7 రోజులైనా పట్టు చిక్కలేదు!

ABN , First Publish Date - 2022-03-03T06:52:34+05:30 IST

రష్యా ఒకప్పుడు ప్రపంచంలోని రెండు అగ్ర రాజ్యాల్లో ఒకటి. సోవియట్‌ యూనియన్‌ పతనమైనా, అగ్ర రాజ్యం హోదా ఇప్పుడు లేకపోయినా రష్యా ఇప్పటికీ ప్రపంచంలో బలమైన దేశమే. ప్రపంచంలో మూడో అతి పెద్ద సైనిక శక్తిగా అమెరికా, చైనాల తర్వాతి స్థానంలో...

7 రోజులైనా  పట్టు చిక్కలేదు!

  • చిన్న దేశమైనా ఉక్రెయిన్‌ పెద్ద ప్రతిఘటన
  • రష్యన్‌ యుద్ధ విమానాలకు పొంచి ఉన్న ముప్పు
  • ఇప్పటికీ దాడులు చేస్తున్న ఉక్రెయిన్‌ వాయుసేన
  • విమాన విధ్వంసక క్షిపణులతోనూ ప్రమాదం

రష్యా ఒకప్పుడు ప్రపంచంలోని రెండు అగ్ర రాజ్యాల్లో ఒకటి. సోవియట్‌ యూనియన్‌ పతనమైనా, అగ్ర రాజ్యం హోదా ఇప్పుడు లేకపోయినా రష్యా ఇప్పటికీ ప్రపంచంలో బలమైన దేశమే. ప్రపంచంలో మూడో అతి పెద్ద సైనిక శక్తిగా అమెరికా, చైనాల తర్వాతి స్థానంలో ఉంది. అయితే త్రివిధ దళాల్లో ఎందులోనూ తమతో సాటిరాని చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించి ఏడు రోజులు గడిచినా రష్యా ఇప్పటికీ ఆ దేశంపై తగిన స్థాయిలో పట్టు సాధించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? రష్యా ఎక్కడ విఫలమవుతోంది? ఉక్రెయిన్‌ ఎక్కడ సఫలమైంది? కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందా? అతి శక్తిమంతమైన రష్యాను ఉక్రెయిన్‌ ఎంతకాలం నిలువరించగలదు? అనే అంశంపై సమగ్ర సచిత్రాత్మక కథనం... ఆంధ్రజ్యోతి ప్రత్యేకం.


ఉక్రెయిన్‌పై రష్యా 3 వైపుల నుంచి దాడి చేస్తోంది

  1. ఉత్తర దిక్కున రష్యా ప్రధాన భూభాగం నుంచి, దాని మిత్రదేశమైన బెలారస్‌ నుంచి దాడి జరుగుతోంది. 
  2. ఇక ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారుల ప్రాబల్యం ఉన్న లుహాన్‌స్క్‌, దోనెస్క్‌ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా పుతిన్‌ ఇటీవల ప్రకటించారు. 
  3. తూర్పున రష్యాతోపాటు ఆ ప్రాంతాల నుంచి కూడా దాడి జరుగుతోంది.
  4. ఉక్రెయిన్‌లో భాగమైన దక్షిణ ప్రాంతం క్రిమియాను 2014లో రష్యా ఆక్రమించుకుని తమ దేశంలో భాగంగా ప్రకటించుకుంది. ఇప్పుడు దక్షిణం వైపు క్రిమియా నుంచి కూడా ఉక్రెయిన్‌పై రష్యన్‌ సైన్యం దాడి చేస్తోంది.


రష్యా వాయుసేనకు ఏమైంది?

రష్యన్‌ వైమానిక దళం ప్రపంచంలో మూడో అతి పెద్దది. రెండో స్థానంలో ఉన్న చైనా వద్ద ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయో రష్యా వద్ద కూడా దాదాపు అన్ని ఉన్నాయి. 1,375 ఫైటర్‌ విమానాలు, 125 భారీ బాంబర్లతో ఉన్న రష్యన్‌ వైమానిక దళానికి ఏ దేశమేనా భయపడాల్సిందే. అయితే యుద్ధం మొదలై ఏడు రోజులు గడిచినా రష్యా వైమానిక దళం ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగే పరిస్థితి లేదు. 


