యాంటీ శాటిలైట్ క్షిపణితో సొంత శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. విరుచుకుపడిన అమెరికా

ABN , First Publish Date - 2021-11-16T23:23:34+05:30 IST

రష్యా ఇటీవల చేపట్టిన యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్టు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు

యాంటీ శాటిలైట్ క్షిపణితో సొంత శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. విరుచుకుపడిన అమెరికా

మాస్కో: రష్యా ఇటీవల చేపట్టిన యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్టు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. మరీ ముఖ్యంగా అమెరికా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. యాంటీ శాటిలైట్ మిసైల్‌ను అభివృద్ధి చేసిన రష్యా దానితో అంతరిక్షంలో తిరుగుతున్న తమ సొంత శాటిలైట్‌ను ఏమాత్రం గురితప్పకుండా పేల్చి పడేసింది. రష్యా తీరుపై అమెరికా సహా పలు దేశాలు మండిపడ్డాయి. రష్యా చర్య పూర్తిగా బాధ్యతారాహిత్యమైనదని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.


శాటిలైట్‌ను పేల్చివేయడంతో 1500 వరకు శకలాలతో స్పేస్ జంక్ ఏర్పడిందని అమెరికా మండిపడింది. అంతేకాక వేల సంఖ్యలో చిన్నచిన్న శకలాలు తిరుగుతున్నాయని, వీటి వల్ల అన్ని దేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందులో నలుగురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఒక జర్మన్ ఉన్నారని, ఇలాంటి చర్యల వల్ల వారికి తీవ్ర ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. 


యాంటీ శాటిలైట్ వెపన్ అంటే..

యాంటీ శాటిలైట్ వెపన్ (ఎ-శాట్) అనేది ఉపగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేయగలదు. అప్పటి సోవియట్ యూనియన్‌కు కౌంటర్‌గా 1959లో అమెరికా దీనిని తొలిసారి అభివృద్ధి చేసింది. ఇందులో కైనెటిక్, నాన్ కైనెటిక్ అనే రెండు రకాలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువును నాశనం చేయాలంటే కైనెటెక్ ఎ-శాట్‌తో భౌతికంగా దాడిచేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాలిస్టిక్ క్షిపణి.


నాన్-కైనెటిక్ ఎ-శాట్‌ భౌతికంగా దాడిచేయకుండానే అంతరిక్ష వస్తువులను పనిచేయకుండా ఆపివేయగలదు. లేదంటే నాశనం చేయగలదు. ఇంకా చెప్పాలంటే.. ప్రీక్వెన్సీ జామర్, బ్లైండింగ్ లేజర్, సైబర్ దాడులు వంటివి నాన్-కైనెటిక్ కిందికి వస్తాయి. 


అమెరికా 1959లోనే యాంటీ శాటిలైట్ వెపన్‌ను సమకూర్చుకోగా, రష్యా 1960లో, చైనా 2007లో ఈ పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నాయి. ఇండియా 2019లో మిషన్ శక్తి పేరుతో యాంటీ శాటిలైట్ మిసైల్‌‌ను విజయవంతంగా పరీక్షించింది. 

Updated Date - 2021-11-16T23:23:34+05:30 IST