అమెరికన్ సెనేటర్‌ వ్యాఖ్యలపై రష్యా ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-06T18:57:29+05:30 IST

రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న వ్యాఖ్యలు

అమెరికన్ సెనేటర్‌ వ్యాఖ్యలపై రష్యా ఆగ్రహం

వాషింగ్టన్ : రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న వ్యాఖ్యలు అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయని అమెరికాకు రష్యా రాయబారి అనతొలి ఆంటోనోవ్ అన్నారు. ఈ అంశంపై అమెరికన్ రాజకీయ నేతలతో చర్చించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. ఉక్రెయిన్‌కు అమెరికన్ దళాలను పంపించాలని అమెరికాలోని రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. 


రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు అమెరికన్ దళాలను పంపించడాన్ని తోసిపుచ్చకూడదన్నారు. ఈ ఇంటర్వ్యూ వివరాలను అమెరికన్ మీడియాలో గమనించిన అనతొలి ఆంటోనోవ్ ఘాటుగా స్పందించారు. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న వ్యాఖ్యలు అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నాయన్నారు. ఈ అంశంపై అమెరికాలోని ఏ రాజకీయ నేతతోనైనా చర్చించేందుకు తాను సిద్ధమేనని చెప్పారు. అమెరికాలో రష్యా వ్యతిరేక ధోరణి అనుచిత స్థితికి చేరిందన్నారు. స్థానిక రాజకీయ నేతలకు తాము మాట్లాడుతున్నదానిపై పరిపూర్ణ అవగాహన ఉండదనే భావన ఉందని చెప్పారు. అమెరికాలో వినిపిస్తున్న నినాదాలు అత్యంత బాధ్యతారహితమైనవని, రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే విధంగా ఉన్నాయని చెప్పారు. 


రిక్ స్కాట్‌‌ను ఓ ప్రముఖ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఉక్రెయిన్‌కు అమెరికన్ దళాలను పంపించడంపై అభిప్రాయాన్ని కోరింది. దీనికి రిక్ బదులిస్తూ, అన్ని అవకాశాలను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఈ (ఉక్రెయిన్‌కు అమెరికన్ దళాలను పంపించే) అంశాన్ని పక్కనపడేసినట్లు భావించకూడదన్నారు. అమెరికన్ స్త్రీ, పురుషులను యుద్ధంలో ప్రవేశపెట్టవలసిన అవసరం మళ్లీ రాదనే ఆశించవచ్చునని చెప్పారు. అయితే ఉక్రెయినియన్లు ఈ పనిని తమంతట తామే చేసే విధంగా వనరులను సమకూర్చడం ఇక్కడ లక్ష్యమని తెలిపారు. 


ఇదిలావుండగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల మాట్లాడుతూ, NATO సభ్య దేశాలపై రష్యా దాడి చేసినపుడు మాత్రమే అమెరికా జోక్యం చేసుకుంటుందని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను ఇప్పుడు నిలువరించకపోతే, ఆయన మరింత బలపడతారన్నారు. ఆంక్షలతో కట్టడి చేయకపోతే పుతిన్ మరింత ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారన్నారు. 


రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల ఓ టెలివిజన్ చానల్ ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ను హత్య చేయాలని రష్యన్లకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-03-06T18:57:29+05:30 IST