ఖార్కీవ్‌ నుంచి రష్యా నిష్క్రమణ

ABN , First Publish Date - 2022-05-15T07:36:19+05:30 IST

ఖార్కీవ్‌.. ఉక్రెయిన్‌ రెండో అతిపెద్ద నగరం. ఆ దేశ ఈశాన్య ప్రాంతంలో రక్షణపరంగా కీలకమైనది.

ఖార్కీవ్‌ నుంచి రష్యా నిష్క్రమణ

ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం

కీవ్‌, మే 14: ఖార్కీవ్‌.. ఉక్రెయిన్‌ రెండో అతిపెద్ద నగరం. ఆ దేశ ఈశాన్య ప్రాంతంలో రక్షణపరంగా కీలకమైనది. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో రష్యా ఈ నగరంపై బాంబుల వర్షం కురిపించింది. తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే, ఇప్పుడు దాడులను ఒక్కసారిగా నిలిపివేసింది. అనూహ్యంగా అక్కడినుంచి రష్యా దళాలు నిష్క్రమిస్తున్నాయి. చాలా రోజులుగా పోరాడుతున్నప్పటికీ, పట్టుచిక్కని ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతం డాన్‌బా్‌స (లుహాన్స్క్‌-డొనెట్స్క్‌)పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టేందుకే ఈ చర్యకు దిగినట్లు భావిస్తున్నారు. దీనికితగ్గట్లే ఆయుధ సరఫరా మార్గాలపై దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. డొనెట్స్క్‌లో ఉక్రెయిన్‌ సేనలను.. మోర్టార్లు, ఫిరంగులు, వైమానిక దాడులకు దిగుతూ చెల్లాచెదురు చేస్తుండడం అంచనాలను మరింత బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం కొత్త దశలోకి వెళ్తోందని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజిన్‌కోవ్‌ వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం కొనసాగనుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, రష్యాను తరిమికొట్టి ఉక్రెయిన్‌ బలగాలు ఖార్కీవ్‌లో విజయం సాధించాయని వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ వార్‌ పేర్కొంది. మరోవైపు లుహాన్స్క్‌ ప్రావిన్స్‌లోని రుబిజ్నె నగరాన్ని రష్యా దాదాపు స్వాధీనం చేసుకుందని ఆ ప్రాంత మిలటరీ చీఫ్‌ ప్రకటించారు. ఇక రష్యన్‌ బలగాలు సివర్స్కీ డొనెట్స్‌ నది దాటకుండా ఉక్రెయిన్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మారియుపోల్‌లోని భారీ ఉక్కు ప్లాంట్‌ అజోవ్‌స్టాల్‌పై రష్యా వరుస దాడులు కొనసాగుతున్నాయి. కాగా, తా ము నాటో కూటమిలో చేరబోతున్నట్లు ఫిన్లాండ్‌ అధ్యక్షుడు సయూలీ నినిస్టో శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్‌ చేసి తెలిపారు.  దీనిపై పుతిన్‌ నుంచి ఎటువంటి స్పందన వ్యక్తం కాలేదు. మరోవైపు, ఉక్రెయిన్‌లో భారీగా ఆహార ధాన్యాన్ని రష్యా గుప్పిట పట్టడంపై జీ-7 కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. జర్మనీలో శనివారం జీ-7 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆంక్షలను పక్కనపెడుతూ.. రష్యాకు సాయపడొద్దని చైనాకు సూచించింది. 

Updated Date - 2022-05-15T07:36:19+05:30 IST