నీరసిస్తున్న రష్యా సేనలు?

ABN , First Publish Date - 2022-03-15T07:50:11+05:30 IST

ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభించిన 19 రోజులకే రష్యా సేనలు నీరసించి పోయాయా? అతిపెద్ద సైనిక దేశాల్లో ..

నీరసిస్తున్న రష్యా సేనలు?

 చైనాను ఆయుధాలు కోరిన రష్యా!!

 ఉక్రెయిన్‌లో పెరుగుతున్న మృతులు

కీవ్‌, మార్చి 14: ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభించిన 19 రోజులకే రష్యా సేనలు నీరసించి పోయాయా? అతిపెద్ద సైనిక దేశాల్లో ఒక్కటైన రష్యా ఆయుధ సంపత్తి క్రమంగా తరిగిపోతోందా? రష్యా ఇప్పుడు ఆయుధాల కోసం చైనాపై ఆధారపడిందా? ఈ ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ, పత్రికలు అవుననే సమాధానమిస్తున్నాయి. దురాక్రమణను ప్రారంభించి 19 రోజులైనా.. రష్యా సేనలు ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టించడం మినహా.. ఇప్పటి వరకు సాధించిందేమీ లేదు. ఇంకా చెప్పాలంటే.. క్షేత్రస్థాయిలో పదాతి బలగాలు అన్నపానీయాల్లేక నీరసించిపోయే పరిస్థితి. రష్యా సైన్యంలో పోరాట ప్రతిమ లేదని, వైఫల్యాలు ఎక్కువని పేర్కొంటూ.. అమెరికా మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. అన్నింటికీ మించి.. రష్యా సైన్యం సమాచార మార్పిడి కోసం ఉపయోగించే పరికరాలు హైఫ్రీక్వెన్సీలో ఉంటున్నాయని, సాధారణ రేడియో ద్వారా కూడా ఆ సంభాషణలను వినవచ్చని అంటున్నారు. ఇలాంటి పొరపాట్లే రష్యా సేనల కదలికలను ఉక్రెయిన్‌కు, అమెరికా నిఘా సంస్థలకు చేరవేస్తున్నాయని చెబుతున్నారు. ఆంక్షలతో రష్యా ఆర్థిక మాంద్యం లోకి వెళ్తోందని అంతర్జాతీయ మోనిటరీ ఫండ్‌(ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టినా జార్జివా అన్నారు.


చైనా సాయం కోరిన రష్యా?

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో మిలటరీ పరికరాలు, ఆయుధాల కోసం చైనాకు రష్యా విజ్ఞప్తులు చేసినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలు కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో చైనాకు వైట్‌హౌస్‌ జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సులివాన్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్‌తో కలిసి తాము జీవాయుధ ల్యాబ్‌లను నిర్వహిస్తున్నామంటూ రష్యా చేసిన తప్పుడు ఆరోపణలకు చైనా ప్రచారం చేయడంపైనా ఆయన మండిపడ్డారు. అయితే.. రష్యా తమను ఆయుధాలు కోరిన విషయం సరికాదని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఝౌ లిజియన్‌ అన్నారు. అటు రష్యా కూడా తాము ఆయుధాలు అడగలేదంటూ స్పష్టతనిచ్చింది.


కొనసాగుతున్న దాడులు.. 

ఉక్రెయిన్‌లోని నగరాలు, గ్రామాలపై రష్యా వైమానిక దాడులు సోమవారం కూడా కొనసాగాయి. ఒబలాన్స్కీలో ఓ తొమ్మిది అంతస్తుల భవనంపై జరిపిన బాంబు దాడుల్లో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఇదే నగరంలోని కార్గో విమానాల తయారీ పరిశ్రమ ఆంటోనోవ్‌ ప్లాంట్‌పై జరిగిన బాంబింగ్‌లో ముగ్గురు గాయపడగా.. సహాయక బృందాలు 99 మందిని కాపాడాయి. రివ్నే నగరంలో బాంబుదాడిలో తొమ్మిది మంది, కురెనివ్కా ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఒకరు మరణించారు. సూమె రీజియన్‌లోని ఒఖిర్కాలో ముగ్గురు పౌరులు చనిపోయారు. చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రం విద్యుత్తు సరఫరా వ్యవస్థను రష్యన్‌ వైమానిక దళం మరోమారు ధ్వంసం చేసింది. కాగా.. రష్యన్‌ సైనికులు సోమవారం ఆర్థడాక్స్‌ చర్చ్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌(సీవోయూ) ఒలెహ్‌ నికొలైవ్‌ను అపహరించారు.

ఆస్పత్రిపై దాడి, గర్భిణి మృతి

రష్యా వైమానిక దళాలు మారియిపోల్‌ నగరంలోని ఆస్పత్రులను టార్గెట్‌గా చేసుకుని గత బుధవారం దాడులు జరిపాయి. ప్రసూతి ఆస్పత్రిలో ఆ రోజు ఓ గర్భిణి నడుము, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మరో ఆస్పత్రికి తరలించేలోపే, తల్లి, బిడ్డ ఇద్దరూ కన్నుమూశారని సర్జన్‌ టిముర్‌ మారిన్‌ వెల్లడించారు. కాగా.. రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్‌ తగలబడిపోతోందని.. మధ్యవర్తిత్వానికి ఇప్పటికీ అవకాశం ఉందని ఐక్య రాజ్య సమితి(ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ అన్నారు. భారత్‌ను సంప్రదిస్తున్నామని చెప్పారు.


ఇజ్రాయిల్‌కు ఇరకాటం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యూదు దేశమైన ఇజ్రాయిల్‌కు సంకట స్థితిని తీసుకొచ్చింది. ‘ఒలిగార్క్‌’లుగా వ్యవహరించే రష్యన్‌ అత్యంత సంపన్న వ్యాపార వరాల్లో డజన్ల కొద్దీ యూదులున్నారు. వీరంతా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అనుకూలురు కూడా. ఇలాంటివారిలో ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ చెల్సియా యజమాని రోమాన్‌ అబ్రమోవిచ్‌ తదితరులున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంతో పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు వీరిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఏటూ పాలుపోని స్థితిలో ఇజ్రాయిల్‌ ఉంది. మరోవైపు మిగతా పాశ్చాత్య దేశాలలాగా ఇజ్రాయిల్‌.. రష్యాపై ఆంక్షలను ప్రకటించలేదు. 

Updated Date - 2022-03-15T07:50:11+05:30 IST