రష్యా నుంచి రెండో కరోనా టీకా.. సామర్థ్యం ఏకంగా 100%!

ABN , First Publish Date - 2021-01-20T02:20:40+05:30 IST

రష్యాలో తయారైన రెండో కరోనా టీకా సామర్థ్యం ఏకంగా 100 శాతమని అక్కడి ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది. ఎపివ్యాక్‌కరోనా పేరిట తయారైన ఈ టీకాను సైబేరియాకు చెందిన వెక్టర్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది.

రష్యా నుంచి రెండో కరోనా టీకా.. సామర్థ్యం ఏకంగా 100%!

మాస్కో: రష్యాలో తయారైన రెండో కరోనా టీకా సామర్థ్యం ఏకంగా 100 శాతమని అక్కడి ప్రభుత్వం మంగళవారం నాడు ప్రకటించింది. ఎపివ్యాక్‌కరోనా పేరిట తయారైన ఈ టీకాను సైబేరియాకు చెందిన వెక్టర్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది. ఫిబ్రవరి నుంచీ ఈ టీకాను విస్తృతస్థాయిలో రూపొందిస్తామని రష్యా డిప్యూటీ ప్రధాని తాతియానా గొలికోవా పేర్కొన్నారు. ఎపీవ్యాక్‌కరోనాకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ గతేడాది జులై నెలాఖరులో ప్రారంభమయ్యాయి. ఆ తరువాత..నవంబర్ 18న ప్రభుత్వం ఎపీవ్యాక్‌కరోనా పేరును అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ టీకాను కూడా విస్తృత వినియోగానికి అనుమతించింది. 


ఇప్పటికే రష్యా స్ఫూత్నిక్-వీ పేరిట ఓ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీన్ని రష్యా సంస్థ గమెలేయా ఇన్‌స్టిట్యూట్ రూపొందించింది. దీని ప్రభావశీలత 92 శాతమని ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌తో పాటూ బెలారూస్, యూఏఈ, ఈజిప్ట్, వెనుజులా దేశాల్లో స్ఫూత్నిక్-వీ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆల్జీరియా, అర్జెంటీనా, బెలారూస్, బొలీవియా, సెర్బియాల్లోని ప్రజలకు ఈ టీకా ఇవ్వడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తన రెండో టీకా సామార్థ్యం ఏకంగా 100 శాతమని రష్యా ప్రకటించడం సంచలనానికి దారితీస్తోంది. తమ టీకా సామర్థ్యం ఏకంగా 100 శాతమని రష్యా మినహా మరే దేశమూ ప్రకటించకపోవడం గమనార్హం.

Updated Date - 2021-01-20T02:20:40+05:30 IST