Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 01 Apr 2022 00:43:12 IST

వెనక్కి తగ్గినట్లే తగ్గి.. విధ్వంసాన్ని పెంచిన రష్యా

twitter-iconwatsapp-iconfb-icon
వెనక్కి తగ్గినట్లే తగ్గి.. విధ్వంసాన్ని పెంచిన రష్యా

కీవ్‌ శివార్లలో భీకర యుద్ధం

డ్నిప్రోపెట్రోన్స్క్‌పై ముప్పేట దాడి

ధ్వంసమైన మిలటరీ చమురు డిపో


కీవ్‌/న్యూఢిల్లీ, మార్చి 31: రష్యా వెనక్కి తగ్గినట్లే తగ్గి.. ఉక్రెయిన్‌పై దాడులను ముమ్మరం చేసింది. మూడు రోజుల క్రితం టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల సందర్భంగా.. ఉక్రెయిన్‌ కీవ్‌, చెర్నిహీవ్‌లలోని తమ సేనలను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించిన రష్యా.. ఆ ప్రాంతాల్లో విధ్వంంం సృష్టిస్తోంది. మిలటరీ చమురు డిపోలు, పరిపాలన భవనాలను టార్గెట్‌గా చేసుకుంటూ క్షిపణి దాడులు చేస్తున్న రష్యా.. బుధవారం అర్ధరాత్రి డ్నిప్రోపెట్రోన్స్క్‌ నగరంపై ముప్పేట దాడి చేసింది. సముద్ర తీర నగరం మైకొలైవ్‌పై బాంబులు కురిపించింది. మంగళ, బుధవారాల్లో కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించిన రష్యా బలగాలు.. బుధవారం అర్ధరాత్రి నుంచి దాడులను తీవ్రతరం చేశాయి. 


డ్నిప్రోపెట్రోన్స్క్‌ నగరంపై గురువారం తెల్లవారుజాము నుంచే రష్యా రాకెట్‌/క్షిపణి దాడులు ప్రారంభమయ్యాయి. ఇక్కడి మిలటరీ అడ్మినిస్ట్రేషన్‌ భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఆర్మీ చమురు డిపో బుగ్గిపాలైందని, ఇద్దరు మృతిచెందారని రక్షణ శాఖ ప్రకటించింది. నల్ల సముద్రంలో మోహరించిన రష్యా నౌకాదళం గురువారం తీరప్రాంతమైన మైకొలైవ్‌పై వరుస దాడులు చేసింది. ఇక్కడ 9 అంతస్తుల ప్రభుత్వ పరిపాలన భవనం ధ్వంసమవ్వగా.. ఆ భవనంలో ఉన్న 20 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. డోనెట్స్క్‌ రీజియన్‌పై ఫాస్ఫరస్‌ బాంబులు వేసినట్లు, ప్రాణనష్టం వివరాలింకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. లుహాన్స్క్‌ రీజియన్‌లో జరిగిన బాంబింగ్‌లో ఇద్దరు చనిపోయారని, మారియుపోల్‌లో రెడ్‌క్రాస్‌ గోదాము ధ్వంసమైందని వివరించారు. 


మారియుపోల్‌ శివార్లలో 64 మంది రష్యా సైనికులు హతమైనట్లు తెలిపారు. కీవ్‌ శివార్లలో ఉన్న రష్యా సేనలు వెనక్కి వెళ్లినట్లే వెళ్లి.. తిరిగి దాడులు ప్రారంభించాయి. రష్యా సేనలు వెల్లడంతో ఒక్కో గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్న ఉక్రెయిన్‌ దళాలపై మెరుపుదాడులు చేశాయి. కీవ్‌ శివార్లలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర పోరు జరిగింది. చెర్నోబిల్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌ నుంచి రష్యా సేనలు పూర్తిస్థాయిలో తప్పుకొన్నాయని అధికారులు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ఉక్రెయిన్‌-రష్యా విదేశాంగ మంత్రుల భేటీ త్వరలో ఇస్తాంబుల్‌లో జరగనుందని టర్కీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. కీవ్‌ నుంచి వెనక్కి మళ్లిన రష్యా భారీ సేనలు చెర్నిహీవ్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని.. అయితే పూర్తిస్థాయిలో రష్యా సేనలు వెనుదిరగలేదని బ్రిటన్‌ వర్గాలు తెలిపాయి. కాగా.. ఐరోపా సమాఖ్య గగనతలంలో ఇటీవల రష్యా యుద్ధ విమానాలు అణ్వాయుధాలను మోసుకెళ్లాయని స్వీడన్‌ అధికారిక వర్గాలు వెల్లడించినట్లు ఐరోపా పత్రికలు కథనాలను ప్రచురించాయి. స్వీడన్‌ రాడార్లు రష్యా జెట్లను గుర్తించినట్లు పేర్కొన్నాయి.


భారత్‌లో అగ్రదేశాల ప్రతినిధులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అగ్రదేశాల ప్రతినిధులు భారత్‌ మద్దతు కోసం న్యూఢిల్లీ బాట పట్టారు. అమెరికా జాతీయ భద్రత ఉప సలహాదారు(డిప్యూటీ ఎన్‌ఎ్‌సవో) దలీప్‌ సింగ్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌, బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ భారత్‌ చేరుకున్నారు. వీరంతా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఇతర అధికారవర్గాలతో భేటీ అయ్యారు. ఈ వారంలో బ్యాంక్‌ ఆఫ్‌ రష్యా ప్రతినిధులు ఆర్బీఐ అధికారులతో భేటీ కానున్నారు. ఐరోపా సమాఖ్య(ఈయూ) ప్రతినిధులు కూడా భారత్‌కు రానున్నారు.


రూబుల్స్‌లో చెల్లింపులు.. లేదంటే చమురు కాంట్రాక్టులు రద్దు: పుతిన్‌

తాము సరఫరా చేసే చమురు, గ్యాస్‌కు రూబుల్స్‌లో చెల్లింపులు చేయాలని, లేదంటే కాంట్రాక్టులు రద్దు చేసుకుంటామని రష్యా అధినేత పుతిన్‌ హెచ్చరించారు. ఇటీవల ఐరోపా సమాఖ్య దేశాలు రూబుల్స్‌లో చెల్లింపులు కుదరదని తెగేసి చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రపంచ చమురు సరఫరాలో రష్యా వాటా 20ు కావడంతో.. ఈ ప్రభావం ఐరోపా దేశాలపై తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.