బాంబర్లకు భయమే!

యుద్ధ విమానాల్లో ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకటి ఫైటర్‌ విమానాలు. ఇవి తమను తాము రక్షించుకుంటూనే శత్రు దేశంపై దాడి చేయగలవు. కానీ ఇవి తక్కువ సంఖ్యలోనే ఆయుధాల్ని తీసుకువెళ్లగలవు. రెండోది బాంబర్‌ విమానాలు. ఇవి భారీ సంఖ్యలో ఆయుధాలు తీసుకువెళ్లి శత్రు దేశంపై బాంబుల పరంపర కురిపించగలవు. కానీ శత్రు దేశపు యుద్ధ విమానాలు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునే శక్తి వీటికి పరిమితంగానే ఉంటుంది. ఒక దేశం తన శత్రు దేశపు యుద్ధ విమానాలు, విమాన విధ్వంసక క్షిపణుల్లో అధిక భాగాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు ఆ దేశానికి ‘గగనతల ఆధిపత్యం’ (ఎయిర్‌ సుపీరియారిటీ) లభిస్తుంది. ఇలా ఎయిర్‌ సుపీరియారిటీ వచ్చినప్పుడు మాత్రమే బాంబర్లు రంగంలోకి దిగుతాయి. కానీ రష్యా ఎంత బలమైన దేశమైనప్పటికీ ఏడు రోజులైనా ఇప్పటివరకూ ఉక్రెయిన్‌పై ఎయిర్‌ సుపీరియారిటీ సాధించలేకపోయింది. దీంతో టీయూ-22, టీయూ-95, టీయూ-160 రష్యన్‌ బాంబర్లు ఇంకా యుద్ధంలోకి దిగే పరిస్థితి లేదని సమాచారం.



ఇప్పటికీ నడుస్తున్న ఉక్రెయిన్‌ విమానాలు

ఉక్రెయిన్‌ వద్ద కేవలం 225 యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో మిగ్‌-29, ఎస్‌యూ-24, 25 విమానాలున్నాయి. ఏడు రోజుల యుద్ధంలో రష్యా వీటిలో 60 నుంచి 75 విమానాల్ని మాత్రమే ధ్వంసం చేయగలిగింది. మరో 150పైగా యుద్ధ విమానాలు ఇప్పటికీ గాలిలోకి ఎగురుతూ రష్యా సైన్యంపై చిన్న చిన్న దాడులు చేస్తున్నాయి. కొన్ని రష్యన్‌ యుద్ధ విమానాల్ని కూల్చివేశాయి. ఈ యుద్ధ విమానాలు ఎగరడానికి ఉపయోగపడే రన్‌వేల మీద, ఎయిర్‌ స్ట్రిప్‌ల మీద రష్యా పెద్దఎత్తున దాడులు చేసింది. కానీ ఉక్రెయిన్‌ తెలివిగా వాటిని దేశ దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో రష్యా ఊహించని చోట్లకు తరలిస్తూ దాచిపెడు తోంది. అతి చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లకు సమీపంలో ఒకటి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వాటిని ఉంచి అవసరమైనప్పుడు రంగంలోకి దించుతోంది. కొన్ని విమానాలైతే గడ్డి మైదానాలను సైతం రన్‌వేలుగా వాడుతున్నట్లు చెబుతున్నారు. రష్యా రాడార్లకు దొరక్కుండా ఇవి తక్కువ ఎత్తులో ఎగురుతూ రష్యన్‌ ఆర్మీపై దాడి చేస్తున్నాయి. అయితే నేలపై నుంచి అవసరమైన సాంకేతిక మద్దతు లేకపోవడంతో ఉక్రెయిన్‌ విమానాల పోరాట సామర్థ్యం తగ్గిపోయింది.  పైగా యూరోపియన్‌ యూని యన్‌ నుంచి ఉక్రెయిన్‌కు అందుతాయనుకున్న యుద్ధ విమానాలు అందే పరిస్థితి ఇప్పుడు లేదు. అయినా ఇప్పటికీ రష్యన్‌ విమానాలు అంత స్వేచ్ఛగా ఎగిరే పరిస్థితి కూడా లేదు. అయితే రష్యా కేవలం 75 యుద్ధ విమానాల్ని మాత్రమే ఉక్రెయిన్‌ దాడిలో వాడుతోందని, మరో 200 విమానాల్ని సరిహద్దులో మోహరించినప్పటికీ యుద్ధంలోకి దించలేదని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి.


