్పటికీ ఉక్రెయిన్ నియంత్రణలోనే ఉన్నట్లు తెలిపింది. రష్యన్ దళాల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నప్పటికీ ఉక్రెయినియన్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని చెప్పింది. 


కీవ్ నగరంవైపు వెళ్తున్న రష్యన్ దళాల్లో ప్రధాన విభాగాలు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. మెకానికల్ బ్రేక్‌డౌన్, రద్దీ కూడా జత కలిశాయని తెలిపింది. ఈ అన్ని కారణాల వల్ల రష్యన్ దళాలు ముందుకు సాగడం ఆలస్యమవుతోందని పేర్కొంది.   బాంబులు కురిపిస్తున్నప్పటికీ ఖార్కివ్, చెర్నిహివ్, మరియుపోల్ నగరాలను రష్యా స్వాధీనం చేసుకోలేకపోతోందని తెలిపింది. 


ఖెర్సోన్ నగర మేయర్ ఐగోర్ కొలిఖయేవ్ బుధవారం ఉదయం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నగరంలోకి రష్యన్ దళాలు ప్రవేశించాయని తెలుస్తోంది. అయితే మేయర్ ప్రకటన, ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటన పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఖెర్సోన్ నగరంలో యుద్ధం జరుగుతోందని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. దక్షిణ ఉక్రెయిన్‌లో, నల్ల సముద్ర తీరంలో ఈ నగరం ఉంది. 


Updated Date - 2022-03-03T20:08:24+05:30 IST