మారియుపోల్‌ రష్యా వశం!

ABN , First Publish Date - 2022-05-22T07:34:43+05:30 IST

ఉక్రెయిన్‌ తీర నగరం మారియుపోల్‌ తమ వశమైనట్లు రష్యా ప్రకటించింది.

మారియుపోల్‌ రష్యా వశం!

పుతిన్‌కు నివేదించిన విదేశాంగ మంత్రి షోయిగు

క్రిమియా మీదుగా డాన్‌బా్‌సలో ఇక పోరు ఉధృతం

మారియుపోల్‌, మే 21: ఉక్రెయిన్‌ తీర నగరం మారియుపోల్‌ తమ వశమైనట్లు రష్యా ప్రకటించింది. ఇక్కడి ‘అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు విముక్తి’ లభించినట్లు అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ షోయిగు నివేదించారు. దీంతో నగరం మొత్తం రష్యా చేతుల్లోకి వచ్చినట్లయింది. మారియుపోల్‌ ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉంది. అయితే, అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌లోని అజోవ్‌ రెజిమెంట్‌కు చెందిన ఫైటర్లు ఇంతకాలం తీవ్రంగా పోరాడుతూ వచ్చారు. ఇటీవల ప్లాంట్‌పై రష్యా దాడులతో విరుచుకుపడటంతో ఫైటర్ల క్షేమం కోరుతూ.. ఉక్రెయిన్‌ ప్రభుత్వం లొంగిపోవాలని కోరింది. ఫ్రాన్స్‌, టర్కీ, ఇజ్రాయిల్‌, స్విట్జర్లాండ్‌ దౌత్యంతో.. గత సోమవారం నుంచి రెడ్‌క్రాస్‌ పర్యవేక్షణలో లొంగుబాటు ప్రక్రియ మొదలైంది. శుక్రవారం 500 మంది సహా.. ప్లాంట్‌లోని మొత్తం 2,439 మంది ఫైటర్లు లొంగిపోయారంటూ రష్యా మీడియా ఆర్‌ఐఏ నొవొస్తీ శనివారం పేర్కొంది. ఇక అజోవ్‌ రెజిమెంట్‌ కమాండర్‌ను రష్యా సాయుధ వాహనంలో తరలించింది. వీరిలో కొందరిపైనైనా యుద్ధ నేరాల అభియోగాలు మోపి విచారణ జరుపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


పుతిన్‌కు చెప్పుకొనేందుకు ఓ విజయం

సైనిక చర్య పేరిట ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఈ మూడు నెలల్లో ఏమీ సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. మారియుపోల్‌ను వశం చేసుకోవడం ద్వారా తాము ఓ పెద్ద విజయం సాధించినట్లు ఆయన పేర్కొనే అవకాశం ఉంది. మరోవైపు డాన్‌బా్‌సలో రష్యా యుద్ధాన్ని తీవ్రం చేస్తోంది. ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సీవరీడోనెట్స్స్‌పై కన్నేసింది. ఉక్రెయిన్‌ మిగతా భూభాగంతో సంబంధాలను తెంచడం లక్ష్యంగా ఈ నగరంతో పాటు పొరుగునుండే లిసిచాన్స్క్‌పై వరుస దాడులు చేస్తోంది. కాగా, ప్రతిష్ఠాత్మక కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో శుక్రవారం ఓ మహిళ అకస్మాత్తుగా రెడ్‌ కార్పెట్‌ పైకి వచ్చి.. దుస్తులు చింపుకొని.. నిరసన వ్యక్తంచేసింది. ఈమె ఛాతీపై ఉక్రెయిన్‌ జాతీయ జెండా రంగు పెయింటింగ్‌, ‘‘మాపై అత్యాచారాలు ఆపండి’’ అని రాసి ఉంది. మరోవైపు నాటోలో చేరుతున్న ఫిన్లాండ్‌పై కక్ష సాధించేందుకు గాను రష్యా గ్యాస్‌ సంస్థ గజ్‌ప్రామ్‌.. ఫిన్లాండ్‌కు సరఫరాను నిలిపివేసింది. ఇక.. ఉక్రెయిన్‌కు 40 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్యాకేజీ చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం సంతకం చేశారు.

Updated Date - 2022-05-22T07:34:43+05:30 IST