రష్యా బంగారంపై ఆంక్షలు’

ABN , First Publish Date - 2022-06-27T08:38:53+05:30 IST

రష్యాకు ముకుతాడు వేసేందుకు జీ-7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

రష్యా బంగారంపై ఆంక్షలు’

జీ-7 దేశాల సదస్సులో నిర్ణయం!

చూచాయగా వెల్లడించిన బైడెన్‌

ఈ నిర్ణయం అమలైతే.. రష్యాకు దెబ్బే

ఈ నిర్ణయంపై పుతిన్‌ గుస్సా..!!

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రం 

తూర్పుతోపాటు కీవ్‌, చెర్నిహీవ్‌, రివ్నే, చెర్కాసీ ప్రాంతాలపై క్షిపణులు


బెర్లిన్‌/మాస్కో/కీవ్‌, జూన్‌ 26: రష్యాకు ముకుతాడు వేసేందుకు జీ-7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చమురు.. రష్యా చేసే అతిపెద్ద ఎగుమతి అయిన బంగారంపై ఆంక్షలకు సిద్ధమయ్యాయి. రష్యా బంగారాన్ని కొనేది లేదంటూ జీ-7 దేశాల్లో కీలకమైన అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌ ప్రకటించాయి. ఆదివారం జర్మనీలో ప్రారంభమైన జీ-7 వార్షిక సదస్సులో తొలుత అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సభ్య దేశాలతోపాటు.. ఇతర దేశాలను కూడా ఈ విషయంలో ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కూడా రష్యా నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోబోమని వెల్లడించారు. జపాన్‌, కెనడాలు కూడా అదే బాటలో ప్రకటనలు చేయనున్నాయి. కాగా.. రష్యా బంగారం ఎగుమతులు 2020 సంవత్సరంలో రూ.1.48లక్షల కోట్లు.. అందులో 90ు ఎగుమతులు జీ-7 దేశాలకు జరుగుతున్నాయి. ఇందులో ఒక్క బ్రిటన్‌ వాటానే రూ.1.32 లక్షల కోట్లు. కాగా.. జీ-7 సదస్సు తమనే టార్గెట్‌గా చేసుకుంటుందని ముందే పసిగట్టిన రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌.. అణ్వాయుధాలపై కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌ పొరుగుదేశమైన బెలార్‌సకు స్వల్పశ్రేణి అణు సామర్థ్య క్షిపణులను అందజేస్తామని ప్రకటించారు. శనివారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో రష్యా అధినేత పుతిన్‌తో భేటీ అయ్యారు. బెలార్‌సకు స్వల్పశ్రేణి అణుసామర్థ్యం ఉండే ఇస్కందర్‌-ఎం వ్యవస్థతోపాటు.. బాలిస్టిక్‌, క్రూయిజ్‌ క్షిపణులను అందజేస్తామని పుతిన్‌ ప్రకటించారు. కాగా.. ఇప్పటికే బాల్టిక్‌ ప్రాంతంలోని కలినిన్‌గ్రాడ్‌లో రష్యా కొన్ని ఇస్కందర్‌ క్షిపణులను మోహరించిన విషయం తెలిసిందే. కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను ఉధృతం చేసింది. కీవ్‌, సార్ని, ఖార్కివ్‌ నగరాలపైౖ భీకర దాడులు జరిగాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.  ఇప్పుడు రష్యా దళాలు స్లోవియాన్స్క్‌ నగరంవైపు దూసుకెళ్తున్నాయన్నాయి. 


కిచెన్‌లో క్షిపణి.. వీడియో వైరల్‌

ఉక్రెయిన్‌కు చెందిన ఓ పౌరుడు క్షవరం చేసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది. అందుక్కారణం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ ఇంటి వంట గది ఉంది. రష్యా ప్రయోగించిన ఓ క్షిపణి ఆ ఇంటి కిచెన్‌ ప్లాట్‌ఫాం పక్కన గోడలోంచి దూసుకువచ్చి ఆగిపోయింది. ఈ వీడియోను ఉక్రెయిన్‌  సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఆ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. 

Updated Date - 2022-06-27T08:38:53+05:30 IST