ర‌ష్యా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారంటే...

ABN , First Publish Date - 2020-08-12T16:08:18+05:30 IST

కరోనాను ఎదుర్కొనేందుకు మొదటి వ్యాక్సిన్‌ సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన అనంత‌రం ఈ వ్యాక్సిన్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ ...

ర‌ష్యా వ్యాక్సిన్‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారంటే...

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు మొదటి వ్యాక్సిన్‌ సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించిన అనంత‌రం ఈ వ్యాక్సిన్‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా మాట్లాడుతూ ఈ టీకాకు సంబంధించిన‌ దుష్ప్రభావాలను ప‌రిశీలించ‌డం చాలా ముఖ్య‌మ‌ని అన్నారు. రష్యన్ టీకా సురక్షితంగా, ప్రభావవంతంగా ఉందో, లేదో చూడాల‌ని, ఎటువంటి దుష్ప్రభావాలు లేనివిధంగా, రోగనిరోధక శక్తిని పెంచేలా ఉండాల‌న్నారు. వీటిపై స్ప‌ష్ట‌త వ‌స్తేనే ముంద‌డుగు వేయ‌వ‌చ్చ‌న్నారు‌. ఈ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే సామర్ధ్యం భారతదేశానికి ఉంద‌న్నారు. కాగా ఈ టీకాను భారతదేశం, దక్షిణ కొరియా, బ్రెజిల్, సౌదీ అరేబియా, టర్కీ, క్యూబాలో ఉత్పత్తి చేయనున్నట్లు రష్యన్ కరోనా వ్యాక్సిన్ ప్రాజెక్టుకు నిధుల ఏజెన్సీ అయిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టెమెంట్ ఫండ్ ఒక‌ ప్రకటనలో తెలిపింది. అలాగే టీకాకు సంబంధించిన‌ మూడవ దశ ప‌రీక్ష‌ల‌ను సౌదీ అరేబియా, యూఎఇ, బ్రెజిల్, ఇండియా, ఫిలిప్పీన్స్ సహా ప‌లు దేశాలలో నిర్వహించాలని యోచిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇదిలావుండ‌గా అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా రష్యా వ్యాక్సిన్‌పై సందేహాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఈ టీకాకు సంబంధించి రష్యా అవసరమైన డేటాను త‌మ‌తో పంచుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో ఆరోపించింది. 


Updated Date - 2020-08-12T16:08:18+05:30 IST