విమాన విధ్వంసక క్షిపణుల ముప్పు

ఉక్రెయిన్‌ వద్ద విమాన విధ్వంసక క్షిపణులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఎస్‌-300 విధ్వంసక వ్యవస్థ వీటిలో ప్రధానమైనది. ఇటీవల నాటో దేశాలు పెద్దఎత్తున స్టింగర్‌ క్షిపణుల్ని ఉక్రెయిన్‌కు సరఫరా చేశాయి. ఒక సైనికుడు భుజంపై దీనిని పెట్టుకుని మరో సైనికుడి సాయంతో దీనిని అతి సులభంగా ప్రయోగించవచ్చు. ఈ క్షిపణులు అయిదు కిలోమీటర్ల లోపు ఎత్తులో ఎగిరే విమానాల్ని, హెలికాప్టర్లను ధ్వంసం చేయగలవు. ఉక్రెయిన్‌ విమాన విధ్వంసక క్షిపణులు ఇప్పటికే 30కి పైగా రష్యన్‌ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూల్చేసినట్లు సమాచారం. నేలపై ఉన్న లక్ష్యాలను యుద్ధ విమానాలు కచ్చితంగా గుర్తించి  దాడి చేయాలంటే కొంత తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఉక్రెయిన్‌ క్షిపణుల భయంతో రష్యా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 



ఈ నగరాల కోసమే భీకర పోరు



కీవ్‌

ఉక్రెయిన్‌ రాజధాని నగరం. జనాభా 29 లక్షలు. దీనిని స్వాధీనం చేసుకుంటే ఉక్రెయిన్‌ మొత్తం తమ గుప్పిట్లోకి వస్తుందని రష్యా భావిస్తోంది. 64 కి.మీ. పొడవైన రష్యన్‌ కాన్వాయ్‌ కీవ్‌ను సమీపిస్తోంది. ఈ కాన్వాయ్‌లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాం కులు, శతఘ్నులు, పోరాట వాహనాలు ఉన్నాయి. ఈ కాన్వాయ్‌ బెలారస్‌ నుంచి బయల్దేరిందని భావిస్తున్నారు. కీవ్‌ శివార్లలోని ఆంటోనోవ్‌ ఎయిర్‌పోర్టు వద్దకు ఈ కాన్వాయ్‌ చేరుకుందని సమాచారం.



ఖార్కివ్‌

రష్యాకు అతి సమీపంలో కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరమిది. జనాభా 14 లక్షలు. రష్యా ఈ నగరంపై శతఘ్నులతో విరుచుకుపడుతోంది. ఈ నగరంలోనే మన భారతీయ విద్యార్థి ఒకరు రష్యా దాడిలో చనిపోయారు. ఇక్కడ రష్యన్‌ భాష మాట్లాడేవారు ఎక్కువగా ఉండడంతో రష్యా దీనిని స్వాధీనం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నగరాన్ని తక్షణమే వీడాలని భారతీయులకు మన ప్రభుత్వం సూచించింది.



మారియుపోల్‌

ఉక్రెయిన్‌లోని కీలకమైన రేపు పట్టణం. 4.41 లక్షల జనాభా ఉన్న ఈ నగర సమీపంలో ఉక్రెయిన్‌ తిరుగుబాటుదారుల ప్రాబల్య ప్రాంతాలు ఉన్నాయి. రష్యన్‌ బలగాలు ఈ నగరం గుండా దారి చేసుకుని ఆ తిరుగుబాటుదారులను చేరుకున్నాయి. ఈ నగరంపై రష్యా రెండు వైపుల నుంచి దాడి చేస్తోంది.


బెర్దియాన్‌స్క్‌

1.15 లక్షల జనాభా ఉన్న ఈ నగరం ఉక్రెయిన్‌లో పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది కేవలం రష్యాకు 84 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం చాలావరకు రష్యా అధీనంలోకి వచ్చేసినట్లు సమాచారం. 


