సొంత స్పేస్ స్టేషన్ దిశగా రష్యా అడుగులు

ABN , First Publish Date - 2021-04-21T01:41:46+05:30 IST

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రోగ్రాం నుంచి బయటకు రావాలని యోచిస్తున్న రష్యా.. 2025

సొంత స్పేస్ స్టేషన్ దిశగా రష్యా అడుగులు

మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రోగ్రాం నుంచి బయటకు రావాలని యోచిస్తున్న రష్యా.. 2025 నాటికి సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ దిశగా పనులు కూడా ప్రారంభమైనట్టు రోస్‌కాస్మోస్ చీఫ్ డిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు. కొత్త అంతరిక్షం తొలి మాడ్యూల్‌కు సంబంధించిన పనులు మొదలైనట్టు చెప్పారు. 2025 నాటికి ఈ మాడ్యూల్‌ను లాంచ్ చేయాలని ఎనర్జియా స్పేస్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 


1998లో లాంచ్ చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రష్యా, అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వాములుగా ఉన్నాయి. మానవ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సహకారాల్లో ఇదొకటి. రష్యా డిప్యూటీ ప్రధాని యురీ బోరిసోవ్ ఇటీవల మాట్లాడుతూ 2025 నుంచి ఐఎస్ఎస్ కార్యక్రమాన్ని వదిలి పెట్టాలా? వద్దా? అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఐఎస్ఎస్‌ కార్యక్రమం నుంచి బయటకు రావాలన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రోస్కోమోస్ పేర్కొంది. ఒకవేళ ఐఎస్ఎస్ ప్రోగ్రాంను విడిచిపెట్టాలని నిర్ణయిస్తే కనుక భాగస్వాములతో చర్చిస్తామని స్పేస్ ఏజెన్సీ పేర్కొంది.

Updated Date - 2021-04-21T01:41:46+05:30 IST