3700 మంది భారతీయుల్ని నిర్బంధించారు: రష్యా రాయబారి

ABN , First Publish Date - 2022-03-06T13:09:08+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత్‌, ఇతర దేశాల పౌరులు, విద్యార్థులను తరలించేందుకు సిద్ధమని రష్యా ప్రకటించింది.

3700 మంది భారతీయుల్ని నిర్బంధించారు: రష్యా రాయబారి

ఐరాసలో రష్యా రాయబారి ఆరోపణలు

ఐరాస, మార్చి 5: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత్‌, ఇతర దేశాల పౌరులు, విద్యార్థులను తరలించేందుకు సిద్ధమని రష్యా ప్రకటించింది. ఖార్కివ్‌, సుమీ నగరాల్లో ఉన్న విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు తమ బస్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా ఈ మేరకు ఐరాస భద్రతా మండలికి తెలియజేశారు. ఉక్రెయిన్‌లోని జెపోరిఝ్యా అణు విద్యుత్కేంద్రంపై రష్యా దాడుల నేపథ్యంలో 15 దేశాల భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది.

ఈ సందర్భంగా వాసిలీ మాట్లాడుతూ.. ఖార్కివ్‌, సుమీ నగరాల్లో ఉక్రెయిన్‌ దేశస్థులు 3700 మంది భారత పౌరులను బలవంతంగా ఉంచేశారని ఆరోపించారు. ‘‘పౌరులు ఆయా నగరాలను వీడి వెళ్లకుండా ఉగ్రవాదులు అడ్డుకుంటున్నారు. ఖార్కివ్‌లో 3189 మంది భారతీయులు, 2700 మంది వియత్నాం దేశస్థులు, 202 మంది చైనీయులను నిర్బంధించారు. సుమీలో 507 మంది భారతీయులు, 101 మంది ఘనా పౌరులు, 121 మంది చైనీయులను బలవంతంగా ఆపేశారు’’ వాసిలీ వివరించారు. విదేశీ పౌరులను తరలించడం కోసం ఖార్కివ్‌, సుమీ వెళ్లడానికి రష్యాకు చెందిన 130 బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. వారందరినీ రష్యాలోని బెల్గోరోడ్‌కు తరలిస్తామని, అక్కడి నుంచి విమానాల్లో వారి స్వస్థలాలకు పంపిస్తామని వెల్లడించారు.


ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభం సామాన్యులకు శాపంగా మారకుండా చూడాలని, భారతీయులు సహా ఇతర దేశాలకు చెందిన వారందరికీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి మాత్రం భారతీయులను ఉక్రెయిన్‌లో నిర్బంధించారన్న విషయమై తమకెలాంటి సమాచారం అందలేదని చెప్పారు.

Updated Date - 2022-03-06T13:09:08+05:30 IST