ఖేర్సన్‌

ఉక్రెయిన్‌లోని ప్రధాన రేపు పట్టణం. నౌకా నిర్మాణ కేంద్రం. జనాభా మూడు లక్షలు. సోవియట్‌ రష్యా నౌకా దళానికి నల్ల సముద్రంలో బేస్‌గా ఇది ఉండేది. ఈ నగరాన్ని తాము పూర్తిగా అధీనంలోకి తెచ్చుకున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది.


రష్యాకు సమన్వయ సమస్య

త్రివిధ దళాల మధ్య, వివిధ విభాగాల మధ్య సమన్వయం సరిగా లేకపోవడం రష్యాకు సమస్యగా మారింది. నేలపై ఉన్న లక్ష్యాల గురించి కచ్చితమైన సమాచారం అందితేనే వాయుసేన వాటిపై దాడి చేయగలుగుతుంది. కానీ ఆ విషయంలో రష్యన్‌ దళాల శిక్షణ, నైపుణ్యం తగిన స్థాయిలో లేవని అమెరికన్‌ నిపుణులు అంటున్నారు. అమెరికన్‌ పైలట్లకు ఏడాదికి సగటున 180-240 గంటల ఫ్లయింగ్‌ అనుభవం ఉంటే, రష్యన్‌ పైలట్లకు అది వంద గంటలలోపేనని, ఆ లోపం ఉక్రెయిన్లో స్పష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. ఉక్రెయిన్‌ విమానాల్ని ధ్వంసం చేయగలిగే క్షిపణులు రష్యన్‌ ఆర్మీ వద్ద ఉన్నప్పటికీ, అవి కాన్వాయ్‌ల మధ్యలో ఇరుక్కుపోవడంతో వాటిని ఉపయోగించే పరిస్థితి లేదని సమాచారం. ఉక్రెయిన్‌ యుద్ద విమానాలతోపాటు టీబీ-2 డ్రోన్లు కూడా రష్యన్‌ ఆర్మీ మీద చిన్న చిన్న దాడులు చేస్తున్నాయి.




పూర్తిస్థాయిలో ఎందుకు దిగలేదు?

రష్యా వైమానిక దళంతోపాటు నౌకాదళం కూడా పూర్తిస్థాయిలో యుద్ధానికి ఇంకా దిగలేదు. రష్యన్‌ యుద్ధ నౌక ఒకటి ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్‌ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడంలో కొంత చురుగ్గా వ్యవహరించింది. యుద్ధ ట్యాంకులు, పోరాట వాహనాలతో కూడిన మరికొన్ని యుద్ధ నౌకలు మంగళవారం నల్ల సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. రష్యా వద్ద ఉన్న ఏకైక విమానవాహక యుద్ధ నౌక కుజ్నెత్సోవ్‌ గత ఏడాది అగ్ని ప్రమాదంలో దెబ్బతింది. దానికి మరమ్మతులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే రష్యన్‌ నౌకాదళాన్ని, వైమానిక దళాన్ని పూర్తిస్థాయిలో రంగంలోకి దించకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంటున్నారు. విమానాలు, నౌకల నిర్మాణ కేంద్రాలు, బోలెడు సహజవనరులు కలిగిన ఉక్రెయిన్‌లో భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించడం రష్యా లక్ష్యం కాదని, తక్కువ నష్టంతో రాజధాని కీవ్‌ను ఆక్రమించుకుని రాజకీయంగా ఉక్రెయిన్‌పై పట్టు సాధించడమే రష్యా ధ్యేయమని, అందుకే కీవ్‌ నగరంలోకి భారీ కాన్వాయ్‌ని పంపుతోందని వారు చెబుతున్నారు. రష్యా ఊహించిన దానికంటే ఉక్రెయిన్‌ ప్రతిఘటన ఎక్కువగా ఉందన్నది నిజం. కానీ ఆ ప్రతిఘటన ఎక్కువ కాలం కొనసాగడం కష్టమనేది కూడా నిజం. ఈలోగా జరిగే అంతర్జాతీయ పరిణామాలు, ఒత్తిడులు, వాటిపై ఆయా దేశాలు స్పందించే తీరును బట్టి భవిష్యత్‌ వ్యూహాలు, ఫలితాలు ఆధారపడి ఉంటాయి.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి


Updated Date - 2022-03-03T06:52:34+05:30 IST